
‘జన నాయగన్’ తర్వాత ‘జైలర్ 2’ లీక్
తమిళ సినిమా పరిశ్రమలో భద్రతా లోపాలపై చర్చ
తమిళ సినిమా పరిశ్రమలో మరోసారి కంటెంట్ లీక్‌ల అంశం చర్చనీయాంశంగా మారింది. ‘జన నాయగన్’ సినిమా హెచ్‌డీ ప్రింట్ లీక్ అయిన కొద్ది రోజులకే, ‘జైలర్ 2’కి చెందిన ఒక క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ రెండు హైప్రొఫైల్ లీక్‌లు, కోలీవుడ్‌లో కంటెంట్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పెద్ద చిత్రాల విషయంలో కూడా సరైన రక్షణ చర్యలు తీసుకుంటున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వరుసగా లీక్‌లు..
దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ‘జైలర్ 2’ సినిమా సెట్స్ నుండి తీసిన ఒక వీడియో ఈ వారం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొట్టింది. ఈ లీక్‌ను నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ధృవీకరించింది. మీడియా, ఫ్యాన్ క్లబ్‌లు ఈ క్లిప్‌ను పంచుకోవద్దని స్పష్టంగా హెచ్చరించింది. పైరసీ వ్యతిరేక బృందం వెంటనే చర్యలు తీసుకుని కంటెంట్‌ను తొలగించే ప్రక్రియ ప్రారంభించింది. అలాగే, లీక్‌లో పాల్గొన్న సోషల్ మీడియా ఖాతాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించింది.
‘జన నాయగన్’ లీక్ కేసు..
ఏప్రిల్ 9న ‘జన నాయగన్’ సినిమా హెచ్‌డీ ప్రింట్ లీక్ కావడం పెద్ద కలకలం రేపింది. ఈ వీడియో ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో వేగంగా వైరల్ అయింది. ఈ కేసులో చెన్నై పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ఒక ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్ అని అధికారులు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా, అతను గతంలో ఉపయోగించిన ఎడిటింగ్ సూట్‌ను యాక్సెస్ చేసి, అందులో నిల్వ ఉన్న రీల్స్‌ను తన ఐక్లౌడ్‌కు బదిలీ చేసినట్లు గుర్తించారు.
‘నిర్లక్ష్యం కాదు’ అంటున్న చిత్ర పరిశ్రమ..
ఈ లీక్‌లు పెద్ద స్థాయిలో భద్రతా లోపాల వల్ల జరిగాయని భావించాల్సిన అవసరం లేదని నిర్మాత, చిత్ర రచయిత జి. ధనంజయన్ స్పష్టం చేశారు.
#JanaNayagan film leak by a freelance editor, who had access to the edit system is shocking and atrocious. A film made in almost ₹500 Cr budget is handled so casually and left to someone to steal and leak it easily.
— G Dhananjheyan (@Dhananjayang) April 16, 2026
Cannot believe such a thing can happen to a big budget film.… pic.twitter.com/rf9qREEEEd
“ఇది చాలా అరుదైన సంఘటన. ఎడిటింగ్ సూట్‌ను అద్దెకు ఇచ్చిన తర్వాత, దాన్ని యాక్సెస్ చేసిన వ్యక్తి రీల్స్‌ను కాపీ చేశాడు. ఇది వ్యవస్థలో లోపం కాదని,” అని ఆయన తెలిపారు.
అలాగే వ్యక్తిగత బాధ్యతపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. “నా కుమార్తె కూడా తన మొబైల్‌ను తాకనివ్వదు. అది గోప్యతగా భావిస్తుంది. అలాంటప్పుడు ఎవరో ఇలా నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారు?” అని అన్నారు.
‘జైలర్ 2’ క్లిప్ లీక్‌పై కూడా ఆయన స్పందిస్తూ..“సెట్స్‌లో ఉత్సాహంతో ఎవరో వీడియో తీసి పంచుకోవడం జరుగుతుంది. ఇది పెద్ద భద్రతా లోపం కాదు. ఇవి అరుదైన సంఘటనలు మాత్రమే,” అని చెప్పారు.
పరిశ్రమలో ఆందోళన..
అయితే వరుసగా జరిగిన ఈ ఘటనలు నిర్మాతలను అప్రమత్తం చేస్తున్నాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల విషయంలో భద్రతా చర్యలను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ విషయంలో అసాధారణంగా కఠిన వైఖరి తీసుకుంది. లీక్ క్లిప్‌ను పంచుకున్న అభిమానుల ఖాతాలను కూడా సస్పెండ్ చేయవచ్చని హెచ్చరించింది.
‘జన నాయగన్’, ‘జైలర్ 2’ లీక్‌లు కోలీవుడ్‌లో కంటెంట్ భద్రతపై మళ్లీ చర్చను తెరపైకి తెచ్చాయి. పరిశ్రమ ఇవి అరుదైన ఘటనలేనని చెబుతున్నప్పటికీ, డిజిటల్ యుగంలో ఇలాంటి లీక్‌లు పెద్ద సవాలుగా మారుతున్నాయి.

