
‘హిందీ రాష్ట్రాల కోసమే ఈ ప్లాన్’: అర్థరాత్రి గెజిట్ ఎందుకు తెచ్చారు?
ఒకవైపు కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని హామీ ఇస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం ఇది "సమాఖ్య వ్యవస్థపై జరుగుతున్న దాడి" అని మండిపడుతున్నాయి.
అమిత్ షా హామీ: దక్షిణాది సీట్లు తగ్గే ప్రసక్తే లేదు!
‘హిందీ రాష్ట్రాల కోసమే ఈ ప్లాన్’
Live Updates
- 17 April 2026 4:52 PM IST
మోదీ నాయకత్వంలో మహిళా రిజర్వేషన్లు
మహిళా రిజర్వేషన్ బిల్లుకు టీడీపీ సంపూర్ణ మద్దతిస్తోందని ఆ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. డీలిమిటేషన్ బిల్లుకు కూడా టీడీపీ మద్దతిస్తోందని స్పష్టం చేశారు. ‘రిజర్వేషన్ల పెంపుపై మహిళలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. చట్టసభల్లో మహిళల గొంతుక పూర్తిస్థాయిలో వినిపించే అవకాశం వచ్చింది. దేశంలో 50 శాతం ఉన్న మహిళల ఆకాంక్షలను నెరవేర్చాల్సి ఉంది. మహిళా రిజర్వేషన్లపై ఎన్నో ఏళ్లుగా పోరాటాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో మహిళా రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయి’ అని అన్నారు.
- 17 April 2026 3:34 PM IST
మహిళల పాత్ర, అమ్మమ్మ నేర్పిన పాఠం- రాహుల్
"మన జాతీయ దృక్పథంలో మహిళలు ఒక కేంద్ర శక్తి. మనందరి జీవితాల్లోని మహిళలు మనల్ని ప్రభావితం చేశారు, మనకు ఎంతో నేర్పించారు. నిన్న నా సోదరి (ప్రియాంక గాంధీ) నా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను సాధించలేనిది కేవలం 5 నిమిషాల్లో సాధించింది.. అది అమిత్ షా ముఖంలో చిరునవ్వు పూయించడం!" అని రాహుల్ చమత్కరించారు.
తన బాల్యంలో ఇందిరా గాంధీ నేర్పిన ఒక పాఠాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు: "చిన్నప్పుడు నాకు కుక్కలంటే చాలా భయం ఉండేది. ఒకరోజు మా అమ్మమ్మ నన్ను పిలిచి, చీకట్లో తోటలో వదిలేసి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత వచ్చి 'నీకు దేనిపై భయం?' అని అడిగింది. నేను కుక్కలని చెబితే.. ఆమె 'నువ్వు వాటికి భయపడటం లేదు, నీ మనసులోని ఊహలకు భయపడుతున్నావు. నిజం అనేది చీకట్లో ఉంటుంది, అక్కడికి వెళ్లే ధైర్యం లేకపోతే నీ భయాలను జయించలేవు' అని చెప్పింది. ఇది నాకు రాజకీయంగా, వ్యక్తిగతంగా పెద్ద పాఠం."
బిల్లుపై విమర్శలు:
మహిళల వెనుక దాగుడుమూతలు: "నిజం చెప్పాలంటే.. ఇది మహిళల బిల్లు కాదు, మరేదో! మహిళా బిల్లు 2023లోనే ఆమోదం పొందింది. ఇది మహిళలను అడ్డం పెట్టుకుని భారతదేశ ఎన్నికల మ్యాప్‌ను మార్చే ప్రయత్నం. మీరు నిజంగా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే ఇప్పుడే ఇవ్వండి, మేము మద్దతు ఇస్తాం. కానీ ఈ బిల్లు ఉద్దేశం అది కాదు."
ఓబీసీ, దళిత వ్యతిరేక అజెండా: "ఈ దేశంలో దళితులు, ఓబీసీల పట్ల సమాజం ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసు. నా ఓబీసీ సోదర సోదరీమణులకు అధికారం, ప్రాతినిధ్యం దక్కకుండా చేసేందుకే ఈ 'బైపాస్' ప్రక్రియను తెచ్చారు. ఇది 'సంవిధానం' (రాజ్యాంగం) పై 'మనువాదం' చేస్తున్న దాడి."
కుల గణన (Caste Census): "కుల గణన మొదలైందని అమిత్ షా చెబుతున్నారు. కానీ ఆ గణనను ఈ సభలో ప్రాతినిధ్యం కోసం వాడతారా లేదా? రాబోయే 10-15 ఏళ్ల వరకు వెనుకబడిన వర్గాలకు అధికారం దక్కకుండా చేసేందుకే మీరు ఈ కుట్ర చేస్తున్నారు."
దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల భయం:
ప్రాతినిధ్యంపై దాడి: "బీజేపీ అధికారంలో కొనసాగడం కోసం దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు మరియు చిన్న రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని లాగేసుకుంటామని మీరు చెబుతున్నారు. ఇది దేశ వ్యతిరేక చర్య. దీన్ని మేము ఏమాత్రం ఒప్పుకోము."
యూనియన్ ఆఫ్ ఇండియాపై దాడి: "దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల నా సోదర సోదరీమణులకు నేను హామీ ఇస్తున్నాను.. మీరు భయపడకండి. భారతదేశ సమాఖ్య వ్యవస్థపై (Union of India) దాడి చేయడానికి మేము వారిని అనుమతించము. మీ ప్రాతినిధ్యాన్ని తాకే ధైర్యం కూడా వారు చేయలేరు."
చరిత్రను గుర్తు చేస్తూ: "ఇదే ప్రశ్న గతంలో ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయిల ముందుకూ వచ్చింది. కానీ వారు ఇలాంటి అన్యాయం జరగకుండా చూశారు."
సభలో గందరగోళం:
రాహుల్ వ్యాఖ్యలపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ.. కాంగ్రెస్ గతంలో బీసీ రిజర్వేషన్లను ఎందుకు అడ్డుకుందని, రాజీవ్ గాంధీ ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించారని విమర్శించడంతో సభలో గందరగోళం నెలకొంది.
- 17 April 2026 2:48 PM IST
రిజర్వేషన్లు లేకుండానే మేము పార్లమెంటుకు వచ్చాం: హర్‌సిమ్రత్ కౌర్ బాదల్
శిరోమణి అకాలీదళ్ (SAD) నాయకురాలు హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ శుక్రవారం (ఏప్రిల్ 17, 2026) లోక్‌సభలో మాట్లాడుతూ, "మేము డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడం లేదు" అని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు లేకపోయినా తాము పార్లమెంటుకు చేరుకున్నామని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.
నేడు సాయంత్రం 4 గంటలకు కీలక ఓటింగ్
మహిళా కోటా చట్ట సవరణ మరియు డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన మూడు కీలక బిల్లులపై శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరుగుతుందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
అమల్లోకి వచ్చిన మహిళా రిజర్వేషన్ చట్టం
చట్టసభల్లో మహిళలకు 33% కోటాను కల్పించే మహిళా రిజర్వేషన్ చట్టం 2023, నిన్నటి నుండి (ఏప్రిల్ 16, 2026) అమల్లోకి వచ్చినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, 2029లో ఈ చట్టాన్ని అమలు చేయడానికి అవసరమైన సవరణలపై పార్లమెంటులో చర్చ జరుగుతున్న సమయంలోనే, హఠాత్తుగా 2023 నాటి చట్టాన్ని ఎందుకు నోటిఫై చేశారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
- 17 April 2026 1:06 PM IST
వైఎస్సార్‌సీపీ మద్దతు.. కానీ ప్రత్యేక హోదా గుర్తుండాలి: మిథున్ రెడ్డి
లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ బిల్లులకు తమ పార్టీ మద్దతు ప్రకటించారు. అయితే అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాలపై గట్టిగా మాట్లాడారు.
ప్రాంతీయ అసమానతలు: డీలిమిటేషన్ ప్రక్రియలో ఎక్కడా ప్రాంతీయ అసమానతలు రాకుండా చూడాలని, ఇది విపక్షాలను అణగదొక్కే సాధనంగా మారకూడదని కోరారు.
మహిళా భద్రత: "ఏపీలో మేము అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు 50% రిజర్వేషన్లు ఇచ్చాం. కానీ ప్రస్తుతం ఏపీలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. నలుగురు ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తూ దొరికిన దాఖలాలు ఉన్నాయి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని డిమాండ్ చేశారు.
ప్రత్యేక హోదా: విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని మిథున్ రెడ్డి గుర్తు చేశారు. "చట్టంలో లేదని హామీని మర్చిపోవడం సరికాదు, ఏపీకి న్యాయం చేయాలి" అని ఆయన కేంద్రాన్ని కోరారు.

