తిరుమలలో యాత్రికులకు గదుల కేటాయింపులో నిబంధనలు కఠినతరం చేశారు. సామాన్య యాత్రికులను దృష్టిలో ఉంచుకుని గంటల తరబడి నిరీక్షించకుండా ఉప కార్యాలయాలు ( ) టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల సీఆర్ఓ కార్యాలయం వద్ద గంటల కొద్ది పడిగాపులు కాసే అవస్థలు లేకుండా నివారించడం, సమయం కూడా వృధా కాకుండా ప్రత్యేక వెసులుబాటు కల్పించింది.
"శ్రీవారి దర్శనం, గదుల కోసం టీటీడీ వెబ్ సైట్ ను వినియోగించాలి" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు సూచించారు. తిరుమలలో దర్శనాలే కాదు. గదుల కేటాయింపులో కూడా పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి సగటున రోజుకు లక్ష మంది వరకు వస్తుంటారు. వారిలో వీఐపీలు, వారి పక్షాన వచ్చే ప్రముఖులు కూడా ఉంటారు. తిరుమలలో దాదాపు ఏడు వేల వరకు అతిథి గృహాలు, కాటేజీలు, సముదాయాలు అందుబాటులో ఉన్నాయి.
"తిరుమల యాత్రకు వచ్చే భక్తులకు నిరీక్షించే బాధ నుంచి విముక్తి కల్పించే దిశగా సంస్కరణలు అమలు చేస్తున్నాం" అని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. దళారుల బెడద నివారించే దిశగానే నిబంధనలు కఠినం చేశామని ఆయన చెప్పారు.
సాధారణ బడ్జెట్
తిరుమలలో రూ. 50 నుంచి రూ. వెయ్యి అద్దెతో వసతి గదుల సముదాయాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రధానంగా, అంజనాద్రి నగర్ కాటేజీ (ANC)
, శేషాద్రినగర్ కాటేజీ (SNC), శంఖుమిట్ట (SMC), గురుడాద్రి (GNC), నగర్, హిల్ వ్యూ (HVC), ఆళ్వార్ ట్యాంక్, కాటేజీ (ATC) ట్రావెలర్స్ బంగ్లా కాటేజీ (TBC) ప్రాంతాల్లో గదులు యాత్రికులకు అందుబాటులో ఉన్నాయి.
తిరుమలకు రాగానే..
తిరుమలకు చేరుకోగానే యాత్రికుడు మొదట ప్రాధాన్యత ఇచ్చేది. సేదదీరడానికి గది కోసం వెంపర్లాట పడతారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా, శ్రీవారి భక్తులు ముందుగా తిరుమలలోని కేంద్రీయ విచారణ కార్యాలయం ( CRO) వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఉదయం ఐదు గంటల నుంచి సీఆర్వో కార్యాలయం పనిచేయడం ప్రారంభిస్తుంి. గదుల అందుబాటులో ఉన్నంత వరకు సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
అవసరమైన పత్రాలు..
తిరుమలలోని సీఆర్ఓ కార్యాలయం వద్ద యాత్రికులు క్యూలోకి చేరాలి. తమ వంతు వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద తమ ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా జిరాక్స్ కాపీ అందించాలి. సెల్ ఫోన్ నంబర్ వివరాలు తెలియజేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ఆధారంగా యాత్రికుడి పేరు, వివరాలు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ కౌంటర్ వద్ద రెండు కేటగిరీలకు సంబంధించిన గదుల్లో తమకు నచ్చిన కేటగిరీని ఎంచుకోవచ్చు.
1) A కేటగిరీలో రూ.50, రూ.100 గదులు,
2) B కేటగిరీలో రూ.1000 గదులు ఉంటాయి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే భక్తులకు ఒక అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ఇస్తారు. క్యూ వద్ద భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, అన్న ప్రసాదం, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
గదుల కోసం మార్గదర్శకాలు
తిరుమలలో గది తీసుకోవాలంటే 21 సంవత్సరాలు నిండాలి.
ఒకసారి గది తీసుకుంటే, ఆ వ్యక్తికి 30 రోజుల వరకు ఆ సదుపాయం వర్తించదు.
ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే క్యూలోకి రావాలి.
ఒంటరి వ్యక్తికి లేదా అవివాహితులకు గదులు కేటాయించరు.
రిజిస్ట్రేషన్ తరువాత..
తిరుమలలో సీఆర్ ఓ కార్యాలయం వద్ద గది కోసం పేరు, వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత సీఆర్వో వద్ద ఉన్న డిస్ప్లే బోర్డులలో వరుస క్రమంలో రిజిస్ట్రేషన్ సంఖ్య కనిపిస్తుంది. ఆ క్రమ సంఖ్య కనిపించిన 15 నిమిషాల్లో కేటాయించిన గదికి సంబంధించిన సమాచారం సెల్ ఫోన్ మెసేజ్ రూపంలో అందుతుంది. ఒకయ వేళ మెసేజ్ రాలేదు అనుకోండి..
రిజిస్ట్రేషన్ తరువాత డిస్ ప్లే బోర్డులో మీకు కేటాయించిన క్రమ సంఖ్య వచ్చింది అనుకోండి. సెల్ ఫోన్ కు మెసేజ్ రాకున్నా, ఆందోళన అవసరం లేదు. సీఆర్వో వద్ద ఏర్పాటు చేసి కీయోస్క్ మిషన్లు సమాచారం ఇస్తాయి. రిజిస్ట్రేషన్ తరువాత సీఆర్ఓ ఆఫీసు సిబ్బంది మీకు రసీదు ఇస్తారు. ఆ స్లిప్ లోని కోడ్ కియోస్క్ మిషన్ లో స్కాన్ చేస్తే చాలు. మీకు ఎక్కడ గది కేటాయించారనే సమాచారం అందిస్తుంది.
తిరుమలలోని సీఆర్ఓ కార్యాలయం మీదుగా టీటీడీ ఉచిత ఏసీ విద్యుత్ బస్సులు నడుపుతోంది. యాత్రికులు తమకు గదులు కేటాయించిన ప్రదేశం వద్దకు ఉచితంగా చేరవచ్చు. ఆ బస్సులో ఎక్కితే చాలు. ఆ బస్సు అటెండెంట్ బస్సు ఎక్కడ ఆగుతుంది. అది ఏ బస్ స్టాప్ అనేది చెబుతుంటారు. డిజిటల్ స్క్తీన్ పై డిస్ప్ల అవుతుంటుంది.
ఉచిత బస్సులో తిరుమలలోని ఉప విచారణ కార్యాలయాల వివరాల వద్దకు చేరవచ్చు.
- అంజనాద్రి నగర్ కాటేజస్. (ANC)
- శ్రేషాద్రి నగర్ కాటేజస్. (SNC)
- శంఖుమిట్ట కాటేజస్. (SMC)
- గరుడాద్రి నగర్ కాటేజస్. (GNC)
- హిల్ వ్యూ కాటేజస్. (HVC)
- సుదర్శన సత్రం. (1NC)
- గోవర్ధన్ సత్రం. (2NC)
- కళ్యాణి సత్రం. (3NC)
- సప్తగిరి విశ్రాంతి గృహం. (SPGH)
- రామ్ భగిచా విశ్రాంతి గృహం-2. (RBGH-2)
- వరాహ స్వామి విశ్రాంతి గృహం -1. (VSGH-1)
- వరాహ స్వామి విశ్రాంతి గృహం -2. (VSGH-2)
- అష్ట వినాయక విశ్రాంతి గృహం. (AVSRH)
- కౌస్తుభం విశ్రాంతి గృహం. (KTBGH)
- పాంచజన్యం విశ్రాంతి గృహం. (PJMGH)
- మాతృశ్రీ వకుళామాత విశ్రాంతి గృహం. (MVRH)
- నందకం విశ్రాంతి గృహం. (NDKRH)
- సూరాపురం తోట (SPT)
ఈ విచారణ కార్యాలయాల వద్దకు వెళ్లిన తరువాత యాత్రికుడు తమ వివరాలు చెప్పాలి. వారికి గది కేటాయించిన ప్రాంతంలోని ఉప విచారణ కార్యాలయాలకు చేరుకుని గదికి సంబంధించిన అద్దె ఆన్ లైన్ (ఫోన్ పే/ గూగుల్ పే/యూపీఐ/క్రిడిట్ కార్డు/డెబిట్ కార్డు ద్వారా మాత్రమే చెల్లించి తాళాలు తీసుకోవాల్సి ఉంటుంది.
నిబంధనలు కఠినం..
తిరుమలకు యాత్రికుల తాకిడి పెరిగిన నేపథ్యంలో యాత్రికులకు గదుల కేటాయింపు, ఖాళీ చేయించే నిర్ధష్ట సమయాలను అమలు చేస్తున్నారు. దీని కోసం టీటీడీ కొన్ని నిబంధనలు అమలు చేస్తోంది.
1) గది 24 గంటలకు మాత్రమే కేటాయిస్తారు.
ఒకవేళ 24 గంటలు దాటితే టారీఫ్ 200 శాతం, 48 గంటలు దాటితే 400 శాతం పెరుగుతుంది.
2) నీరు, విద్యుత్ ను వృథా చేయరాదు.
3)తిరుమలలో ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లను ఉపయోగించరాదు.
4) జగ్గులు, నీటి గ్లాసులను ఉపయోగించాలి
5) తడి, పొడి చెత్త వాటికి వేరువేరుగా కేటాయించిన చెత్త బుట్టలలో వేయాలి.
6) భక్తులు వారి వస్తువులను వారే బాధ్యత వహించాలి.
7 గది తీసుకున్న యాత్రికులు మాత్రమే గది ఖాళీ చేయాలి. ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో .. ఆ వ్యక్తి మాత్రమే ఫేస్ రికగ్నైజేషన్ లో నమోదు చేస్తేనే కాషన్ డిపాజిట్ తిరిగి ఇవ్వరు.
8 గదిని వేరొకరికి ఇవ్వడం పూర్తిగా నిషిద్ధం. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.