మిల్లెట్స్ ముందు మోకరిల్లిన కాకా! అదిరింది బొమ్మ ఆహా!!
x
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన చిత్రాన్ని బహుకరిస్తున్న మిల్లెట్స్ ఆర్టిస్ట్ మోకా విజయ్ కుమార్ (ఫోటో కర్టసీ- వలేటి గోపీచంద్)

మిల్లెట్స్ ముందు 'మోక'రిల్లిన కాకా! అదిరింది బొమ్మ ఆహా!!

ఎవరీ మిల్లెట్ ఆర్టిస్ట్ మోకా? ఏమిటాయన తపన!


ఆయనో చిరుద్యోగి.. కానీ చిట్టిగింజలంటే భలే ఇష్టం. అందరూ పండిస్తారు, ఈయన మాత్రం చిత్రిస్తుంటారు.
ఆయన పేరే మోకా విజయ్ కుమార్. ఊరు విశాఖపట్నం. తెలుగు రాష్ట్రాల్లో చిరుధాన్యాల ప్రచారాన్ని భుజానికెత్తుకున్నారు. పోషక విలువల్ని ఊరూవాడా ప్రచారం చేస్తున్నారు.

ఈయన రైల్వే ఉద్యోగి. బ్రష్‌లు రంగులుతో పని లేదు. కేవలం చిరుధాన్యాల తో నే భలే, భలే అందాలు సృష్టిస్టారు. అందర్నీ ఆకట్టుకుంటారు. రాగులు, సజ్జలు, అరికలు, సామలుతో రంగుల్ని మించిన బొమ్మలు వేస్తుంటారు. ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య మొదలు 'రైతునేస్తం' పద్మశ్రీ వై. వెంకటేశ్వరరావు వరకు ఎందరెందరో విజయ్ మిల్లెట్ సృజనకు నీరాజనాలు పలికారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎన్నెన్నో ప్రశంసలు.

ఇంటర్ తరువాత సికింద్రాబాద్ లాలాపేట రైల్వేస్ శిక్షణ సంస్థ లో శిక్షణ పొంది ఫిట్టర్ గా గుంతకల్లు లో కొలువులో చేరారు. తరువాత వైజాగ్ కు బదిలీ అయ్యారు. ఇప్పుడు గ్రేడ్-1 ఫిట్టర్ గా ఉన్నారు.
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో 50 మంది ప్రముఖుల చిత్రాలను చిరుధాన్యాలతో కళాత్మకంగా తీర్చిదిద్ది 'IBR Achiever' గుర్తింపు పొందారు.
ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సామాజిక, సాంస్కృతిక ఐక్యతను చాటేలా 24 అడుగుల పొడవైన అక్రైలిక్ క్యాన్వాస్ చిత్రాన్ని రూపొందించి స్థానం పొందటమే కాకుండా ఆసియా బుక్ ఆఫ్ రికార్డు సృష్టించారు. మిరాకిల్స్ వరల్డ్ రికార్డ్స్ , తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటి వేదికల నుండి కూడా ప్రశంసలు లభించాయి.
G20 సదస్సులో తన మిల్లెట్ కళాఖండాలను ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ప్రముఖులకు తన చేతితో చిరుధాన్యాల తో గీసిన మిల్లెట్ చిత్రాలను బహూకరించారు.

అక్టోబర్ 16 న ప్రపంచ ఆహార దినోత్సవం నాడు ఆయన తన చిత్రాలతో విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో మానవ ఆహారపు అలవాట్ల పరిణామాన్ని తెలియజేసే 16 ప్రత్యేక మిల్లెట్ చిత్రాలు ఏర్పాటు చేశారు. అదే సమయం లో మిల్లెట్ వంటకాల రుచులను కూడా ప్రదర్శన సందర్శకులకు సొంత ఖర్చుతో రుచి చూపించారు.

తిండిగింజలతో యేసు జీవితం
ఈయన ప్రతిభ ఇండియా నుంచి వాటికన్ దాకా చేరింది. యేసుక్రీస్తు జీవిత చరిత్రపై '14 స్టేషన్స్ ఆఫ్ ది క్రాస్' (14 Stations of the Cross) మిల్లెట్ చిత్రాల కలెక్షన్‌ను రూపొందించి వాటిని వ్యాటికన్ చర్చ్ (St. Peter's Basilica)కు పంపే అరుదైన మైలురాయిని సాధించారు.
చిరుధాన్యాలు మన శరీరానికి అవసరమైన సమగ్ర, సంపూర్ణ పోషకాలు అందిస్తాయి. వీటిలో పీచు పదార్థం , ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇటువంటి సాంప్రదాయ ఆహారాన్ని వదిలేసి, మన ఆరోగ్యాన్ని మనమే చేతులారా నాశనం చేసుకుంటున్నాం అనేది ఆయన ఆవేదన. అనాది నుంచి నేటి వరకు, భవిష్యత్తులో మన ఆరోగ్యం అంశాలపై ఒక ప్రత్యేకమైన చిత్రకళా ప్రదర్శన ను ప్రపంచ ఆహార దినోత్సవం రోజు అక్టోబర్ 16 న మోకా నిర్వహించి, తద్వారా ఆదిమ కాలం నుంచి చిరుధాన్యాల అవగాహన విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చిత్రకళా రూపాల్లో చూపారు.
సాంప్రదాయ వైద్యంలో చిరు ధాన్యాల ప్రస్తావన, వలస పాలనలో ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, ఆధునిక ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ వినియోగం, వాటితో ముడిపడిన ఆరోగ్య సమస్యల అంశాలను చిరుధాన్యాలతో చిత్రించిన తీరు అనన్య సామాన్యం.

"నా ఉద్దేశ్యం కేవలం చిత్రాలు గీయడం కాదు. మన పూర్వీకుల ఆహార సంస్కృతి, చిరుధాన్యాల ప్రాముఖ్యత, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని భావితరాలకు కళ ద్వారా పరిచయం చేయటం. నేను మాత్రం చిరుధాన్యాలతో కళాఖండాలను రూపొందిస్తూ, కళ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాను. మిల్లెట్స్‌ను తిరిగి మన ఆహారంలో భాగం చేసు కోవటం ద్వారా ఒక వైపు ఆరోగ్యం మరో వైపు రైతులకు మేలు జరగాలని కోరుకుంటున్నాను" అని మోకా విజయ్ కుమార్ అంటున్నారు.
ప్రధాని మోదీ జీవిత చరిత్ర ను ప్రతిబింబిస్తూ 3×3 అడుగులు పరిమాణం లో 9 చిత్రాలు మిల్లెట్స్ తో రూపొందించి ప్రధానికి వ్యక్తిగతంగా కలిసి కానుకగా ఇవ్వాలనేది విజయ్ కుమార్ కోరికట.
2023లో మొదలైన తన మిల్లెట్స్ కళా ప్రయాణంలో పది కంటే ఎక్కువ ప్రపంచ రికార్డులు, అంతర్జాతీయ గుర్తింపులు సాధించారు.

“ఆహారం మనిషి జీవితానికి పునాది. మన మూలాలను గుర్తుచేసుకుని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను భవిష్యత్తు తరాలకు అందించటమే నా కళా ప్రయాణం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం” అంటున్నారు మోకా విజయ కుమార్.

(రచయిత- వలేటి గోపీచంద్, ఆకాశవాణి మాజీ ఉద్యోగి)
Read More
Next Story