
చలో ఛార్ ధామ్.. హలో ప్రయాణిద్దాం!
దేవభూమికి గ్రీన్ సిగ్నల్! ఢిల్లీ టూ డూన్.. ఇప్పుడు ప్రయాణం వెరీ స్మార్ట్!
మీరు ఏదైనా వీకెండ్ ట్రిప్, లేదా లాంగ్ జర్నీ ప్లాన్ చేస్తే కనుక ఈసారి కచ్చితంగా ఢిల్లీ టు డెహ్రడూన్ ఎక్స్‌ప్రెస్ హైవే మీద చేయండి. మీరు వావ్ అనకుండా ఉండలేరు. నిజమే, రోడ్డు ప్రయాణం అంటే నడుము విరిచేదిగా కాకుండా ఓ తీపి జ్ఞాపకంలా ఉండాలని కోరుకునే వారికి ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే భలే ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14న (ఏప్రిల్ 14, 2026) దీనిని ప్రారంభించిన తర్వాత, అసలు ఈ రోడ్డు మీద ప్రయాణం ఎలా ఉందో ఓ ప్రయాణికుడి కళ్లతో చూస్తే ఆ మజానే వేరు.
గతంలో ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్లాలంటే దాదాపు 6 నుండి 7 గంటలు పట్టేది. ట్రాఫిక్ జామ్‌లు, ఇరుకు రోడ్లు.. అబ్బో! ప్రయాణం ముగిసేసరికి తల ప్రాణం తోకకి వచ్చేది. విసుగుపుట్టేది. కానీ, ఇప్పుడు సీన్ మారింది. ప్రధానమంత్రి ప్రారంభించిన ఈ కొత్త ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణం ఓ అద్భుతం! అంటున్నారు ప్రయాణీకులు.
సమయం ఆదా.. వేగం అదిరింది!
ఉదయం ఢిల్లీలో టిఫిన్ చేసి బయలుదేరితే, మధ్యాహ్నం భోజన సమయానికి డెహ్రాడూన్ చేరుకోవచ్చు. 6 గంటల ప్రయాణం ఇప్పుడు చిటికెలో (దాదాపు 2.5 నుండి 3 గంటల్లో) పూర్తవుతోంది. 100 కి.మీ వేగంతో కారు వెళ్తున్నా, రోడ్డు మీద చిన్న కుదుపు కూడా తెలియడం లేదు.
ఆసియాలోనే అతిపెద్ద ఎలివేటెడ్ కారిడార్!
ఈ ప్రయాణంలో హైలైట్ ఏంటంటే.. గణేష్‌పూర్ నుండి దత్ కాళీ ఆలయం వరకు ఉన్న 12 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్. ఇది ఆసియాలోనే అతిపెద్ద గ్రీన్ కారిడార్ అంటున్నారు! మనం రోడ్డు మీద వెళ్తుంటే, కింద రాజాజీ టైగర్ రిజర్వ్ అడవి కనిపిస్తుంది. ఏనుగులు, పులులు, జింకలు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి.. వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డును గాలిలో నిర్మించిన ఇంజనీరింగ్ అద్భుతం ఇది.
దత్ కాళీ మాతా దర్శనం..
ప్రయాణం చివర్లో పాత 'మా దత్ కాళీ' ఆలయం వస్తుంది. ఇక్కడ ప్రధాని మోదీ కూడా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పవిత్రత దెబ్బతినకుండా ప్రత్యేకంగా నిర్మించిన ఫ్లైఓవర్ భక్తులకు చాలా సౌకర్యవంతంగా ఉంది.
భద్రతలో రాజీ లేదు...
రోడ్డు బాగుంది కదా అని మితిమీరిన వేగంతో వెళ్తామంటే కుదరదు. ఇక్కడ ఆటోమేటెడ్ సిస్టమ్స్ ఉన్నాయి. కార్లకు 100 కి.మీ, భారీ వాహనాలకు 80 కి.మీ స్పీడ్ లిమిట్ పెట్టారు. ఎక్కడ రూల్ బ్రేక్ చేసినా కెమెరాలు పట్టేస్తాయి.
ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ హైవే (NH-709B)ను సుమారు ₹12,000 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ 210 కిమీ, 6-లేన్ కారిడార్‌తో ఢిల్లీ-డెహ్రాడూన్ ప్రయాణ సమయం 6 గంటల నుండి కేవలం 2.5 గంటలకు తగ్గింది. ఇది అక్షరధామ్ (ఢిల్లీ) నుండి డెహ్రాడూన్ వరకు, సహారన్‌పూర్ మీదుగా సాగుతుంది. 210 కి.మీ (గతంలో 235-280 కి.మీ) దూరాన్ని కేవలం 2.5 గంటల్లో పోవచ్చు. ఢిల్లీ (అక్షరధామ్) - బాఘ్‌పత్ - షామ్లీ - సహారన్‌పూర్ మీదుగా డెహ్రాడూన్ చేరవచ్చు. ఢిల్లీ-ఉత్తరాఖండ్ మధ్య కనెక్టివిటీ, పర్యాటకం, ఆర్థిక వృద్ధికి ఈ రోడ్డు తోడ్పడుతుంది.అయితే టోల్ కూడా బాగానే పేలేలా ఉంది. కారుకు ఒక వైపు సుమారు ₹670, రానుపోను సుమారు ₹1000 గా అంచనా.
ఈ ప్రాజెక్ట్ ఛార్ ధామ్ యాత్రకు వెళ్లే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఇది హరిద్వార్‌తో కూడా కనెక్టివిటీని కలిగి ఉంది.
"గణేష్‌పూర్ నుంచి సహారన్‌పూర్ మీదుగా సాగే ఈ ప్రయాణం.. కేవలం దూరాన్ని తగ్గించడమే కాదు, ఉత్తరాఖండ్ పర్యాటక రంగానికి కొత్త ఊపిరి పోసింది. అప్పుడెప్పుడో 2024లో పూర్తి కావాల్సింది కాస్త ఆలస్యమైనా..
ఇప్పుడు వచ్చిన అవుట్‌పుట్ మాత్రం అమోఘం. రోడ్డు ప్రయాణాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై డ్రైవ్ చేయాల్సిందే!"
Next Story

