ఫ్లోరిడాలోని నాసా అంతరిక్ష కేంద్రం నుంచి ఏప్రిల్ 1న ఎగిరిన ఆర్టిమిస్-2 అంతరిక్ష ఉపగ్రహం చంద్రుడి చుట్టూ తిరిగి ఇంటి ముఖం పట్టింది. పది రోజుల పర్యటన పూర్తి చేసుకుని భారతీయ కాలమానం ప్రకారం ఏప్రిల్ 11 తెల్లవారుజామున 5.35 గంటల ప్రాంతంలో శాండియాగోలోని పసిఫిక్ మహాసముద్రంలో దిగనుంది. ఇప్పుడు ఆర్టిమిస్-2లోని ఆ నలుగురు వ్యోమగాములు భూమి పైన ఎలా దిగుతారన్నది అత్యంత ఆసక్తిదాయం, ఉత్కంఠభరితం. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా జరిగే నష్టం అపారం. అందువల్లే ఈ ప్రక్రియను వందలాది మంది శాస్త్రవేత్తలు, సిబ్బంది పర్యవేక్షిస్తుంటారు. పైకి వెళ్లడం ఎంత కష్టమో దిగడం అంతకన్నా క్లిష్టతరమైన ప్రక్రియ.
అదెలా ఉంటుందో చూద్దాం.. నాసా "ఓరియన్" (Orion) స్పేస్‌క్రాఫ్ట్ మాడ్యూల్ ఇది. ఈ మిషన్ పేరు ఆర్టిమిస్. చంద్రుడిపైన మనిషి ఉండే పరిస్థితి ఉందో లేదో పరిశీలించడం దీని ఉద్దేశం. ఇప్పుడు జరిగింది రెండో ప్రయోగం కనుక దీన్ని ఆర్టిమిస్ 2 అన్నారు. ఈ మిషన్‌లో నలుగురు వ్యోమగాములు — రీడ్ వైస్మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టీనా కోచ్, జెరెమీ హాన్సెన్- పరిశోధనకు వెళ్లారు. పది రోజుల తర్వాత వీళ్లు తిరిగి వస్తున్నారు. 5 దశల్లో వీళ్లు భూమిపైన దిగుతారు.
శూన్యంలోని భారం లేని స్థితి (మైక్రోగ్రావిటీ) నుంచి భూమిపైన ఉండే గురుత్వాకర్షణ, మధ్యలో భయంకరమైన వేడి, ఉన్నట్టుండి బరువు పెరిగిన భావన (జీ-ఫోర్సెస్), పారచూట్లు ఉపయోగించే ప్రక్రియ, వ్యోమగాములుండే క్యాప్సూల్ సముద్రంలో పడి పోవడం... అంతా సినిమా సీన్ లా ఉంటుంది.
భూమిపై దిగే ప్రక్రియ...
2026 ఏప్రిల్ 10న అమెరికా సమయం ప్రకారం సాయంత్రం సుమారు 8:07 p.m. EDT (భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 11, ఉదయం సుమారు 5:37 గంటలకు) పసిఫిక్ మహాసముద్రంలో శాన్ డియాగో తీరం దగ్గర స్ప్లాష్‌డౌన్ (నీటిలో దిగడం) జరగాలి.
చంద్రుణ్ణి దాటిన తర్వాత భూమి వైపు ప్రయాణం..
చంద్రగ్రహం నుంచి బయటపడిన (ఫ్లైబై) తర్వాత, "ఓరియన్" (Orion) ఉపగ్రహం "ఫ్రీ-రిటర్న్ ట్రాజెక్టరీ" అనే మార్గంలో భూమి వైపు వస్తుంది. ఈ దశలో ఎక్కువ ఇంధనం అవసరం లేదు. భూమి గురుత్వాకర్షణ సహజంగా లాగేస్తుంది.
ఈ సమయంలో నలుగురు వ్యోమగాములు మైక్రోగ్రావిటీలో ఉంటారు (భారం లేకుండా తేలియాడుతూ). భూమి దగ్గరకు వచ్చేసరికి వేగం పెరుగుతుంది, కానీ అప్పటికీ వారికి కిందికి పోతున్నామన్న భావన రాదు.
రీ-ఎంట్రీకి ముందు తయారీ
రీ-ఎంట్రీ (భూమి వాతావరణంలోకి ప్రవేశం)కి ముందు, సర్వీస్ మాడ్యూల్ (ప్రొపల్షన్, సోలార్ ప్యానెల్స్ ఉన్న భాగం) విడిపోతుంది. నలుగురు వ్యోమగాములు ఉండే క్రూ మాడ్యూల్ (క్యాప్సూల్) మాత్రమే భూమికి వస్తుంది.
ఇది భయంకరమైన వేగంతో- గంటకు సుమారు 40,000 కి.మీ (ధ్వని వేగం కంటే 32 రెట్లు ఎక్కువ) భూమి వైపు దూసుకువస్తుంది.
భూమి వాతావరణంలోకి ప్రవేశం
భూ వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు (ఎంట్రీ ఇంటర్ఫేస్) క్యాప్సూల్ ముందు భాగం (హీట్ షీల్డ్) 2,800°C వరకు వేడెక్కి అగ్ని గోళంగా మారుతుంది. బయటి పొర మండిపోతుంది, కానీ లోపల వ్యోమగాములు సురక్షితంగా ఉంటారు.
అసలు ఉత్కంఠ అంతా ఇక్కడే మొదలవుతుంది. గాలి వత్తిడి (డ్రాగ్) క్యాప్సూల్‌కు గట్టిగా బ్రేక్ వేస్తుంది. వేగం తగ్గడంతో వ్యోమగాముల శరీరం ఇంకా ముందుకు వెళ్లాలనుకుంటుంది. కానీ సీటు బెల్టులు వాళ్లను గట్టిగా వెనక్కి నెట్టేలా చేస్తాయి.
ఇదే జీ-ఫోర్సెస్!
జీ (gravity) అంటే భూమిపై మనకు సాధారణంగా అనిపించే బరువు (1g). రీ-ఎంట్రీలో ఇది 4 నుంచి 7g వరకు ఉంటుంది. అంటే, 70 కేజీల వ్యక్తి 5g వద్ద 350 కేజీల బరువు ఫీల్ అవుతారు. చేతులు కదల్చడం కష్టమవుతుంది. శ్వాస తీసుకోవడం భారం అవుతుంది. ఉక్కిరిబిక్కిరవుతారు.
ఉదాహరణకు మనం కారులో 100 కి.మీ వేగంతో వెళ్తూ హఠాత్తుగా బ్రేక్ వేస్తే సీట్ బెల్ట్ మనల్ని వెనక్కి లాగినట్టుగానే ఇక్కడా అదే జరుగుతుంది.
ఆర్టిమిస్-2లో "స్కిప్ ఎంట్రీ" టెక్నిక్ ఉపయోగించి జీ-ఫోర్సెస్‌ను 4-5g తగ్గించారు (పాత అపోలో మిషన్లలో ఇది ఎక్కువగా ఉండేది).
స్కిప్ ఎంట్రీ (Skip Entry) అంటే ఏమిటీ..
ఉదాహరణ మనం చిన్నప్పుడు చెరువులో లేదా బావిలో ఓ బిళ్లపాటి రాయిని ఏటవాలుగా విసిరినప్పుడు, నేరుగా నీటిలోకి వెళ్లకుండా నీటి ఉపరితలంపై ఒకటి రెండు కప్ప గంతులు వేసి (Skip అయ్యి) ఆ తర్వాత లోపలికి వెళ్తుంది కదా? అలా క్యాప్సూల్ కూడా భూమి వాతావరణం అనే 'నీటి పొర'పై ఒకసారి అలా తగిలి, మళ్లీ కొంచెం పైకి లేచి, ఆ తర్వాత నెమ్మదిగా లోపలికి ప్రవేశిస్తుంది. దీనివల్ల వేగం తగ్గుతుంది, వ్యోమగాములపై పడే ఒత్తిడి (G-Force) కూడా తగ్గుతుంది.
బ్లాక్ అవుట్ (Blackout)...
క్యాప్సూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు గాలి రాపిడి వల్ల దాని చుట్టూ విపరీతమైన వేడి (సుమారు 2800°C) పుడుతుంది. ఈ వేడి వల్ల క్యాప్సూల్ చుట్టూ ఒక 'అగ్నిగోళం' లాంటి పొర (Plasma) ఏర్పడుతుంది.
ఈ మంటలు రేడియో తరంగాలను (Radio Signals) లోపలికి రానివ్వవు, బయటకు పోనివ్వవు.ఫలితంగా భూమిపై ఉన్న శాస్త్రవేత్తలకు, అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు మధ్య కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోతుంది. ఒక సొరంగం (Tunnel) లోకి వెళ్ళినప్పుడు ఫోన్ సిగ్నల్ ఎలా పోతుందో, ఇది కూడా అంతే. సుమారు 5 నుండి 10 నిమిషాల పాటు వ్యోమగాములు క్షేమంగా ఉన్నారో లేదో కూడా ఎవరికీ తెలియదు. అందుకే దీన్ని "Minutes of Terror" (భయంకర ఘడియలు) అంటారు.
పారచూట్లతో వేగం తగ్గించడం
వాతావరణంలోకి ప్రవేశించి కొంత దూరం వచ్చాక (సుమారు 24,000 అడుగుల ఎత్తులో) ఫార్వర్డ్ బే కవర్ విడిపోతుంది (3 చిన్న పారచూట్ల సాయంతో).
ఆ తర్వాత 2 డ్రోగ్ పారచూట్ల సాయంతో వేగం సుమారు 160 కి.మీ/గంటకు తగ్గుతుంది.
చివరికి 3 పైలట్ పారచూట్లు, ఆ తర్వాత 3 పెద్ద మెయిన్ పారచూట్లు (నారింజ-తెలుపు రంగు) వస్తాయి. వేగం చివరికి సుమారు 32 కి.మీ/గంటకు తగ్గి, పసిఫిక్ మహాసముద్రంలో సాన్ డియాగో తీరం దగ్గర సురక్షితంగా స్ప్లాష్‌డౌన్ జరుగుతుంది.
స్ప్లాష్ డౌన్ అంటే నీటిలో సురక్షితంగా ల్యాండ్ అవ్వడం. విమానాలు రన్‌వే మీద దిగినట్లు, అంతరిక్ష నౌకలు నేరుగా భూమి మీద (నేల మీద) దిగడం చాలా ప్రమాదకరం. అందుకే సురక్షితంగా ఉండటం కోసం క్యాప్సూల్‌ను సముద్రంలో పడేలా చేస్తారు. నీరు మెత్తగా ఉంటుంది. ఒక 'కుషన్' లాగా పని చేస్తుంది. పారచూట్ల సహాయంతో వేగాన్ని తగ్గించి, నెమ్మదిగా సముద్రపు నీటిలో 'బుస్సా'మని పడటాన్ని "స్ప్లాష్ డౌన్" అంటారు.
భూమికి దిగిన తర్వాత ఏమవుతుంది?
క్యాప్సూల్ నీటిలో పడి తేలుతుంది. "ఓరియన్" (Orion)కు అప్‌రైటింగ్ సిస్టమ్ ఉంది. అది క్యాప్సూల్‌ను సరిగ్గా నిలబెడుతుంది. నేవీ డైవర్లు, నాసా రికవరీ టీమ్ హెలికాప్టర్లు, బోట్లతో వస్తారు (యు.ఎస్.ఎస్. జాన్ పి. ముర్తా షిప్ దగ్గర ఉంటుంది).
గాలి నింపిన రబ్బరు రింగ్ (స్టెబిలైజేషన్ కాలర్) క్యాప్సూల్ చుట్టూ వేస్తారు. "ఫ్రంట్ పోర్చ్" అనే పెద్ద రబ్బరు ప్లాట్‌ఫాం (రాఫ్ట్ లాంటిది) అటాచ్ చేస్తారు.
హ్యాచ్ తెరిచి, మెడికల్ టీమ్ లోపలికి వెళ్తుంది. వ్యోమగాములు ఒక్కొక్కరు బయటకు వచ్చి, రికవరీ వెస్ట్‌లు వేసుకుని హెలికాప్టర్లో నౌక వద్దకు చేరుకుంటారు.
10 రోజుల మైక్రోగ్రావిటీ తర్వాత సాధారణ భూమి గురుత్వాకర్షణ (1g) కూడా భారంగా అనిపిస్తుంది. నడవడం కష్టం, బ్యాలెన్స్ సమస్యలు, చూపులో తేడా రావచ్చు. కానీ వాళ్లు శిక్షణ పొందినవారు కాబట్టి మెడికల్ టీమ్ సహాయంతో త్వరగా కోలుకుంటారు.
షిప్లో మెడికల్ చెకప్ తర్వాత హెలికాప్టర్ ద్వారా జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తీసుకెళతారు. అంతటితో మిషన్ విజయవంతంగా పూర్తవుతుంది!