x

బ్రెజిల్ టూ తిరుపతి: అమ్మవారంటే శక్తి.. అంతటా ఒకే రీతి!

ఆడవేషంలో పురుషులు.. భక్తి పారవశ్యంలో తిరుపతిలో జరుగుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవం..


పల్లెలు, పట్టణాల్లో జాతరలు జరగడం సహజం. బంధువులతో రెండు రోజులు సందడిగా గడుపుతారు. తిరుపతి తాతయ్యగుంట గంగ జాతర ఏడు రోజులు నిర్వహించడం ఆనవాయితీ. 900 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆ గంగమ్మ ఆలయం వద్ద విచిత్ర వేషాలు ఆకట్టుకుంటున్నాయి. బ్రెజిల్ దేశంలో జరిగే ఉత్సవాలకు తిరుపతి గంగమ్మ జాతరకు సారూప్యం ఉన్నట్లు ఆ దేశానికి చెందిన లూసియానా "ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్" ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు.

తిరుపతి నగరానికి చెందిన రామకృష్ణ వెంట గంగమ్మ ఆలయం వద్ద తారసపడిన లూసియానా మాట్లాడుతూ, అనేక విషయాలు ప్రస్తావించారు.
"అమ్మవారు అంటే శక్తి. మా దేశంలో కూడా ఇదే తరహాలో ఉత్సవాలు జరుగుతాయి. మా ఇంట కూడా ఈ ఉత్సవం నిర్వహిస్తాం" అని లూసియానా చెప్పారు.

మహిళల వేషాల్లో మగవారు..

తిరుపతిలో ఈ నెల ఐదో తేదీ ప్రారంభమైన జాతరతో తిరుపతి నగరంలో కోలాహలంగా మారింది. ఆడ వేషాల్లో పురుషులు సందడి చేస్తున్నారు. పిల్లలు తిట్లు (బూతులు) మాట్లాడుతున్నారు. ఇవి బూతులు కాదు! గంగమ్మ నుంచి అందే ఆశీర్వాదాలు అని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ విశ్రాంత ప్రొఫెసర్ పేటశ్రీ వివరించారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి స్వయానా చెల్లెలుగా బావించే తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద జాతర కోలాహలంగా మారింది. ఈ జాతర నిర్వహణలో కూడా కైకాల వంశం, కమ్మరి, కుమ్మరి, తోటివాళ్లు (దళితులు), చాకలి, నాయీ బ్రాహ్మణులు (మంగలి) వంటి బీసీ సామాజికవర్గాలదే కీలకపాత్ర. జాతర చాటింపు నుంచి ఈ నెల 13వ తేదీ గంగమ్మ విశ్వరూప దర్శనం వరకు ఆ సామాజికవర్గాలు మిరాశీ (అనువంశిక ఆచారంగా సేవలు అందిస్తున్న వారు) విధానాన్ని కొనసాగిస్తూ, సేవలు అందిస్తున్నారు.
తిరుపతిలో జరుగుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతర ప్రత్యేకతలు ఏమిటో ఈ వీడియోలో చూడండి...

ఐదు సామాజికవర్గాలే కీలకం..

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర కేవలం ఒక మతపరమైన ఉత్సవం మాత్రమే కాదు, అది కులమతాలకు అతీతంగా సాగే ఒక సామాజిక వేడుక. ఈ జాతరలో వివిధ కులాలు, తెగల వారు తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాల ప్రకారం కీలక పాత్రలు పోషిస్తారు.
1. కైకాల వర్ణం (కైకాల కులస్తులు)
జాతరలో అత్యంత కీలకమైన పాత్ర వీరిదే. గంగమ్మ పురాణం ప్రకారం, అమ్మవారు దుష్టశిక్షణ చేసిన తీరును స్మరిస్తూ వీరు జాతరను నడిపిస్తారు.
చాటింపు: జాతర ప్రారంభానికి సూచికగా 'చాటింపు' వేసే హక్కు వీరికి ఉంటుంది.
వేషధారణ: జాతరలో ఏడు రోజుల పాటు ధరించే వివిధ వేషాలు (బైరాగి, బండ, తోటి, దొర, మాతంగి, సున్నపు కుండలు) వేసేది కైకాల కులస్తులే.
విశ్వరూప దర్శనం: జాతర చివరి రోజున గంగమ్మ మట్టి విగ్రహాన్ని (విశ్వరూపం) తయారు చేయడం మరియు దానిని తొలగించే (నరకడం) ప్రక్రియలో వీరు ప్రధాన పాత్ర పోషిస్తారు.
2. చాకలి (రజక) కులస్తులు
జాతరలో వీరు అమ్మవారికి అత్యంత సన్నిహితంగా సేవలు అందిస్తారు.
మట్టి సేకరణ: అమ్మవారి విగ్రహ తయారీకి అవసరమైన మట్టిని సేకరించడం మరియు పవిత్రమైన మట్టిని తీసుకురావడంలో వీరు పాల్గొంటారు.
తోరణాలు: జాతరలో అమ్మవారికి సమర్పించే వివిధ నైవేద్యాలు, తోరణాల నిర్వహణలో వీరి సహకారం ఉంటుంది.
3. కుమ్మరి (శాలివాహన) కులస్తులు
అమ్మవారి విగ్రహ తయారీలో కుమ్మరుల పాత్ర మరువలేనిది.
మట్టి విగ్రహ తయారీ: తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ప్రతి ఏటా ప్రతిష్టించే మట్టి విగ్రహాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో రూపొందించేది వీరే. ఈ విగ్రహాన్ని శాస్త్రీయంగా, సాంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తారు.
4. ఇతర సామాజిక వర్గాల పాత్ర
నాయీ బ్రాహ్మణులు: జాతరలో మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో కోలాహలం సృష్టించేది వీరే. వీరి వాయిద్యం లేకుండా జాతర ఉత్సాహం ముందుకు సాగదు.
బ్రాహ్మణులు: ఆలయంలో వైదిక సంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాలు, శాంతి హోమాలు నిర్వహిస్తారు. గ్రామ దేవత'గా భావించే గంగమ్మను ఆరాధిస్తూ, తిరుపతి నగరంలోని ప్రతి కులం వారు ఏదో ఒక రూపంలో పూజలు అందిస్తారు. అందులో ప్రధానంగా నైవేద్యం సమర్పించడం, తోరణాలు కట్టడం, వేషాలు వేయడం ద్వారా ముక్కులు చెల్లించడానికి జాతరలో భాగస్వామ్యం అవుతారు.
"ఇది తిరుపతి సంస్కృతిలో భాగమైన సామాజిక సమరసతకు నిదర్శనం" అని రచయిత పేటశ్రీ అభివర్ణించారు.
Read More
Next Story