తెలుగు సినిమా రంగానికి పుచ్చు, కేరళ వైద్యమే దిక్కా?
x

తెలుగు సినిమా రంగానికి పుచ్చు, కేరళ వైద్యమే దిక్కా?

తెలుగులోనూ “హేమ కమిటీ” కమిటి, ఆ హీరోలు, డైరక్టర్స్ లకు ఇక దబిడ దిబిడే


దక్షిణాది సినీ పరిశ్రమలలోకి మెల్లిగా మీటూ ఉద్యమం ప్రవేశిస్తోంది. రావటం కాస్త లేటు అయినా సినీ పరిశ్రమను అతులాకుతలం చేస్తోంది. ఇప్పటికే సినిమా పరిశ్రమలో నటీమణుల లైంగిక వేధింపుల వ్యవహారంపై కేరళ ప్రభుత్వం జస్టిస్‌ హేమా కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీని రిపోర్ట్ ను ఎప్పుడైతే కేరళ ప్రభుత్వం విడుదల చేసిందో, అప్పటి నుంచే మన సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమల్లోని నటీమణుల్లో ఒక ధైర్యం, తెగింపు వచ్చిందని చెప్పాలి. ఒక్కొక్కరూ తమ చేదు అనుభవాలను బహిరంగంగా చెప్పడం మొదలెడుతున్నారు. దీంతో తమిళ చిత్ర పరిశ్రమలోనూ హేమా కమిషన్‌ తరహాలో ఒక కమిటీ కావాలనే డిమాండ్‌ రావడంతో, దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్‌) అలాంటి కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేసే మహిళలు తమ బాధలు, చేదు అనుభవాలు చెప్పుకునేందుకు ధైర్యంగా బయిటకు వస్తున్నారు.

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్‌ హేమ కమిటీ సమర్పించిన నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూసాయి. ఈ నివేదిక వల్ల ఇప్పటి వరకు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి 17 కేసుల వరకు నమోదయ్యాయని తెలిసింది. నటులు జయసూర్య, మణియం పిళ్ల రాజుపై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. నటుడు సిద్ధిఖీపై రేప్ కేసు నమోదు చేశారు.

అలానే దర్శకుడు రంజిత్​పై కూడా పశ్చిమ బంగాకు చెందిన ఓ నటి ఆరోపణలు చేసింది. ఆయన తనను అసభ్యకరంగా తాకారని ఫిర్యాదు చేసింది. 2009లో ఈ సంఘటన జరిగినట్లు చెప్పింది. దీంతో ఆయనపై కూడా రేప్​ కేసు నమోదు చేశారు. కేరళకు చెందిన ప్రముఖ యాక్టర్​, అధికార పార్టీ CPI(M) ఎమ్మెల్యే ఎమ్ ముకేశ్​పై రేప్​ కేసును నమోదు చేశారు పోలీసులు.

సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్‌ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దీంతో ఈ విషయంపై ఇతర చిత్రసీమకు చెందిన పలువురు నటీనటులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలోనూ కాస్టింగ్‌ కౌచ్‌ ఉందని పలువురు ఆరోపణలు చేస్తున్నారు.

త్రివిక్రమ్ పై కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు

ఇంతలో .. జానీ మాస్టర్ వివాదం తేలకుండానే, నటి పూనం కౌర్ కొత్త చర్చను, వివాదాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. ఆమె డైరెక్ట్ గా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో ట్వీట్ వేసి సంచలనం సృష్టించింది. ఆ ట్వీట్ లో '‘త్రివిక్రమ్‌పై గతంలోనే మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశా. అప్పుడే త్రివిక్రమ్‌పై నా ఫిర్యాదు తీసుకుని విచారణ చేసి ఉంటే.. నేను, మరి కొందరు ఇన్ని రకాల రాజకీయ బాధలు పడేవాళ్లం కాదు. నేను సైలెంట్‌గా ఎంతో సఫర్‌ అయ్యాను. ఆ సమయంలోనే నేనీ విషయాన్ని చెప్పాను. ఫిర్యాదు కూడా చేశాను. కానీ అప్పుడు ఇండస్ట్రీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడైనా త్రివిక్రమ్‌ను విచారించాలని కోరుకుంటున్నా’’ అని పూనమ్‌కౌమ్‌ పేర్కొన్నారు.

త్రివిక్రమ్ మోసగాడు

చాలా కాలంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో (Trivikram) హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌కు (poonam kaur) మధ్య కొంతకాలంగా సోషల్‌ మీడియా వేదికగా వివాదం నడుస్తోంది. సందర్భం వచ్చిన ప్రతిసారీ ఆమె త్రివిక్రమ్‌పై విరుచుకుపడుతుంది. గతంలో కూడా త్రివిక్రమ్‌పై పూనమ్‌ ఎన్నో విమర్శలు చేసింది. అతనొక మోసగాడు అంటూ సోషల్‌ మీడియా వేదికగా ఎన్నోసార్లు మండిపడింది. పవన్‌కల్యాణ్‌కు, పూనమ్‌కు మధ్య సంబంధం ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో త్రివిక్రమ్‌ చురుగ్గా వ్యవహరించాడని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి ఆమె ట్విట్టర్‌ వేదికగా త్రివిక్రమ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి షాక్ ఇచ్చింది. మొన్నటివరకు అంటే ఇండైరెక్ట్ గా పేరు లేకుండా ట్వీట్స్ వేసింది కాబట్టి ఎవ్వరు పట్టించుకోలేదు. ఈసారి డైరెక్ట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరును ట్వీట్ చేయడంపై ఇండస్ట్రీ వర్గాలు ఉలిక్కి పడ్డాయి.

కంప్లైంట్ లేకుండా ముందుకు వెళ్లలేం

నటి పూనమ్‌ కౌర్‌ (Poonam Kaur)వివాద విషయమై దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Bharadwaja Thammareddy) స్పందించారు. ‘‘ఆమె ‘మా’కు ఫిర్యాదు ఎందుకు చేసిందో, ఏ సంవత్సరంలో చేసిందో మాకు తెలియదు. అప్పటికి కమిటీ ఏర్పాటై ఉంటే.. ఫిర్యాదు బాక్స్‌లో తన ఫిర్యాదు వేసి ఉంటే సరిపోయేది. కంప్లైంట్‌ లేకుండా మనం ముందుకెళ్లలేం. ‘మా’ వాళ్లు ఆ ఫిర్యాదును మాకు పంపించినా మేం చూసుకునేవాళ్లం. ఇప్పటికైనా ఫిర్యాదు అందితే చేస్తాం’’ అని తెలిపారు.

90 రోజుల్లో పరిష్కారం

అలాగే ‘ఇలాంటి కేసుల కోసమే 2013లో ఆసరా అని పెట్టాం. 2018లో ప్యానల్‌ పెట్టాం. ఇలాంటివి ఎన్ని తీసుకొచ్చినా మహిళలకు ధైర్యం ఇవ్వలేకపోతున్నాం. ఇండస్ట్రీలో మహిళలు సేఫ్‌గా ఉంటారని తెలియజేయడానికే మేము మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాం. 90 రోజుల్లో పరిష్కారం ఆలోచిస్తాం. మీరంతా కూడా సహకరించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

టాలీవుడ్‌ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్‌ కు చెందిన ఝాన్సీ మాట్లాడుతూ... ‘‘సంగీత, ప్రేమ, ప్రగతి తదితరలు ‘వాయిస్‌ ఆఫ్‌ విమెన్‌’లో భాగం. ఇటీవల సమంత దీని గురించే పోస్ట్‌ పెట్టారు. ‘వాయిస్‌ ఆఫ్‌ విమెన్‌’ ఇండస్ట్రీకి సంబంధించిందే తప్ప సెపరేట్ కాదు. ఛాంబర్‌.. ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తూనే ఉంది. ఎప్పుడైతే పెద్దవాళ్లు మాట్లాడతారో అప్పుడే దాని గురించి చర్చ జరుగుతుంటుంది. మా వద్దకు వచ్చిన ఫిర్యాదుల సంఖ్య సింగిల్‌ డిజిట్‌లోనే ఉంది. కొన్నింటికి తక్షణమే పరిష్కారం చూపాం. రెండు ఫేక్‌ కంప్లైట్స్‌ కూడా వచ్చాయి. పలువురు మహిళలు మిస్‌ యూజ్‌ కూడా చేస్తారనే ప్రశ్నలు ఎదురవుతుంటాయి.

ఫేక్ కంప్లైంట్స్ కూడా

ఫేక్‌ కంప్లైట్స్‌ వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానికీ ప్రత్యేక సెక్షన్‌ ఉంది. కమిటీలకు సివిల్‌ కోర్టుకు ఉండే పవర్స్‌ ఉంటాయి. జానీ మాస్టర్‌పై ఫిర్యాదు చేసిన అమ్మాయి విషయాకొస్తే.. పని ప్రదేశంలో లైంగిక వేధింపులు ఎదుర్కోవడమే కాదు వేరే ఎన్నో విషయాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. లీగల్‌గా, మెడికల్‌గా, పోలీసుల సాయం తీసుకోవడానికి ఒకవేళ ఆ అమ్మాయికి తగిన ధైర్యం/బలం లేకపోతే కమిటీ హెల్ప్‌ చేయగలగాలి. ఆ క్రమంలోనే భూమిక హెల్ప్‌లైన్‌ అనే ఎన్జీవో సపోర్ట్‌గా నిలిచింది . అవకాశాలు పోతాయనే భయంతో చాలా మంది తమకు ఎదురైన పరిస్థితులను చెప్పడం లేదని, ప్రతిభ ఉన్న వాళ్లకు ఇండస్ట్రీలో అవకాశాలు ఎప్పుడూ లభిస్తాయని ఝాన్సీ స్పష్టం చేశారు.

తెలుగులోనూ కమిటీ

ఈ క్రమంలో తెలుగులో స్టార్ కొరియోగ్రాఫర్ గా వెలుగుతన్న జానీ మాస్టర్ (Jani Master) కేస్ పెను దుమారం సృష్టించింది. ఈ విషయమై మా అసోసిషన్ & తెలుగు ఫిలిం ఛాంబర్ కలిసి ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి జానీ మాస్టర్ ఉదంతాన్ని సీరియస్ గా తీసుకున్నామని ప్రకటించి.. ఇకపై ఈ తరహా తప్పులు మళ్ళీ సంభవించకుండా ఉండేందుకు “హేమ కమిటీ” తరహాలోనే తెలుగు చిత్రసీమ కొరకు ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. ఇకపై ఈ తరహా ఉదంతాలు జరగకుండా జాగ్రత్త పడతామని కూడా వెల్లడించారు. తెలుగులోనూ “హేమ కమిటీ” లాంటి రిపోర్ట్ వస్తే ఇంకా చాలా మంది బయిటకు వస్తారని అంటున్నారు. చాలా మంది తెలుగు దర్శకులు, హీరోలు, క్యారక్టర్ ఆర్టిస్ట్ లకి గుండెల్లో రాయపడింది అంటున్నారు. ఏ రోజు ఎవరి పేరు బయిటకు వస్తుందనే దడ స్టార్ట్ అయ్యిందంటున్నారు.

Read More
Next Story