అద్భుత శిల్ప కళకు నిలయం
ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం
ఏప్రిల్ ఒకటిన శ్రీసీతారాముల కల్యాణం
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం శ్రీరామనవమి ఉత్సవాలకు సిద్ధం అవుతోంది. రాష్ట్ర విభజన తరువాత శ్రీ సీతారాముల కల్యాణాన్ని ఒంటిమిట్టలో రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చురుకుగా చేస్తోంది. ఉత్సవాల నేపథ్యంలో ఆలయం కొత్తకాంతులు సంతరించుకుంది. శతాబ్దాల కాలం కాలగమనంలో కూడా వన్నె తగ్గని శిల్పకళ కనువిందు చేస్తోంది.
ఏకశిలా నగరం
ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఏకశిలపై సీతా సమేత లక్ష్మణుల విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడ ఆంజనేయుడి విగ్రహం లేకపోవడం ఓ ప్రత్యేకత. విజయనగర పాలకులు నిర్మించిన ఈ ఆలయంలో శిల్పాలు జీవకళ కనిపిస్తుంది. స్థపతుల నైపుణ్యానికి అద్దం పడుతుంది. 2015 సెప్టెంబర్ తొమ్మిదో తేదీ ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత టీటీడీ ఉత్సవాల నిర్వహణతో పాటు తిరుమల తరహాలో నిత్యాన్నదాన పథకాన్ని కూడా విస్తరించింది.
శిల్పాల్లో కనిపించే జీవకళ
ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం అద్భుత శిల్ప సంపదకు నిలయంగా ఉంది. ఈ ఆలయంలోని శిల్పాలు విజయనగర కాలం నాటి శిల్పకళ వైభవాన్ని గుర్తు చేస్తాయి. రంగమండపంలోని యాళి స్తంభాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. భారీ గండశిలలను యాళి స్తంభాలుగా మలచిన తీరు శిల్పుల అపూర్వ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
రాయలవారి వంశస్తుల కాలంలో నిర్మితమైన అనేక ఆలయాలలో యాళి స్తంభాలు కనిపిస్తాయి. అయితే ఒంటిమిట్ట ఆలయంలో ఒక్కో స్తంభం మధ్యలో నిలువుగా ఖాళీ స్థలం ఉండి, అందులో ఒక వ్యక్తి కూర్చోగలిగే విధంగా ఉండటం ప్రత్యేకత. రంగమండపంలోని స్తంభాలపై పురాణ ఘట్టాలను ప్రతిబింబించే శిల్పాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. వాటిలో రెండు స్తంభాలు సంప్రదాయ పేట్రస్ శైలిలో ఆకర్షిణీయంగా తీర్చిదిద్దారు.
ఆలయ చరిత్ర
పురాణ కథనాల ప్రకారం చరిత్ర ఏమి చెబుతోందంటే.. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై దండకారణ్యంలో సంచరిస్తున్నారట. ఆ సమయంలో, సీతాదేవి దప్పిక తీర్చేందుకు భూమిలోకి బాణం సంధించగా అక్కడ నీటి బుగ్గ ఉద్భవించింది. అదే నేటి ఒంటిమిట్టలోని పవిత్ర రామతీర్థంగా భావిస్తున్నారు.
రావణ సంహారం కోసం శ్రీరాముడికి సహకరించిన జాంబవంతుడు సేవించిన శ్రీ సీతా లక్ష్మణ సమేత రామచంద్రుడే నేడు ఒంటిమిట్ట ఆలయంలో కొలువై ఉన్నారని భక్తుల విశ్వాసం. ఒకే రాతిపై శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు చెక్కబడినందున ఈ ప్రాంతాన్ని “ఏకశిలా నగరం” అని కూడా పిలుస్తారు.
17వ శతాబ్దంలో ఆలయం పూర్తి..
ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలోని శాసనాల ప్రకారం ఈ దేవాలయ నిర్మాణం 14వ శతాబ్దంలో ప్రారంభమై 17వ శతాబ్దానికి పూర్తయింది. 1356లో బుక్కరాయలు ప్రారంభించిన ఈ నిర్మాణాన్ని అనంతరం విజయనగర రాజులు, మట్లి రాజులు అభివృద్ధి చేశారు. అంతరాలయం, రంగమండపం, మహా ప్రాంగణం, గోపురాలు వంటి నిర్మాణాలు ఈ కాలంలో నిర్మించారు.
కవులకు నిలయం
ఒంటిమిట్ట క్షేత్రం ఎన్నో మంది మహాకవులకు ప్రేరణ ఇనిచ్చిన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. మహాకవి శ్రీపోతన మాత్యులు ఇక్కడే భావగవతాన్ని తెలుగులోకి రాసినట్లు విశ్వసిస్తారు. అయ్యలరాజు తిప్పయ్య ఒంటిమిట్ట శ్రీ కోదండరామునిపై రఘువీర శతకం రచించి అంకితం చేశారు. రామభద్రకవి రామాభ్యుదయం రచించారు.
నల్లకాల్వ అయ్యప్ప ఒంటిమిట్ట రాముని అనుగ్రహంతో వరకవిగా ప్రసిద్ధి పొందారు. ఉప్పుగుండూరు వేంకటకవి దశరథరామ శతకం రచించారు. ఆంధ్రవాల్మీకిగా ప్రసిద్ధిగాంచిన వావిలికొలను సుబ్బారావు ఆంధ్రవాల్మీకి రామాయణం రచించి, కోదండరాముడికి అంకితం ఆచ్చారు. తాళ్లపాక అన్నమయ్య శ్రీరాముని మహిమను కీర్తిస్తూ అనేక సంకీర్తనలు ఆలపించారు.
టిటిడిలో విలీనం
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉండేది. 2015 సెప్టెంబర్ తొమ్మిదో తేదీన టిటిడిలో విలీనం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం శ్రీ సీతారాముల కల్యాణాన్ని ఒంటిమిట్టలో రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చురుకుగా చేస్తోంది.
ఏటా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని టీటీడీ ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమ విధానంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
ఆలయం నుంచి కల్యాణ వేదిక వరకు శ్రీ సీతారాముల ఉత్సవమూర్తుల శోభాయాత్ర నిర్వహిస్తారు. అనంతరం అర్చకులు భగవత్ ప్రార్థనతో ప్రారంభించి విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం వస్త్ర సమర్పణ, మధుపర్కం, మహాసంకల్పం, కన్యాదానం జరుగుతాయి. అనంతరం జీలకర్ర–బెల్లం, మాంగల్యపూజ, అక్షతారోపణం, మాలపరివర్తనం వంటి మంగళకార్యాలు నిర్వహించి వేదాశీర్వాదాలతో శ్రీ సీతారాముల కల్యాణం ఘనంగా ముగుస్తుంది. కల్యాణం అనంతరం భక్తులకు ముత్యాలతో కూడిన తలంబ్రాలను టీటీడీ అందజేస్తుంది.