ఖాసీల మాతృస్వామ్యంలో కౌసల్య వేయి గ్రామాల క్లూ?
x

ఖాసీల మాతృస్వామ్యంలో కౌసల్య వేయి గ్రామాల క్లూ?

రామాయణంలో నిరుత్తరకాండ-21: ఈశాన్య భారత దేశంలో నివసించే ఈ తెగె విశేషమేమిటి? ఇందులో కౌసల్య ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది. కల్లూరి భాస్కరం విశేష పరిశోధన



జార్జి థామ్సన్ తన ‘స్టడీస్ ఇన్ ఏన్షియెంట్ గ్రీక్ సొసైటీ- ది ప్రీ హిస్టారిక్ ఎజియన్ (Studies in Ancient Greek Society-The Prehistoric Agean)’ అనే పుస్తకంలో, అయిదవ అధ్యాయంలో, ‘ఎజియన్ కు చెందిన మాతృస్వామికజనాలు’ అనే శీర్షిక కింద మాతృస్వామ్యం రూపురేఖలను, దాని భౌతికనేపథ్యాన్ని, అందులో స్త్రీ-పురుషుల ప్రాధాన్యాలలో ఉన్న హెచ్చుతగ్గులను, అవి తలకిందులైన క్రమాన్ని, వారి మధ్య జరుగుతూవచ్చిన సర్దుబాటును, అందుకు దారితీయించిన కారణాలను వివరిస్తాడు...

గ్రీస్ లోని ఎజియన్ సముద్రం చుట్టుపక్కల ప్రాంతాలలో కంచుయుగంలో వర్ధిల్లిన చరిత్రపూర్వనాగరికతను ఎజియన్ పేరుతో పిలుస్తారు. జార్జి థామ్సన్ ఈ ఎజియన్ నేపథ్యంనుంచి మాతృస్వామ్యం గురించి వివరించినా, అది మాతృస్వామికసమాజాలన్నింటికీ చాలావరకూ వర్తిస్తుంది...

అందులోనూ ఈశాన్యభారతంలోని కొండప్రాంతాలలో జీవించే మాతృస్వామికులైన ‘ఖాసీ’ తెగవారిని, గ్రీకు తెగలతో కలిపి విశేషంగా చర్చించడం ద్వారా థామ్సన్ తన అధ్యయనాన్ని మనకు అతి దగ్గరగా తీసుకొస్తాడు. అందులోకి వెళ్లబోయేముందు, ఆయన వివరణ వెలుగులో మాతృస్వామ్యం గురించి స్థూలంగా ఒక అవగాహనకు రావడానికి ప్రయత్నిద్దాం...

ఇక్కడ మాతృస్వామ్యం, పితృస్వామ్యం అన్నప్పుడల్లా వాటిని స్త్రీ పారంపర్యం, పురుష పారంపర్యాలకు ప్రత్యామ్నాయాలుగానే తీసుకోగలరు.

జంతువులనుంచి మనుషుల్ని వేరుచేసే అతి పెద్ద తేడాల్లో ఒకటి- వాటి, లేదా వారి ఎదుగుదలకు పట్టే కాలంలోని అంతరమేనని చెబుతూ థామ్సన్ ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తాడు. జంతువుల కన్నా ఎక్కువ కాలాన్ని తీసుకునే మనిషి ఎదుగుదలకు కావలసిన మార్గదర్శనం తల్లిగా స్త్రీనుంచే లభిస్తుంది. ఆ తొలిదశలో ఆహారాన్ని మనిషి ఉత్పత్తి చేయడం అనేది లేదు కనుక, గుంపు తప్పనిసరిగా తల్లి అదుపాజ్ఞలలోనే ఉండేది. పురుషుడి పాత్ర కేవలం సంతానోత్పత్తికి పరిమితమయ్యేది. దాంతో మొత్తంగా మానవసంస్కృతీ నిర్మాణానికి కేంద్రబిందువుగా ఉండే గ్రూపు అలవాట్లు, ప్రవర్తనానియమాలు, సంప్రదాయాలు స్త్రీ ద్వారానే రూపొంది గుంపు అంతటికీ సంక్రమిస్తూ ఉండేవి.

అయితే, ఆహారాన్ని ఎప్పుడైతే ఉత్పత్తి చేయడం మొదలైందో అప్పుడిక స్త్రీ, పురుషుల మధ్య ఘర్షణ తలెత్తింది. జంతువుల్ని వేటాడి ఆహారాన్ని సమకూర్చుకునే దశకు వచ్చేసరికి, అందులో పురుషులు నిర్వహించే పాత్రకీ, వారి సామాజికమైన హోదాకూ మధ్య వైరుధ్యం తలెత్తింది. వేట పర్యవసానాలుగా పుట్టిన పశుపోషణా, యుద్ధాల దరిమిలా ఆ వైరుధ్యం మరింత బలపడింది. దాంతో పశుపోషణ, యుద్ధాలు పురుషుల స్వతంత్రనిర్వహణలోకి వచ్చిన చోట్ల స్త్రీ, పురుషుల స్థానాలు తలకిందులవడం మొదలైంది. అందుకే, ఆధునికకాలంలో సైతం వేట మీద ఆధారపడే తెగల్లో దాదాపు యాభై శాతం మేరకూ, పశుపోషణమీద ఆధారపడే తెగల్లో పూర్తిగానూ మాతృస్వామికపాలన అంతరించిందని థామ్సన్ అంటాడు.




మాతృస్వామిక పారంపర్యం, లేదా స్త్రీ పారంపర్యం మీద ఆధారపడే సమాజం విధిగా స్త్రీ నియంత్రణలోనే ఉండాల్సిన అవసరంలేదన్న ఒక అభిప్రాయాన్ని ఈ సందర్భంలో ఆయన ఉటంకిస్తూ, అందులో వాస్తవం ఉందంటాడు. ఇది మోర్గన్ అభిప్రాయానికి సవరణ. ఎందుకంటే, ఇప్పుడు మనకు తెలిసి మాతృస్వామ్యం కింద ఉన్న అనేకమైన తెగల్లో, బహుశా అన్ని తెగల్లో, వాస్తవిక నియంత్రణాధికారం పురుషుల చేతుల్లోనే ఉంది. పురుషుడు తన కొడుకులకు తన సొంత వంశనామాన్ని ఇవ్వడంలోనూ, తను సంపాదించిన ఆస్తి వారికే చెందేలా చేయడంలోనూ మాతృస్వామిక పారంపర్యనియమాన్ని తరచు తెలివిగానూ, మోసపూరితంగానూ దాటవేయడం జరుగుతూ ఉంటుందంటాడు. మోసపూరితమైన తెలివిలో ఆదిమానవుడు ఆధునిక ధర్మశాస్త్రకర్తలకు ఏమాత్రం తీసిపోడని చమత్కరిస్తాడు.

ఆసక్తికరం ఏమిటంటే; వేట, పశుపోషణలతో పుంజుకుంటున్న పురుషాధిక్యానికి వ్యవసాయంతో అడ్డుకట్ట పడింది. వేట, పశుపోషణ సంచారజీవితానికి సంబంధించినవైతే, వ్యవసాయం స్థిరజీవనానికి సంబంధించినది కావడం అందుకు కారణం. మనిషి పురోగతి మొత్తంలోనే మహత్తరమైన ముందడుగుగా చెప్పదగిన స్థిరజీవనానికి దారులు వేసింది వ్యవసాయమే. భూమిని దున్నడం నేర్చుకున్న తర్వాతే మనిషి పూర్తి అర్థంలో పట్టణవాసి అయిన ‘రాజకీయ జంతువు’గా పరిణామం చెందాడని థామ్సన్ అంటాడు. ఈ సందర్భంలో అమెరికా ఆదివాసులైన ఇరొకోయ్ (Iroquiois) లను, ఏజ్ టెక్ (Aztec)లను ఆయన ఉదహరిస్తాడు. యూరోపియన్లు అమెరికాను ఆక్రమించుకునే నాటికి ఇరొకోయ్ లు స్థిరజీవనం వైపు అడుగువేయబోతున్నారు; ఏజ్ టెక్ లు అప్పటికే వ్యవసాయంలోకి, తద్వారా స్థిరజీవనంలోకి అడుగుపెట్టి ఉన్నారు. ఆవిధంగా వారిలో సొంత ఆస్తి, లోహాలను కరిగించడం, వాస్తుకళ, బొమ్మల లిపి, చాంద్ర, సౌరమానాలు రెంటిపైనా ఆధారపడిన కాలగణనం ప్రవేశించాయి...

యూరేసియా గడ్డిభూముల్లోని కొన్ని ప్రాంతాలు ఆధునికకాలంలోనే నాగరికతాదశలోకి అడుగుపెట్టాయి. అదే, దక్షిణాసియాకు వస్తే, సారవంతమైన ఒండ్రుమట్టి నేలలున్న ఇక్కడి లోయలు నాలుగువేల సంవత్సరాల క్రితం నుంచే సామ్రాజ్యాల ఉత్థానపతనాలను చూశాయి. అప్పటి నైలు, యూఫ్రటిస్, సింధు పట్టణనాగరికతామూలాలు వ్యవసాయాధారిత సంపదలోనే ఉన్నాయి. అదే కాలంలో వాటి చుట్టుపక్కల, పట్టణనాగరికతకు దూరంగా ఉన్నఎడారి ప్రాంతాలు సంచారజీవులైన పశుపాలకుల గుడారాలతోనూ వారి పశుసంపదతోనూ కనిపించేవి...

క్లుప్తంగానైనా ఈ నేపథ్యమంతా ఎందుకు ఇవ్వాల్సివచ్చిందంటే, నాగరికతకు మూలమైన వ్యవసాయాన్ని ప్రారంభించినది పురుషులు కాదు, స్త్రీలన్న వాస్తవంవైపు విషయాన్ని నడిపించడం కోసం! ఆ విధంగా నాగరికతావిర్భావంలో కూడా నిర్ణయాత్మకపాత్ర స్త్రీలదే. పెరటి సాగు ద్వారా వ్యవసాయానికి అంకురార్పణ చేయడంలో స్త్రీలు నిర్వహించిన పాత్రను థామ్సనే కాకుండా, గార్డన్ చైల్డ్ వంటి ఎందరో పురామానవశాస్త్రకారులు ఎత్తిచూపారు. ఈ వ్యాసకర్త రచించిన ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే’ అనే గ్రంథంలో కూడా ఇది ప్రస్తావనకు వస్తుంది.

ఇక్కడే తలెత్తిన ఒక విచిత్ర వైరుధ్యాన్ని థామ్సన్ మన దృష్టికి తెస్తాడు. వ్యవసాయప్రారంభకులు స్త్రీలే కనుక ఆహారసేకరణ దశనుంచి వ్యవసాయం దిశగా, దాని పర్యవసానమైన నాగరికత దిశగా ముందడుగు వేసే క్రమంలో మాతృస్వామ్యం మరింత బలపడి మరింతగా బతికి బట్ట కట్టి ఉండాలి; కానీ సరిగ్గా దానికి విరుద్ధంగా జరిగింది. నాగరికత పునాదులకింద మాతృస్వామ్యం సమాధి అయింది! ఈ పరిణామానికి అద్దం పట్టే ప్రాంతాలు మన కాలంలోనే, మన కళ్ళముందే దక్షిణాసియా, ఆగ్నేయాసియాలలో ఉన్నాయని థామ్సన్ అంటూ మన దేశంలోని ‘ఖాసీ’ తెగ దగ్గరికి వస్తాడు...

ఖాసీ తెగవారు ప్రధానంగా ఈశాన్యభారతరాష్ట్రమైన మేఘాలయలో, ఖాసీ-జయంతియా కొండల్లో నివసిస్తున్నారు. మేఘాలయాలో వీరే అతి పెద్ద తెగ. వీరిని ఆదివాసులుగా భారతప్రభుత్వం గుర్తించింది. అక్కడే కాకుండా మేఘాలయను ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ లోని సిల్హెట్ అనే చోటా, అసోమ్ లోనూ కూడా వీరు కనిపిస్తారు. థామ్సన్ కాలానికి వీరు రెండులక్షలమంది; ఇప్పుడు వీరి సంఖ్య పదిహేను లక్షలైంది. వీరు ఆగ్నేయాసియానుంచి, బహుశా కంబోడియానుంచి నాలుగు వేల సంవత్సరాల క్రితం ఈశాన్యభారతానికి వలసవచ్చారని పరిశోధకులు అంటారు. వీరి భాష ఏస్ట్రో ఏసియాటిక్ కుటుంబంలోని మాన్-ఖమేర్ శాఖకు, అందులోని కొలారియన్ అనే ఉపశాఖకు చెందినది. మధ్యభారతంలోని చుటియా నాగ్ పూర్, సాత్పూరా పర్వతప్రాంతాలలో నివసించే సంతాల్ లు, ముండాల భాషలు కూడా ఈ కుటుంబానికి చెందినవే,

ఖాసీల ప్రధానవృత్తి వ్యవసాయం, ముఖ్యమైన పంట వరి; వేట, చేపలు పట్టడం, పశుపోషణ కూడా చేస్తారు. బ్రిటిష్ పాలన రోజుల్లో ఖాసీల సగం భూభాగం చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది; మిగతా సగం బ్రిటిష్ అధీనంలో ఉండేది. అప్పట్లో 20వేలమంది ఖాసీలు క్రైస్తవం స్వీకరించారు. బ్రిటిష్ ఆధిపత్యాన్ని ధిక్కరించిన చరిత్ర కూడా వారికుంది.

ఆధునికకాలంలోనూ అస్తిత్వంలో ఉన్న మాతృస్వామికసంస్థలకు పరిపూర్ణమైన ఉదాహరణలలో ఒకటిగా ఖాసీల వ్యవస్థను సి. జె. లాయల్(C. J. Lyall) అనే పండితుడు పేర్కొనడాన్ని థామ్సన్ ఉటంకిస్తాడు. నేటి పితృస్వామిక సామాజిక వ్యవస్థకు పునాదిగా తండ్రి హోదాను, అధికారాన్ని ఎంత తార్కికంగా, ఎంత సంపూర్ణంగా చూడడానికి మనం అలవాటుపడ్డామో; ఖాసీల మాతృస్వామికవ్యవస్థలో తల్లి హోదా, అధికారం అంతే తార్కికంగా, అంతే సంపూర్ణంగా అమిరి కొట్టొచ్చినట్టు కనిపిస్తాయని లాయల్ అంటాడు. తల్లి- కుటుంబానికి పెద్దా, కుటుంబాన్ని ఒకటిగా కలిపి ఉంచే ఏకైక బంధం మాత్రమే కాదు; ఆ కొండప్రాంతాలలో మాతృస్వామ్యం మరింత ఆదిమదశలో కనిపించే సింటేంగ్(Synteng)అనే చోట ఆస్తి మొత్తానికి తల్లే యజమానురాలు; ఆమెనుంచే ఆ ఆస్తి ఇతరులకు సంక్రమిస్తుంది. తండ్రికి తన సంతానంతో కూడా ఎలాంటి బంధుత్వం ఉండదు. పిల్లలు తల్లి గణానికి లేదా వంశానికి మాత్రమే చెందుతారు. తండ్రి సంపాదించేదంతా అతని తల్లివైపు వారికి వెడుతుంది; చనిపోయినప్పుడు అతని అస్థులను కూడా అతని తల్లివైపు బంధువుల అస్థులను ఉంచే క్రామ్ లెక్ లో సమాధి చేస్తారు(cromlech) రెండు బల్లపరుపు రాళ్ళను నిలువుగా ఉంచి, వాటి మీద అడ్డంగా మరో బల్లపరుపు రాతిని ఉంచే-చరిత్రపూర్వకాలపు సమాధినిర్మాణం. వీటిని రాక్షసగుళ్లని కూడా అంటారు).

అతను భార్య ఇంట్లో ఉండడం కానీ, భుజించడం కానీ చేయడు. చీకటి పడ్డాక మాత్రమే భార్య ఇంటికి వస్తాడు. పూర్వీకులను కొలుచుకోవడమే తెగలలో భక్తివిశ్వాసాలకు, శ్రద్ధకు పునాదిగా ఉంటుంది. మృతుల స్మారకార్థం నిలిపే నలుచదరపు రాళ్ళు ఆ గణానికి, లేదా వంశానికి ప్రాతినిధ్యం వహించే స్త్రీ పేరుతోనే వ్యవహారంలో ఉంటాయి. వాటి వెనుక వరసగా నిలబెట్టే రాళ్ళు తల్లివైపు బంధువుల స్మృతికి చెంది ఉంటాయి. వారు కొలుచుకునే దేవతల్లో కొందరు పురుషదేవుళ్లూ ఉండచ్చు కానీ; స్త్రీదేవతలకే ప్రాధాన్యం. గృహదేవతలుగా లేదా ఇలవేలుపులుగా ఇద్దరు స్త్రీదేవతల కొలుపుతోపాటు, వంశమూలపురుషుని కూడా కొలుస్తారు. బలులు మొదలైన మతపరమైన తంతులు పూజారిణి లేదా పురోహితురాలి అజమాయిషీలోనే జరుగుతాయి. పురుష పూజారులు లేదా పురోహితులు వారికి సహాయకులుగానే ఉంటారు. ఖాసీలకు చెందిన ఖైరియం(Khyrim) అనే ఒక ముఖ్యమైన తావులో పెద్దపూజారిణిగానూ, తెగపాలకురాలిగానూ కూడా అప్పటికి స్త్రీయే ఉంది. ఆదిమకాలంలో ప్రపంచంలో అనేకచోట్ల ఇలాగే మతపరమైన విధులకు, లౌకికమైన పరిపాలనకు ఒకరే నాయకత్వం వహించడం గురించి సర్ జి. జె. ఎం. ఫ్రేజర్ తన ‘గోల్డెన్ బౌ(Golden Bough) అనే బృహద్రచనలో విస్తారంగా రాస్తాడు.

ఖాసీల ఇళ్లన్నీ పక్కపక్కనే ఒకదాన్ని ఒకటి ఒరసుకుని ఉంటాయి. తెగ నాయకురాలి ఇంటికీ, ఇతరుల ఇళ్లకూ తేడా ఉండదు. మృతుల స్మారకార్థం నిలిపిన రాళ్లూ, తెగకు చెందిన శ్మశానాలూ ఆ ఇళ్లను చుట్టుకునే ఉంటాయి. అలాగే, గ్రామదేవతకు అంకితం చేసిన పవిత్రమైన తోపులు(sacred groves) ఉంటాయి. వీటిని అమ్మవారి తోపులనీ, అమ్మవారి వనాలనీ కూడా అనవచ్చు. ఈ తోపుల్లోని కలపను మృతులకు చెందిన మతకర్మలకు వాడాల్సిందే తప్ప ఇతరమైన వాటికి వాడకూడదు. ప్రపంచంలోని ఇతర చోట్ల కూడా కనిపించే ఈ పవిత్రమైన తోపుల గురించిన సమాచారమూ ఫ్రేజర్ ‘గోల్డెన్ బౌ’లో కనిపిస్తుంది. జార్జి థామ్సన్ కూడా తన గ్రంథంలో వీటి గురించి రాస్తాడు. ఈ వ్యాసకర్త రచించిన ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే’ లో కూడా వీటి ప్రస్తావన వస్తుంది. మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్న రామాయణ సందర్భంలోనూ వీటికి ప్రాముఖ్యం ఉంది. దాని గురించి ముందు ముందు చెప్పుకోబోతున్నాం.

ఖాసీలలో భూయాజమాన్యవిధానానికి వస్తే, బంజరుభూమి గ్రామమంతటికీ చెందుతుంది. అందులోని గడ్డిని, వంట చెరకును ప్రతి ఒకరూ యథేచ్ఛగా వాడుకోవచ్చు. సాగుభూముల్లో తెగ అంతటికీ చెందినవి ఉంటాయి; వాటిపై సామూహిక యాజమాన్యం ఉంటుంది. మతపరమైన విధుల నిర్వహణకు కేటాయించిన భూములనుంచి వచ్చే ఫలసాయాన్ని పూజారిణులు, లేదా పూజారుల పోషణకు వినియోగిస్తారు. తెగ పెద్దా, వారి కుటుంబం కింద కొన్ని భూములు ఉంటాయి. వీటితోపాటు, కొనుగోలు చేసిన ప్రైవేట్ భూములు కూడా తగు సంఖ్యలో ఉన్నాయి. అయితే ఇలాంటివి కేవలం అరుదైనవీ, పరిమితమైనవీ కూడా. ప్రధానమైన నియమం ఏమిటంటే, భూమి అంతా స్త్రీకే చెందుతుంది! ఖాసీలకు చెందిన తూర్పు ప్రాంతాలలో పురుషుడు చిన్నపాటి భూమిని కొనుక్కుని ఫలాసాయాన్ని అనుభవించడం కనిపిస్తుంది కానీ, అతను చనిపోయిన తర్వాత ఆ భూమి అతని తల్లికో, ఆమె వారసురాలికో మాత్రమే సంక్రమిస్తుంది. పశ్చిమ ప్రాంతాలలో కూడా పురుషుడు ఇలాగే భూమి కొనుక్కుని అనుభవించవచ్చు; అతడు వివాహితుడైతే అందులో కొంత భాగాన్ని తన పిల్లలకు కూడా ఇవ్వవచ్చు; కానీ అవివాహితుడైతే మాత్రం అతని తర్వాత ఆ భూమి తెగకు చెందుతుంది...

ఆపైన జార్జి థామ్సన్ ఖాసీలలో ఉన్న వారసత్వనియమాల గురించి, వాటిలో కాలక్రమంలో వస్తున్న మార్పుల గురించి వివరిస్తాడు. విచిత్రం ఏమిటంటే, ఖాసీల వారసత్వనియమాలూ, వారు మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యం వైపు మళ్ళుతున్న క్రమమూ మనం ఇంతకుముందు హిట్టైట్లలో చూసిన క్రమానికి పూర్తి నకలుగా ఉంటాయి. అదలా ఉంచితే, థామ్సన్ వెలుగులో మాతృస్వామిక ఖాసీల గురించి చెప్పుకున్న ఈ మొత్తం సమాచారంలో మన ప్రస్తుత రామాయణ సందర్భానికి అవసరమైన అతిముఖ్య వివరం- భూమి మొత్తం స్త్రీకి చెందుతుందన్నది!

కౌసల్య అధీనంలో వెయ్యి గ్రామాలు ఉండడాన్ని అర్థం చేసుకోడానికీ, అన్వయించుకోడానికీ ఖాసీల గురించిన పై సమాచారం మొత్తం ఏదైనా క్లూ ఇస్తోందా అన్నది ఇక ఇప్పుడు శేషప్రశ్న. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక ప్రశ్న అంటూ ఎప్పుడైతే పుట్టిందో అది సమాధానం దిశగా తన యాత్రను కొనసాగిస్తూనే ఉంటుంది. రామాయణం వందల సంవత్సరాలుగా పఠన, పాఠన, ప్రవచన, వ్యాఖ్యానసంప్రదాయంలో ఉన్నప్పటికీ ఏనాడూ ప్రముఖంగా ప్రస్తావనకు రాని కౌసల్య వెయ్యి గ్రామాల ఆధిపత్యం సంగతిని ప్రముఖంగా ముందుకు తేవడంతోనే ప్రస్తుతానికి తృప్తిపడదాం.









Read More
Next Story