
తల్లి శోభతో విజయ్
హలో విజయ్, మీ కులమేంటీ?
నిన్న ఒక్క రోజే ఎన్ని లక్షల మంది వెతికారో తెలుసా..
దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'దళపతి' విజయ్ పేరు మారుమోగుతోంది. తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ స్థాపించి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరుణంలో... ఆయన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ఆయన కులం గురించి నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేవలం ఎన్నికల ఫలితాల రోజున (మే 4) సుమారు 80 లక్షల సార్లు ఆయన కులం గురించి గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు అంచనా.
తల్లిదండ్రులతో విజయ్
భారతదేశంలో ఒక వ్యక్తి సాధించిన విజయం కంటే, ఆ విజయం వెనుక ఉన్న సామాజిక వర్గంపై ఆసక్తి చూపడం పాత అలవాటే. ఇప్పుడు విజయ్ విషయంలోనూ అదే రిపీట్ అవుతోంది.
ఇంతకీ విజయ్ కులం ఏంటి?
విజయ్ దళితుడని లేదా మాదిగ సామాజిక వర్గానికి చెందినవాడని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదంటున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆయన నేపథ్యం ఇలా ఉంది..
విజయ్ తండ్రి వైపు మూలాలు దక్షిణ తమిళనాడులోని రామేశ్వరం (రామనాథపురం జిల్లా) ప్రాంతంలో ఉంటే, తల్లి వైపు మూలాలు రాజధాని నగరం చెన్నైలో ఉన్నాయి.
విజయ్ తండ్రి సముద్రాల ఆంథోనీ చంద్రశేఖర్ (ఎస్.ఏ.చంద్రశేఖర్) వెల్లాలర్ (Vellalar) సామాజిక వర్గానికి చెందిన వారు. తమిళనాడులోని రామేశ్వరం తీరప్రాంతానికి (తంగచిమడం) చెందిన భూస్వామ్య కుటుంబం. విజయ్ కుటుంబం రోమన్ క్యాథలిక్ క్రైస్తవ మతాన్ని అనుసరిస్తోంది. అందుకే చంద్రశేఖర్ పేరులో ఆంథోనీ వచ్చింది. బాప్టిజం తీసుకున్నప్పుడు ఆయనకు కలిపిన అదనపు పేరు. ఇక విజయ్ పూర్తి పేరు విజయ్ జోసెఫ్.
ఆయన తల్లి శోభ బ్రాహ్మిణ్. పుట్టి, పెరిగిందంతా మద్రాసులోనే. సాంప్రదాయ తమిళ బ్రాహ్మణ కుటుంబం. ఆమె తండ్రి (విజయ్ తాత) శ్రీనివాస అయ్యర్. అప్పట్లో మైలాపూర్ వంటి ప్రాంతాలలో ఉండేవారు. శోభ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. చెన్నైలోని సంగీత సభలతో మంచి అనుబంధం ఉండేది.
ఎస్.ఏ. చంద్రశేఖర్ సినిమా ప్రయత్నాల్లో చెన్నైకి వచ్చినప్పుడే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. మతాలు వేరైనా (ఆయన క్రైస్తవుడు, ఆమె హిందూ), పెద్దలను ఒప్పించి వారు చెన్నైలోనే వివాహం చేసుకున్నారు. సినీ రంగంలో చంద్రేశేఖర్ ను S.A.C.గా పిలుస్తుంటారు. కేవలం దర్శకుడిగానే కాకుండా, నిర్మాతగా, రచయితగా, నటుడిగా కూడా తమిళ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా సామాజిక సమస్యలు, విప్లవాత్మక భావజాలం ఉన్న సినిమాలను తెరకెక్కించడంలో ఆయన దిట్ట.
శోభ శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యం సంపాదించి, అనేక సినిమాల్లో నేపథ్య గాయనిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
విజయ్ కుటుంబం రెండు విభిన్న సామాజిక, మతపరమైన నేపథ్యాల కలయిక.
విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం (Sangeeta Sornalingam) శ్రీలంక వాసి. 1999లో వీరి పెళ్లి జరిగింది. ఆమె శ్రీలంక తమిళ హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తి. వీరి వివాహం ఇరు మతాల సంప్రదాయాల ప్రకారం జరిగింది.
వెల్లాలర్ అంటే ఎవరు?
వెల్లాలర్ అనేది తమిళనాడు, కేరళలో అత్యంత పురాతనమైన, గౌరవప్రదమైన వ్యవసాయ, భూస్వామ్య కులం. చారిత్రక కాలంలో చోళ, పాండ్య రాజుల వద్ద ఉన్నత అధికారులుగా, సేనాధిపతులుగా పనిచేశారు.
తమిళ జనాభాలో సుమారు 33% వరకు ఉన్న ఈ సామాజిక వర్గం ఉంది. వీరు రాజకీయంగా, ఆర్థికంగా చాలా బలమైనది. వీరు తమ పేర్ల చివర పిళ్లై, మొదలియార్, గౌండర్ వంటి బిరుదులను వాడుతుంటారు.
కులానికి అతీతంగా 'నో కాస్ట్' ప్రస్థానం
విజయ్ రాజకీయాల్లోకి రాకముందే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన విజయానికి కులం పునాది కాదు అనడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. విజయ్ స్కూల్లో చేరేటప్పుడే ఆయన తండ్రి కులం కాలమ్‌లో "కులం లేదు (No Caste)" అని నమోదు చేయించారు. చిన్నతనం నుంచే ఆయనకు కులరహిత ముద్ర పడింది.
తమిళనాడులో క్రైస్తవుల సంఖ్య 4 శాతం కంటే తక్కువే. అటువంటి స్థితిలో ఒక మైనారిటీ గుర్తింపు ఉన్న నటుడు 'సూపర్ స్టార్' స్థాయికి ఎదిగారంటే అది కేవలం ఆయన స్వయంకృషి, ప్రతిభ వల్లే సాధ్యమైంది.
తెలుగు రాష్ట్రాల్లో లాగా తమిళనాట సినిమా రంగంలో 'కాపు, కమ్మ' వంటి ఆధిపత్య కులాల పోరు తక్కువ. అందుకే అక్కడ మలయాళీ అయిన ఎంజీఆర్, బ్రాహ్మణురాలైన జయలలిత, సంగీతకారుల వర్గానికి చెందిన కరుణానిధిలను ప్రజలు గుండెలకు హత్తుకున్నారు. ఇప్పుడు విజయ్ విషయంలోనూ అదే కనిపిస్తోంది.
రాజకీయ కోణం.. భవిష్యత్తు అడుగులు
విజయ్ దళితుడనే భ్రమ కలగడానికి ఆయన క్రైస్తవ గుర్తింపు ఒక కారణం కావచ్చు. కానీ వాస్తవానికి ఆయన ఒక ఉన్నత సామాజిక వర్గ నేపథ్యం నుండి వచ్చి, అందరినీ కలుపుకుపోయే నాయకుడిగా ఎదగాలని చూస్తున్నారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అధికార డీఎంకేపై ఉన్న కొంత అసంతృప్తి, ముఖ్యంగా కుటుంబ పాలనపై వస్తున్న విమర్శలు విజయ్‌కు కలిసొచ్చే అంశాలు. యువత (Millennials) పెద్ద ఎత్తున ఆయన వైపు మొగ్గు చూపుతున్నారు. చరిత్రలో కొన్నిసార్లు మార్పులు ఊహించని విధంగా జరుగుతాయి. విజయ్ రాజకీయ ప్రవేశం కూడా తమిళ రాజకీయాల్లో అటువంటి ఒక 'మిరాకిల్' అని విశ్లేషకులు భావిస్తున్నారు.
కులం గురించి గూగుల్‌లో వెతికే వారికి విజయ్ ఒక 'వెల్లాలర్' అని సమాధానం దొరకవచ్చు. కానీ, క్షేత్రస్థాయిలో ఆయనను అభిమానించే కోట్లాది మందికి మాత్రం ఆయన కేవలం తమిళుల ప్రతినిధి మాత్రమే!
Next Story

