
మావిగన్ లో ‘జెన్-జడ్’ కు ఏముంది?
రాజధాని నగరం చంద్రబాబు నాయుడు ‘వెర్టికల్’ అంటుంటే,జగన్ ‘హరిజాన్టల్’ అంటున్నాడు. ఒకరిది ‘ఒంటి స్తంభం’ నమూనా, మరొకరిది విస్తరిద్దాము అనే ధోరణి.
ఏపిలో ‘వర్క్ ఫ్రమ్ హోం టౌన్’ అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు ఇప్పుడు ఎందరికి గుర్తు ఉంది? మన ‘జెన్-జడ్’కు బాగా తెలిసిన- ‘వర్క్ ఫ్రమ్ హోం’కు, ‘కోవిడ్’ కాలంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం, అదనంగా- ‘హోం టౌన్’ అనే కొత్త ‘ట్యాగ్’ జోడించి, మీ ఇళ్లకు వచ్చి ఇక్కడి నుంచే పనిచేసుకోండి అంది. అందుకోసం ఆయా జిల్లాల్లోని ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల్లో వారికి ‘వైఫై’ ఫ్రీగా అందుబాటులో ఉండేట్టు ‘ఇంటర్నెట్’ సౌకర్యం ఏర్పాటు చేసింది. అది ఎంత చిన్నదైనా ఆ ‘మెడికల్ ఎమర్జెన్సీ’ కాలంలో అదొక ఊరట కలిగించే ప్రయత్నం.
ఎందుకంటే, ఆ ‘లాక్ డౌన్’ కాలంలో కంపెనీలు కొన్ని తాత్కాలికంగా మూతపడితే, మరికొన్ని శాశ్వితంగా ‘షట్టర్లు’ దించేశాయి. అటువంటి పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం ఒక ప్రయోగాత్మక ప్రయత్నం చేసింది. అయితే, అప్పటి ఆ కల్లోల కాలంలో ఈ తాత్కాల ఉపశమనం ఎక్కువమంది దృష్టికి రాలేదు. అలా ఈ కొత్త ప్రభుత్వానికి రెండున్నర ఏళ్లు ‘కోవిడ్’ కోసం పోయి, ఇక మిగిలిన పనిరోజుల్ని (working days) పొదుపుగా వాడుకుంటూ, ఆ తర్వాత అది ఎన్నికలకు వెళ్ళింది.
ఇప్పుడు ఈ ‘మావిగన్’ సందర్భంలో ‘జెన్-జడ్’కు ఉపాధి అన్నప్పుడు, ‘మావిగన్’ అంటేనే ఒక నిర్దేశిత ప్రాంతం కనుక, ఆ నైసర్గిక ప్రాంతం పరిమితుల్లోనే దానికున్న బలం ఏమిటో మనం వెతకాలి. ఒక ప్రాంతానికి అక్కడి ప్రజలకు ఉండే ‘సైక్’ ప్రాధాన్యంగా ఆ వెతుకులాట ఉండాలి. దానికోసం ఈ ప్రాంతాన్ని ఇక్కడి వ్యక్తుల్ని మలిచిన ‘గ్రోత్ ఇంజన్స్’ చరిత్రను మనం వెతకాలి. అలా చూసినప్పుడు అక్కడ మనకు 1842లో గుంటూరులో మొదలైన ఏ.సి. కాలేజి, 1843 లో మచిలీపట్టణంలో వచ్చిన నోబుల్ కాలేజి ముందుగా కనిపిస్తాయి.
దేశ స్వాతంత్రానికి వందేళ్ల కంటే ముందే ఈ పట్టణాలలో ఆంగ్లేయుల వద్ద ఆధునిక విద్య అభ్యసించిన యువతీ యువకుల ప్రభావం ఆ తర్వాతి కాలంలో ఈ ప్రాంతంలోని సమాజం పైన కుటుంబ వ్యవస్థ మీద ఎలా ఉంటుందో ఊహించడం పెద్ద కష్టం ఏమి కాదు. భారత జాతీయ ఉద్యమ చరిత్రలోనే దాన్ని చూశాము ఆ తర్వాత కూడా దాన్ని చూసాము. ఇప్పటికీ బయట ‘ఆంధ్రోళ్లు’ అని వినిపించే పిలుపులోని పొగడ్త అయినా తిట్టు అయినా అది ఈ ప్రాంతం వారినే!
ఇప్పుడు ఈ రెండు పట్టణాల మధ్య ప్రాంతం ‘రాజధాని’ కావాలి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీనికున్న చారిత్రిక ‘లోతులు’ దృష్ట్యా చూస్తే, ఒక బలమైన రాజధాని కావడానికి అవసరమైన ‘హెరిటేజ్’ ఉన్న ప్రాంతం ఇది. అయితే, ఇక్కడ ఒక కీలకం ఉంది. రేపు అది ‘అమరావతి’ అయినా ‘మావిగన్’ అయినా దాని ‘ఇమ్మిడీయేట్’ లబ్ధిదారు అయితే ఒక్కరే! తేడా, నాయుడు ‘వెర్టికల్’ అంటుంటే, రెడ్డి ‘హరిజాన్టల్’ అంటున్నాడు. ఒకరిది ‘ఒంటి స్తంభం’ నమూనా, మరొకరిది ‘నలుచెదరుల’ విస్తరిద్దాము అనే ధోరణి.
మే 22 న జరిగిన ‘ప్రెస్ మీట్’ లో “నేను ‘మావిగన్’ అన్నప్పుడల్లా చంద్రబాబుకు ‘బీపీ’ పెరుగుతూ ఉంది” అన్నాడు జగన్. ఆ రోజు బాబు ‘బీపీ’ సంగతి ఎలా ఉన్నా... అదే సమయానికి అమెరికాలోని ప్రముఖ ‘సాఫ్ట్వేర్’ కంపెనీల్లో ఉద్యోగాలు పోగొట్టుకున్న లక్షా పదివేల మందికి, వారి కుటుంబాలకు నిజంగానే ‘బీపీ’ పెరిగే పరిస్థితి వాటిల్లింది. అనిశ్చితి ‘ఐటి’లో అతి సాధారణంగా మారింది. దాంతో మనం కొత్త ప్రత్యామ్నాయాలు వెతుక్కోవలసిన అవసరం ప్రపంచ జాబ్ మార్కెట్ నుంచి అందుతున్న సూచనలు చెబుతున్నాయి.
నిజానికి ‘ఫార్మేటివ్’ దశలో ఉన్న రాష్ట్రానికి స్థానిక ‘డెమోగ్రఫీ’ బలాబలాల ప్రాతిపదికగా ప్రభుత్వాల మానవ వనరుల వినియోగ ప్రణాళికలు ఉండాలి. కానీ నాయుడు గారిది మొదటి నుంచి ఒకటే ధోరణి. అది 2004 అయినా 2024 అయినా ఆయన దృష్టిలో తేడా ఉండదు. ‘అమరావతి’లో ప్రతిపాదిస్తున్న ‘ఏ. ఐ.’ అయినా ‘క్వాంటమ్ టెక్నాలజీ’ అయినా అవి ‘పాన్ ఇండియా’ మార్కెట్ డిమాండ్ ఉండే ప్రాజెక్టులు. మరి స్థానిక యువత కోసం ప్రభుత్వం సూక్ష్మ స్థాయిలో చేస్తున్న ఆలోచనలు ఏమిటి? ఆ ప్రశ్న అడగడానికి అక్కడ తావులేదు. దానికి పూర్తిగా భిన్నమైనది- ‘కాళ్ళు నేలకు అన్చిన’ ప్రాక్టికల్ ప్రతిపాదన- ‘మావిగన్’.
స్థానికత–ఉపాధి గురించి మాట్లాడుకోవడం అంటే, గతంతో వర్తమానాన్ని కలిపి చూసినప్పుడే, భవిష్యత్తు ఏమిటో అర్ధమవుతుంది. మూడు దశాబ్ధాల క్రితం మనం అమలులోకి తెచ్చుకున్న ఆర్ధిక సంస్కరణలలో భాగమైన ‘ప్రపంచీకరణ’ కారణంగా ఇండియా నుంచి తాము ‘మ్యాన్ పవర్’ తీసుకోవాలి అనుకునే దేశాలు అన్నీ అటు పై చదువులకు ఇటు ఉద్యోగ కల్పనకు రెండింటికీ మనకు అనుమతి ఇవ్వడం వల్ల, పెద్ద సంఖ్యలో మూడు నాలుగు తరాల యువత దేశం బయట ప్రయోజనం పొందారు.
మనదేశంలో ‘కులం’ అంతరం ఉన్నప్పటికీ దానికి అతీతంగా ప్రజలు ‘ప్రపంచీకరణ’, ‘సరళీకరణ’, ‘ప్రైవేటీకరణ’ వల్ల ప్రయోజనం కలిగింది. ‘మండల్ కమీషన్’ నివేదిక అమలు అప్పట్లో ప్రధాని ఇందిరా గాంధీకి అందిన వెంటనే 1980 నాటికే అది అమలులోకి వచ్చిఉంటే, పదేళ్ల తర్వాత దేశంలో మొదలైన ఆర్ధిక సంస్కరణలు తెచ్చిన మార్పు ‘షిఫ్ట్’ కుదుపును, ‘మండల్’ 27 శాతం ‘రిజర్వేషన్ల బలంతో దాన్ని ఎదురొడ్డి తట్టుకునే సత్తువ ‘మార్జినలైజ్డ్’ వర్గాలకు ఉండేది. కానీ అలా జరగలేదు, అందుకోసం వాళ్ళు మరో పదేళ్ళు 1990 వరకు ఆగాల్సివచ్చింది.
అప్పటికీ ఆర్ధిక సంస్కరణలు 1991 లో మొదలయ్యాక వచ్చిన మార్పును ఎదుర్కోవడంలో ‘బీసీలు’ ఎంతో కొంతమేర నిలదొక్కుకుంటున్నా, ‘ఎస్సీలు’ ఇప్పటికీ ఏమీ అర్ధంకాని ‘మార్కెట్’ వలయంలో సాలెగూట్లో చిక్కిన కీటకాల్లా పల్టీలు కొడుతున్నారు. కారణం- ‘ఛేంజ్ మేనేజ్మెంట్’ కష్టం కావడం. అందుకే, అప్పట్లో మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ‘రిఫారమ్స్ విత్ హ్యూమన్ ఫేస్’ అనాల్సి వచ్చింది. ఇప్పటికీ వైసీపీ వంటి పార్టీ అధికారంలో ఉంటే, ఏవో కొన్ని పధకాల పేరుపెట్టి ‘నగదు బదిలీ’ ద్వారా ‘బై పాస్’ పద్దతిలో ‘రాజ్యం’ వనరుల్లో చిన్నవాటాను పేద వర్గాలకు చేర్చక తప్పడం లేదు.
‘గుర్రాన్ని చెరువు వద్దకు తీసుకువెళ్లగలం, కానీ నీళ్ళు తాగడం అనేది దాని పని’ అని కొందరు అంటారు. కానీ ‘మండల్’ విషయంలో ‘గుర్రాన్ని’ నీళ్ళ వద్దకు తీసుకువెళ్లడానికి జరిగిన తాత్సారం గురించి ఇప్పుడీ చర్చ. అది అలా ఉంచి, ప్రస్తుతానికి వస్తే, ఇప్పుడు కూడా వీళ్ళకు మొదలు రాష్ట్ర విభజన ఇష్టం లేదు, అయినా అది జరిగింది. కనుక, మళ్ళీ మరో ‘గేటెడ్ కమ్యూనిటీ’ కట్టుకోవాలి. ‘రాజధాని’ పేరుతో ప్రభుత్వం సొమ్ముతోనే దాన్ని నిర్మించాలి. ఆ దిశలో వేగంగా అడుగులు సాగుతున్న రోజుల్లో పిడుగులా ఈ ‘మావిగన్’ వచ్చింది.
‘జెన్-జడ్’ ఉపాధి అన్నప్పుడు, 2000 తర్వాత పరిణామాలు కూడా క్లుప్తంగా చూస్తే, ప్రస్తుతానికి ‘లింక్’ కావడం తేలిక అవుతుంది. ‘స్వర్ణ చతుర్భుజి’ పేరుతో 2001 లో మొదలయిన డిల్లీ- బొంబాయి, చెన్నై-కలకత్తా జాతీయ రహదారులు వల్ల దేశంలో ‘మొబిలిటీ’ పెరిగింది. ఎక్కడ పనికి వెళ్ళినా అప్పట్లో రూపాయి బిళ్ళ పబ్లిక్ టెలిఫోన్ బాక్స్ లో వేసి దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మాట్లాడే వెసులుబాటు వచ్చింది. అలా ప్రజలు ప్రాంతాలు మధ్య దూరాలు తగ్గడం మొదలయింది. ఆ కాలంలో కొత్త రైళ్లు కూడా అలాగే పెరిగాయి. దాంతో పని కోసం దేశంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళడానికి ప్రజలు సిద్దపడ్డారు. బ్యాంకులు ద్వారా ‘క్యాష్ ట్రాన్స్ఫర్’ వచ్చి, పని స్థలం నుంచి ఇళ్లకు డబ్బు పంపడం తేలిక అయింది.
ఊళ్ళల్లో ఏ ‘స్కిల్’ లేనివారి కోసం 2006లో మొదలయిన ‘నరేగా’ పధకం వల్ల ఏటా వంద రోజులు స్వంత ఊళ్ళోనే పంచాయతీ ఆఫీసు ద్వారా దొరికే ‘ఎన్ రెగా’ ఉపాధి మట్టి పనులు కొంతమేర ఊరట అయింది. ఆ తర్వాత 2009లో ‘ఇన్ఫోసిస్’ సిఇవో నందన్ నీలాంకనే ను కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకుని, ఆయన్ని ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అధాటిరిటీ ఆఫ్ ఇండియా’ ఛైర్మన్ హోదా (క్యాబినెట్ మంత్రి హోదా) ఇచ్చి, దేశ పౌరులకు 11 నంబర్ల ‘ఆధార్ కార్డ్’ ఇచ్చింది. ఇప్పుడు దానితో బ్యాంకు ఎకౌంట్ ‘లింక్’ అయింది. అలా ఆర్ధిక స్థాయీ బేధంతో పని లేకుండా, అందరు ఈ రోజున దేశం ఆర్ధిక చట్రంలోకి వచ్చినట్లు అయింది.
ఈ కాలంలో నగర పట్టణాల ఆధునీకరణ మొదలైంది. ఏదో ఒక ‘స్కిల్’ ఉంటే, నిర్మాణ రంగం, సర్వీస్ సెక్టార్లలో పని దొరికింది. ఈ కాలంలోనే, ‘కంప్యూటరీకరణ’ ప్రభుత్వ ఆఫీసుల్లోనూ మార్కెట్లో ‘హోల్ సేల్’ నుంచి ‘రిటైల్’ వరకు వాడకం మొదలయింది. ‘గ్రామీణ సడక్ యోజన’ పేరుతో గ్రామాలను సమీప ప్రధాన రహదారులతో కలిపే ప్రణాళిక కేంద్రం దేశమంతా అమలు చేసింది. దాంతో కొత్త ప్రాంతాలకు బస్సు సౌకర్యం వచ్చింది. పాడి పంట ఉత్పత్తుల్ని సమీప పట్టణాలకు తీసుకెళ్ళి అమ్ముకోవడం, యువత సమీప పట్టణాలలో ఉపాధి వెతుక్కుని రాత్రికి ఇంటికి చేరేవారు.
ఇలా పాతికేళ్లు ఏళ్లు గడిచి 2026 లో ఇంకా ఏపీ రాజధాని ఎక్కడ అంటూ పదేళ్లుగా తాత్సారం జరుగుతుంటే, ‘మావిగన్’ అంటున్న కొత్త ‘ప్లాన్’లో సమీపాన ఉన్న గ్రామాలు, పంచాయతీలు, నగర పాలికలు, పట్టణాలు, నగరాలు హద్దులు చెరిగి ఒక్కటిగా కలవడంలో ఒక ‘ఆర్గానిక్ కనెక్ట్’గా కనిపిస్తున్నది. ఒకప్పుడు జాతీయ ఉద్యమానికి ఆంధ్రపత్రిక, అమృతాంజనం వంటి ఉత్పత్తులకు పుట్టిల్లు అయిన ప్రాంతాలు ఇలా రాజధానిలో కలవడం అనే ఆలోచనే ఈ ప్రాంత వాసులకు తమ మట్టివాసనల పరిమళం మనసులకు తాకుతుంది.
ఎందుకంటే, గత వందేళ్లుగా ఇవి నివాస ప్రాంతాలు. ఇందులో చల్లపల్లి కోట, తోట్లవల్లూరు కోటలు ఉన్నాయి, వాటి చరిత్ర ఉంది. కృష్ణా వ్యవసాయ ప్రధానమైన జిల్లా కావడం వల్ల ఇక్కడి వ్యవసాయ కుటుంబాల సంతతి వారు ఏ దేశాలలో ఉన్నప్పటికీ, తమ పూర్వీకుల ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాజధానిలో భాగం అయింది అంటే, వారు దానితో ‘కనెక్ట్’ అయ్యే తీరు రేపు భిన్నంగా ఉంటుంది. తమ ప్రాంతంతో ఒకప్పటి తమ కుటుంబ సంబంధాలు ‘రెస్టోర్’ చేసుకునే అవకాశాలు ఎక్కువ. ‘కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ తో వారు ఇక్కడి గ్రామీణ ప్రాంతాల్లో సరికొత్త ‘సోషల్ కేపిటల్’ గా మారతారు. ఒకప్పుడు ఇక్కడ వుయ్యూరు చల్లపల్లిలో కెసిపి షుగర్స్ ఎన్ని కుటుంబాలకు అన్నం పెట్టిందో వారికి తెలుసు.
యాంత్రీకరణ కారణంగా గత 30-40 ఏళ్లలో వ్యవసాయ రంగంలో ఉపాధి తగ్గినా ‘ఆగ్రో ఇండస్ట్రీస్’ వల్ల ‘సెమీ స్కిల్ లేబర్’కు కొంతమేర ఉపాధి దొరికింది. దాన్ని గ్రామీణ నిరుద్యోగితకు ఎలా కారణం అయిందో కూడా ఎరిగిన తరాలు ఇంకా పలు ప్రాంతాల్లో తమవైన రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. కనుక ‘రివర్స్ మైగ్రేషన్’ కు ‘మావిగన్’ దోహదం చేసే అవకాశాలు కొట్టిపారవేయ లేనివి.
ఎందుకంటే, నైసర్గికత దృష్ట్యా ఈ ప్రాంతాల్లో పెట్టే పెట్టుబడులకు వచ్చే ప్రయోజనాలు దీర్ఘకాలికంగా ఉంటాయి. స్థానికంగా కార్మికుల అందుబాటు కూడా ఉంటుంది. ‘ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ’లో పెట్టుబడులకు కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ‘స్కోప్’ ఎక్కువగా ఉంది. ఉదా: ఈనాడు రామోజీరావు తన ప్రాజెక్టులు ఎన్ని ఆపేసినప్పటికి, విజయవాడ శివారు పోరంకి లోని ‘ప్రియా ఫుడ్స్’ కొనసాగడానికి కారణం, తెలుగు ప్రజల డైనింగ్ టేబుల్ ఐటం గా ఆ ఉత్పత్తులు మారడం.
ఈ సందర్భంగా ఒక పాత విషయం గుర్తు చేయాలి. 90 దశకం ఆరంభంలో ఇప్పటి ఈ ‘మావిగన్’ పరిసర ప్రాంతాల్లో కొత్తగా మాగాణి పొలాల్లో చేపల చెరువుల సంస్కృతి మొదలయింది. అంతే, అప్పటివరకు వ్యవసాయ యాంత్రిక ఉపకరణాల తయారీకి పేరున్న గుడివాడ ఆటోమొబైల్ వర్క్ షాపుల్లో కొత్తగా చేపలు రొయ్యలు దూర ప్రాంతాల రవాణా కోసం ‘ఫ్రీజర్’ ట్రక్కుల తయారీ మొదలు పెట్టారు. ఊరూరా ఐస్ తయారీ యూనిట్లు వచ్చాయి. ఇక్కడి ‘ఎంటర్ ప్రెన్యూర’లకు ఉన్న‘యడాప్టబిలిటీ’ ఎటువంటిదో చెప్పడం కోసం ఈ పాత విషయాలు చెప్పడం.
‘ట్రేడింగ్’ లోకి ‘ఐటి’ వచ్చాక, యజమానులు కౌంటర్లలో లేకుండా కేవలం మేనేజర్లు వర్కర్లతో ‘మాల్స్’ స్థాయిలో జరుగుతున్న రిటైల్ వ్యాపారాలు మనం చూస్తున్నదే. కనుక, ‘మావిగన్’ ప్రాంతంలోకి ఒకప్పటి ఈ ప్రాంత పాత ‘ఫార్మింగ్’ కుటుంబాలు కొద్దిపాటి పెట్టుబడులతో వస్తే, మళ్ళీ వారి కుటుంబాల ‘బ్రాండింగ్’తో ఇక్కడ వారు వాణిజ్యం చేయడానికి ఉండే ఆస్కారం ఎంతైనా ఉంది. ఎందుకంటే, పోర్టు ఒక ప్రధాన అంశం అయితే, ఈ ప్రాంతానికి ఉన్న రోడ్డు, ఎయిర్ ‘కనక్టివిటీ’ మరొక అంశం.
సమీపాన గుడివాడ, తాడిగడప, మంగళగిరి, తెనాలి, వంటి మున్సిపాలిటీలు, పెడన ఉయ్యూరు నగరపాలికలు, గుడ్లవల్లేరు పంచాయతీ ఒక్కటిగా ఇందులో కలిసిపోతాయి. విమానాశ్రయం ఉన్న గన్నవరం ఎటూ ఇందులో భాగమే. అయితే ‘మావిగన్’ అంచుల్లో ఉండే హనుమాన్ జంక్షన్, నూజివీడు, రేపల్లి, అవనిగడ్డ, నరసరావుపేట వంటివి రాజధానికి ‘శాటిలైట్ టౌన్స్’ అవుతాయి. బందరు ఫోర్ట్ కోసం గుడివాడ రైల్వే జంక్షన్ ను ఈడ్పుగల్లు మీదుగా తెనాలితో కలిపే ఆలోచన ఉంది అంటున్నారు. అదే కనుక జరిగితే, గుడివాడ ప్రాంతం నుంచి ఎన్టీఆర్, ఏఎన్నార్, కైకాల, తెనాలిలోని కృష్ణ, గుమ్మడి, జగ్గయ్య, జమునల కళా వైభవాన్ని కలిపే- ‘ఆర్టిస్ట్ కారిడార్’ కూడా ఈ ‘మావిగన్’ వల్ల సుగమం అవుతుంది.

