కొత్త ‘సౌత్ ఇండియన్ పొలిటికల్ మోడల్’ వస్తున్నదా?
x

కొత్త ‘సౌత్ ఇండియన్ పొలిటికల్ మోడల్’ వస్తున్నదా?

ప్రపంచంలో ‘గ్లోబల్ సౌత్’, ‘గ్లోబల్ నార్త్’ అని శిబిరాలుగా విడిపోతున్నప్పుడు, ఇండియాలో కూడా రేపు ఇటువంటి భాగోళిక రాజకీయ విభజన రానున్నదా?


ఊహించని రీతిలో ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల కంటే ముందుగా ఆగ్నేయం నుంచి ద్రవిడ రాజకీయ కెరటాలు ఆంధ్రప్రదేశ్ ను తాకాయి. తెలంగాణ నుంచి విడిపోయిన కొత్త ఏపీ, ఏర్పడి రెండవ దశకంలోకి ప్రవేశించిన నాటికి ఈ కొత్త తమిళ కెరటాల తాకిడి శక్తిని, ఏపీ రాజకీయ పరిస్థితుల్లో ఏమాత్రం తక్కువ చేసి చూడలేము. ఇక్కడ మరో చిత్రం ఏమంటే, ఈ తాకిడి ఇక్కడి అధికార పార్టీ మీది కంటే, ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ వైసీపీని ‘ఫోకసడ్’గా మార్చింది. అంతేకాదు దేశం- ‘శతాబ్ది ఇండియా’ కాబోతున్న కాలంలో దీని రాజకీయ ముఖచిత్రాన్ని, ఈ చివరి ఇరవై ఏళ్ళు ఎలా మార్చబోతున్నది కూడా ఏపీ సంకేతిస్తున్నట్టుగా ఉంది.

బ్రిటిష్ పాలన కాలంలో ‘మెడ్రాస్ ప్రసిడెన్సీ’ పాలనలో నుంచి 1956 లో విడిపోయినప్పటికీ, మన సరిహద్దుల్లోని తమిళనాడుతో తెలుగువారికి ఒక ‘ఆర్గానిక్ కనక్ట్’ ఉండడం అనేది మనం ముందుగా అంగీకరించవలసిన నిజం. విహంగ వీక్షణంగా చూస్తే ‘మ్యాప్’ మీద ఉండే ‘పొలిటికల్ లైన్స్’ కేవలం సాంకేతికం. వాటిని దాటిన ప్రాంతము - ప్రజలు అనే ‘ఫ్యాక్టర్’ అందులో ఉంది. అందుకే తమిళ ప్రభావం మూడు తెలుగు జిల్లాలను దాటి మరీ నెల్లూరులో కూడా నేటికీ కనిపిస్తుంది. కొత్త పార్టీగా 80’ దశకం ఆరంభంలో టిడిపి ‘టేకాఫ్’ కోసం అవసరమైన ‘ఎమోషన్’ ముడిసరుకు అంతా దాని వ్యవస్థాపకుడు ఎన్టీ. రామారావు ద్రవిడ రాజకీయాలు నుంచే తీసుకున్నారు.

వెండితెరపై ఆయన నటన శైలిలో ఉన్న ఆ తమిళ ‘డ్రామా’ ప్రభావం ఆయన రాజకీయసభల్లో చప్పట్లు కొట్టించి ఆయన పని అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. పనిలో పనిగా అక్కడి సంక్షేమ పధకాలు కూడా కొన్ని అప్పట్లో ఏపీ వచ్చాయి. అయితే, ఆ పార్టీ నినాదమైన ‘తెలుగు ఆత్మగౌరవం’ అనేదానికి సాంద్రతే కనుక ఉంటే, ఆ రాజకీయ తాత్విక అంశ ఇప్పటికీ ఉండేది. కానీ ఆ పార్టీలో అది ఇప్పుడు మచ్చుకైనా లేదు. అవసరార్ధం తగిలించుకున్న ‘మాస్కులు’ ఏదో రోజు అలాగే జారిపోతాయి. ఆ విషయం గ్రహించి, ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు ‘కనెక్టిటింగ్ పీపుల్ విత్ ల్యాండ్’ అంటూ ప్రచార హోరుతో తెచ్చిన ‘జన్మభూమి’ ప్రభావం కూడా నేడు ఆ పార్టీలో కనిపించక పోవడం చూస్తే, ఆ పార్టీ నాలుగు దశాబ్ధాల రాజకీయ తాత్విక సాంద్రత ఎటువంటిదో అర్ధమవుతుంది.

ఒక పక్క ‘జన్మభూమి’ అంటూనే 1995 నుంచి సంప్రదాయ రాజకీయాల స్థానంలో ‘మార్కెటింగ్ పొలిటిక్స్’ను పనిమాలా ‘ప్రమోట్’ చేశారు. అలా మునుపటి ప్రాధాన్య అంశాలైన రాజకీయాల్లో ‘ప్రాంతము’, ‘ప్రజలు’ అనే అంశ కనుమరుగు అయింది. ఈ మార్పును కొందరు- ‘పబ్లిక్ ఎపైర్స్’లో తెచ్చిన కొత్త ట్రెండ్ అని, అది- ‘మార్కెటింగ్ ఎకానమీ’ అని అంటారు. కానీ అది నిజం కాదు. అది ‘మార్కెటింగ్’ అంశను, నేరుగా రాజకీయాల్లోకే తీసుకురావడం. అందులో ‘విన్-విన్’ అనే ఉభయతారకం సూత్రం ఉంటుంది కనుక, సహజంగానే బలమైన ‘ప్రైవేట్ ప్లేయర్స్’ ప్రభుత్వంలోని పార్టీతో ‘కనెక్ట్’ అయ్యారు.

ఇలా ‘తెలుగు దేశం’ అని పేరు పెట్టుకున్న పార్టీ, ప్రాంతము ప్రజలు రెండింటితో ‘ఆర్గానిక్ కనెక్ట్’ లేని స్థితిలో ఉంది. కానీ ఇక్కడ చిత్రం ఏమంటే, దేశమంతా మేము ‘పేట్రియాటిక్ పాలిటిక్స్’ నడుపుతున్నాము అని చెప్పుకుంటున్న జాతీయ పార్టీ, దక్షణాదిన 2014 నుంచి తడవల వారీగా ఆ లక్షణాలు లేని టిడిపితో కలిసి ‘కూటమి’ కడుతున్నది. ఇది ఇలా ఉంటే, ‘బిజినెస్’ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన యువకుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ కృతకమైన ‘షోకేసింగ్’ లేకుండా, కేవలం రాజ్యాంగ పరిమితులకు లోబడి ‘బ్యూరోక్రసీ’ కేంద్రంగా పాలనా సంస్కరణల ప్రభుత్వం నడపడం అనేది ‘సౌత్ ఇండియా’లో సరికొత్త పాలనా ఉద్దీపనగా ఆశావహంగా ఉంది.

ఏపిలో ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉండగా 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి సంప్రదాయ పార్టీల స్థానంలో మొదటి ప్రయత్నంలోనే అధికారంలోకి వచ్చిన టీవీకే పార్టీ జోసఫ్ విజయ్ తొలి విజయంతో ఏపిలో వైసీపీ జగన్ ను పోల్చి ‘సోషల్ మీడియా’ చూసింది. ఈ కొత్త ‘రీ-మిక్స్’కు ‘యూత్’ కనెక్ట్ కావడంతో, ఈ జోడీ పట్ల ‘పాజిటివ్ వైబ్’ స్థిరపడింది. పైగా ‘ఎన్డీఏ’లో ముఖ్యుడు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో తమిళనాడులో ఎఐడీఎంకే పార్టీని గెలిపించే బాధ్యతతో అక్కడ ప్రచారం చేయడంతో ఏపీలో ఈ యువ నాయకుల ‘కాంబినేషన్’కు ప్రాధాన్యత ఏర్పడింది.

అయితే జీవన శైలిలో మెడ్రాస్ కు ఇవతల నెల్లూరు వరకు తమిళ వాసనలు అన్నంత మాత్రాన, ఏపీ ప్రాంతానికి అయినా ప్రజలకైనా పూర్తి ‘దక్షణ’ లక్షణాలు ఉన్నవి అని కాదు. తమిళనాడు సరిహద్దున కుప్పం నియోజకవర్గం వద్ద మొదలయ్యే తెలుగునాడుకు పడమర కర్ణాటక ఉంటే, ఉత్తరాన మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘర్, ఒడిస్సా వరకు ఈ ఏపీ ‘స్ప్రెడ్’ ఉంది. రాష్ట్ర విభజన తర్వాత, ఒక్క మహారాష్ట్ర మాత్రమే ఏపీ సరిహద్దున లేదు. కనుక, వింధ్యకు దిగువన దక్కన్ పీఠభూమి అన్నప్పుడు, ఉమ్మడి ఏపీ అంటే, అది- దక్షణాన పాక్షికంగా ‘సెంట్రల్ ఇండియా’ లక్షణాలు ఉన్న ‘సౌత్ ఇండియన్ స్టేట్’ అని ముందుగా మనం అర్ధం చేసుకోవాలి.

అందుకే, ఎన్టీఆర్ ఉన్నప్పుడు టిడిపి ‘భాష’ పేరుతో ‘తెలుగు ఆత్మ గౌరవం’ అంటూ చేసిన ‘పొలిటికల్ షో కేసింగ్’ను ఎంతో కాలం పొడిగించడం ఆ పార్టీ వల్ల కాలేదు. ఆ తర్వాత కూడా ‘జన్మభూమి’ అని మరొక ప్రయత్నం చేస్తే, దానిది కూడా అదే పరిస్థితి. ఇందుకు కారణం స్పష్టమే, అది కష్టమైనా నిష్టూరమైనా తమ ‘భాష’తో కానీ ‘భూమి’తో కానీ మనకు అంతగా ‘సెంటిమెంట్’ లేదు అనే నిజాన్ని మనం అంగీకరించవలసి ఉంటుంది. అక్కడ ‘టీఆర్ఎస్’ పార్టీ ఏర్పడి ‘తెలంగాణ’ అన్నప్పుడు అయినా, విభజన తధ్యం అని తెలిసి ‘సమైఖ్య రాష్ట్రం’ అన్నప్పటికే మనది అదే పట్టిపట్టని ధోరణి.

కనుక, గతంలో ఇక్కడ గెలిచిన ప్రాంతీయ పార్టీల నాయకుల ఉనికికి కారణాలు ఏమిటని నిశితంగా వెతికి అర్ధం చేసుకుంటేనే, ప్రజాక్షేత్రంలో ఉండాలి అనుకునేవారికి తగిన రాజకీయ మార్గం దొరుకుతుంది. ఎనభై దశకంలో ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ మీద పోటీకి ప్రాంతీయ పార్టీ పెట్టాలి అంటే, ఆమెను ఎదుర్కోవడానికి అన్ని రకాల ‘మాస్కు’లు వాడారు, వారికవి పనికివచ్చాయి కూడా. ఇప్పుడు వాటి వాస్తవికత ఎంత, అని వెనక్కి తిరిగి చూస్తే, సరైన సమాధానం మనకు దొరకదు సరికదా; అప్పట్లో అవి రాజకీయ అవసరార్ధం వాడుకున్న కృత్రిమ ‘పెట్టుబడులు’ అని స్పష్టం అవుతుంది.

అంతేనా ఇరవై ఏళ్ల తర్వాత కూడా ‘టిఆర్ఎస్’ అనే మరో కొత్త ప్రాంతీయ పార్టీ ఏర్పడడానికి ఆలంబన అయింది కూడా ‘తెలంగాణ’ అనే భూమి, ప్రజలు (Land People) మూలకారణం అయింది. వారు ఆరోపించిన ‘ఆంధ్రా సెటిలర్లు’ అనే దాన్లో, నిజానికి వారికి తమ స్వస్థలంతో ఏ మేర బంధం ఉంది అనే అంతర్లీన ప్రశ్న ఉండనే ఉంది. అయితే ఒకప్పటి తెలుగుదేశం పార్టీ ‘ఆవిరి’ నినాదాలు మాదిరిగా కృతకం కాకుండా, తెలంగాణ వారి ‘క్లెయిమ్’ వాస్తవం కనుక, చివరికి వారు అనుకున్నది సాధించారు, ‘ఉద్యమ పార్టీ’ విజయంగా అది చరిత్రలో నిలిచింది.

ఈ రెండు రాజకీయ పార్టీల పుట్టుక, ఎదుగుదల పరిణామాల్లోనూ, వాటి మనుగడకు ప్రధానమైన ఆలంబన ఏమిటో గ్రహించినప్పుడు; ఆ తర్వాత ఏర్పడిన జగన్ ప్రాంతీయ పార్టీ చరిత్ర చూసినా, ఒక టర్మ్ ప్రభుత్వంలో ఉండి, పదేళ్లకు ఓడిని తర్వాత కూడా ఆ పార్టీ ఖాతాలోని నలభై శాతం ఓటింగ్ చూసినా, అతనిది విలువైన విజయం అని అంగీకరించక తప్పదు. జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 2011 నాటికి ఏర్పడిన రాజకీయ ఖాళీలోకి ప్రవేశించి ఒక ‘పొలిటికల్ వాక్యూమ్’ను నింపింది. అప్పటికి అది- ‘టేకాఫ్’ మాత్రమే, కానీ ఆ తర్వాత దాని ‘ట్రాక్ రికార్డ్’ను పరిశీలించాల్సింది రాష్ట్ర విభజన రాజకీయాల మధ్య అది తనని తాను నిర్వచించుకున్న తీరు.

ఇప్పుడు కూడా ఏపీ రాజకీయాల్లో రాబోయే ‘వందేళ్ల భారత్’ వరకు దానికి ఉండే ‘పొలిటికల్ రిలవెన్స్’ను అంచనా వేయడం అవసరం. గతంలో పందొమ్మిది ఏళ్ల వ్యవధి మధ్య ఏర్పడిన టిడిపి, టీఆర్ఎస్ పార్టీలకు భిన్నమైన జననం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కనుక, తగిన పార్టీ ‘లైన్’ అది ముందే నిర్వచించుకుంది. మరణించిన రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్ పెట్టింది ‘ఫ్యామిలీ సెంట్రిక్ సెంటిమెంట్’ పార్టీ కావడంతో, టిడిపి, టీఆర్ఎస్ రెండింటిలో లేని ‘కుటుంబం’ అనే ప్రాకృతిక సామాజిక వ్యవస్థ, ఏపీ రాజకీయ క్షేత్రం ‘మెనూ’లో విలువైన ‘ఆర్గానిక్ ఐటం’ అయి కూర్చుంది. ఇక దాన్ని కదపడం కుదరదు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 2011 నాటికి ఏర్పడిన రాజకీయ శూన్యంలోకి రావడం అయితే వచ్చింది కానీ 2014 నుంచి 2019 వరకు అది ప్రతిపక్షంగా ఉంటూ తనదైన స్వంత ‘ఎజెండా’ సిద్దం చేసుకునే విరామం దానికి దొరకడం మేలు అయింది. గెలిచాక 2019-2024 మధ్య అది తన తొలి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రపంచ దేశాలు ఎదుర్కొన్న ‘కోవిడ్’ ను, తమ మొదటి పరిపాలనా అనుభవంతోనే లాఘవంగా ‘మేనేజ్’ చేసిన రాష్ట్రంగా దేశవ్యాప్తంగా కితాబును అందుకుంది. కొత్త రాష్ట్రానికి పాలనా సంస్కరణల అవసరాన్ని గుర్తు చేసింది. దాంతో ఆ కాలంలో పలు రాష్ట్రాల నుంచి పాలనా సంస్కరణల అధ్యయనానికి బృందాలు ఇక్కడ పర్యటించాయి.

మానవ హక్కుల ఉద్యమ మేథావి కే. బాలగోపాల్ తన ‘క్యాస్ట్ అండ్ క్లాస్’ వ్యాసాల గ్రంథానికి ఆయన- ' ఇయర్ టు ది గ్రౌండ్ ' అని పేరు పెడతారు. ప్రాంతీయ పార్టీల నుంచి ఎంపిక అయ్యే ముఖ్యమంత్రి డిల్లీకి కాకుండా… తన చెవిని రాష్ట్రం మ్యాప్ లోపలి ‘భూమి’కి ఆనిస్తే పైకి కనిపించని వినిపించని లోలోపలి ‘టెర్మరస్’ అప్పుడు వినిపిస్తాయి. అక్కడ గొంతు పెగలని సమూహాల వ్యధను వారు గ్రహిస్తారు. రాబోయే పాతికేళ్లలో అయినా అటువంటి యువ నాయకుల పార్టీ ప్రభుత్వాల్లో మన ' ఫెడరల్ ' స్ఫూర్తి అమలు అయితే, అంతిమంగా మన దేశం బలోపేతం అవుతుంది.

వయస్సులో తనకంటే బాగా చిన్నవాణ్ణి ఎదుర్కోవడంలో చంద్రబాబు నాయుడి ఇబ్బంది ఆయన మాటల్లో మనం చూస్తున్నదే. మనం కూడా ఈ ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఎంచుకోవాలి అనుకోవడం కూడా సరి కాదు. వారి పార్టీ వైఖరి రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతమేర మేలు అనేది ఒక్కటే మన కొలమానం కావాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు, అదికూడా ఎన్నికల రాజకీయాలు అన్నప్పుడు అది ‘నెంబర్ల గేమ్’ కనుక, ‘పోలింగ్’ సమయంలో గెలవడం ఓడడం అనేది సాంకేతికమైనది. అయితే ఆ విషయంలో జగన్ పార్టీది రాజీలేని పోరు, నలుగురితో రాజీపడితేనే గెలుపు అనేది బాబు తీరు. ‘లీడర్’కు తనది అంటూ ఒక తాత్విక భూమిక లేనప్పుడు ఉండే ‘కన్ఫ్యూజన్’ ఇలాగే ఉంటుంది.

అయితే, ఇలా ఎలాగోలా గెలుపు కోసం అనే పార్టీల వైఖరి వల్ల దక్షణాది కోల్పోతున్నది ఏమిటి? అనే ప్రశ్నకు విజయ్ గెలుపు జవాబు అయింది. అంతే కాదు, కేరళ సిఎం రేసులో ముగ్గురిలో చిన్నవాడైన వి.డి. సతీషన్ కాంగ్రెస్ ‘ఛాయిస్’ కావడం కూడా ఈ రెండింటితో కలిపి చూడాల్సి ఉంటుంది. ప్రపంచంలో మారుతున్న ‘జియో-పాలిటిక్స్’ వల్ల, దేశాలు- ‘గ్లోబల్ సౌత్’, ‘గ్లోబల్ నార్త్’ అని శిబిరాలుగా విడిపోతున్నప్పుడు, ఇండియా వంటి పెద్ద దేశాల లోపల రేపు ఇటువంటి భాగోళిక మార్పులకు ఆస్కారం వస్తే ఏమిటి, అనే ముందస్తు వాతావరణ హెచ్చరికను కూడా ఈ తమిళ సందర్భంగా మనం విస్మరించలేము.


Read More
Next Story