తిరుమలలో యాత్రికులకు దర్శనం, వసతి కల్పించడంలో టీటీడీ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఆ సేవలు అంతవరకే పరిమితం కావడం లేదు. చెప్పులను కాపాడడం తోపాటు యాత్రికుల లగేజీ, సెల్ ఫోన్లకు కూడా సాంకేతిక భద్రత కల్పిస్తోంది.
కాలినడకన తిరుమలకు వెళ్లే యాత్రికులు అలిపిరి, శ్రీవారిమెట్టు వద్ద లగేజీ డిపాజిట్ కేంద్రాల వద్ద ఓ బ్యాగు లేదా సూట్ కేసు అప్పగించారనుకోండి? ఆ లగేజీ టీటీడీ ప్రత్యేక వాహనం తిరుమలకు చేరవేస్తుంది. ఆ బ్యాగులో ఉంచిన వస్తువులు ఏమాత్రం చెక్కుచెదరకుండా అప్పగించే వ్యవస్థను టీటీడీ అభివృద్ది చేసింది.
"కాణిపాకం, శ్రీకాళహస్తిని సందర్శించాను. నేను తిరుమలకు చాలాసార్లు వచ్చాను. ఇక్కడ యాత్రికులకు అందిస్తున్న సేవలు చక్కగా ఉన్నాయి. బ్యాగేజీకి ఇస్తున్న భద్రత మిగతా ఆలయాలకు ఆదర్శంగా ఉంది" అని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ప్రాంతానికి చెందిన వెంకట్ కిరణ్ చెప్పారు.
"టీటీడీ లగేజీ భద్రతకూ ప్రాధాన్యత ఇవ్వడం అనేది మానసికంగా కూడా ఆనందంగా కలిగిస్తోంది. ట్రాకింగ్ సదుపాయం కూడా అందుబాటులోకి తీసుకుని వస్తే ఇంకా బాగుంటుంది" అని వెంకట్ కిరణ్ అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక వ్యవస్థ
తిరుమల యాత్రకు వచ్చే యాత్రికుల్లో మొక్కుబడి ఉన్నా వారే కాదు. సామాన్య యాత్రికులు కూడా అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లడానికి ఆసక్తి చూపుతారు. వారి కోసం మొదట అలిపిరి వద్ద చిన్న గదిలో టీటీడీ లగేజీ డిపాజిట్ సదుపాయం కల్పించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా యాత్రికుల సంఖ్య పెరిగింది. ఆధునిక సాంకేతిక వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చిన టీటీడీ లగేజీ డిపాజిట్ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది.
"2026 జనవరి నెలలో అత్యధికంగా 10,44,268 డిపాజిట్లు నమోదయ్యాయి. 2026 జనవరి 25రథసప్తమి రోజు అత్యధికంగా 1,34,749 డిపాజిట్లు నమోదయ్యాయి" అని ఈ వ్యవస్థను పర్యవేక్షించే టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (TTD Chief Vigilance and Security Officer) కేవి. మురళీ కృష్ణ చెప్పారు.
80 కౌంటర్లు ఏర్పాటు
తిరుపతి నుంచి అలిపిరి మీదుగా తిరుమలకు చేరుకునే యాత్రికుల కోసం 80 లగేజీ డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. మూడు షిప్టుల్లో పనిచేయడానికి 394 మంది సిబ్బంది నిరంతరంగా సేవలందిస్తున్నారు.
తిరుపతి నుంచి అలిపిరి కాలినడక మార్గంలో వెళ్లే వారి నుంచి 10,194 లగేజీ డిపాజిట్ల సామర్థ్యంతో కౌంటర్లు ఏర్పాటు చేశారు. శ్రీవారిమెట్టు వద్ద 3,025 లగేజీ డిపాజిట్ల సామర్థ్యం ఉంది. ఇక్కడ అప్పగించే లగేజీ బ్యాగులకు సాంకేతికంగా ట్యాగ్ చేసి, భద్రంగా తిరుమలకు చేరుస్తున్నారు. తిరుమలలో ఫ్రీ హాల్లో 10 కౌంటర్లు ద్వారా 17,291 సెల్ ఫోన్లు, 7,793 లగేజీ డిపాజిట్ల సామర్థ్యం ఉంది.
అలిపిరి వద్ద: కౌంటర్లు: ౭, సిబ్బంది (ప్రతి షిఫ్ట్‌లో 15 మంది): 46 మంది, లగేజీ డిపాజిట్ల సామర్థ్యం: 10,194
శ్రీవారి మెట్టు లగేజీ కేంద్రం: కౌంటర్లు :2 , సిబ్బంది (ప్రతి షిఫ్ట్‌లో 5 మంది): 10 మంది, లగేజీ డిపాజిట్ల సామర్థ్యం: 3,025
"తిరుమలకు వచ్చే యాత్రికులకు శ్రీవారి దర్శనం తోపాటు వారి సామాగ్రికి కూడా భద్రత కల్పించాలనే ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం" అని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి చెప్పారు.
లగేజీకి భద్రత...
అలిపిరి (Alipiri) కి సమీపంలోని టీటీడీ లగేజీ డిపాజిట్ కేంద్రం ఏర్పాటు చేసింది. యాత్రికులు తమ లగేజీ డిపాజిట్ చేయడానికి క్యూలో వెళ్లాలి. బ్యాగులు డిపాజిట్ చేసే సమయంలో సిబ్బంది ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా క్యూఆర్ కోడ్ జెనరేటర్ చేసి బ్యాగుపై కోడ్ స్కిక్కర్ వేస్తారు. ఆ తర్వాత లగేజీకి సంబంధించిన సమాచారంతో ఒక స్లిప్ జెనరేట్ చేసి భక్తులకు అందిస్తారు. డిపాజిట్ డెలివరీ సమయంలో డెలివరీ కేంద్రంలో ఆ స్లిప్ సిబ్బందికి చూపితే ఆ నెంబర్ ఆధారంగా లగేజీని సులభంగా గుర్తించి ఒక నిమిషంలో లగేజీని భక్తులకు అందిస్తారు.
"యాత్రికుల లగేజీకి భద్రత కల్పించడానికి ఓ వ్యవస్థ ఏర్పాటు చేయడం చక్కగా ఉంది. గతానికి భిన్నంగా సేవలు బాగున్నాయి" అని ఆకివీడు ప్రాంతానికి చెందిన లక్ష్మీదుర్గ వ్యాఖ్యానించారు. నడచి వెళ్లే వారికి లగేజీ తీసుకుని వెళ్లడం చాలి కష్టం. మేము తిరుమలకు చేరేలోపు బ్యాగులు చేరుస్తున్నాయి. చిన్నపిల్లలకు పాలు, దర్శన టోకెన్ల విధానం చక్కగా ఉందని, పగటి పూటే టోకెన్లు జారీ చేసే విధానం కొనసాాగించాలని లక్ష్మీదుర్గ కోరారు.
తిరుమలలో ప్రధాన కేంద్రాలు
తిరుమలలో యాత్రికుల లగేజీ, సెల్ ఫోన్ డిపాజిట్ సౌకర్యం అందుబాటులో ఉంది.
ఫ్రీ హాల్ – 10 కౌంటర్లు, 36 మంది సిబ్బంది (17,291 సెల్ ఫోన్లు, 7,793 లగేజీ డిపాజిట్ల సామర్థ్యం).
1) వైకుంఠం క్యూకాంప్లెక్స్– 2 కౌంటర్లు, 6 సిబ్బంది (4,270 సెల్ ఫోన్లు)
2) నారాయణగిరి షెడ్ – 8 కౌంటర్లు, 30 సిబ్బంది (11,941 సెల్ ఫోన్లు, 6,749 లగేజీ డిపాజిట్ల సామర్థ్యం)
3) డీడీ హాల్ – 3 కౌంటర్లు, 20 సిబ్బంది (2,526 సెల్ ఫోన్లు, 324 లగేజీ డిపాజిట్ల సామర్థ్యం)
4) రూ.300 హాల్ – 5 కౌంటర్లు, 27 సిబ్బంది (6,338 సెల్ ఫోన్లు, 1,600 లగేజీ డిపాజిట్ల సామర్థ్యం).
5) వైకుంఠం క్యూకాంప్లెక్స్ అప్ స్కానింగ్ (కంపార్ట్మెంట్-03) – 2 కౌంటర్లు, 15 సిబ్బంది
కల్యాణకట్ట: తలనీలాలు సమర్పించే భక్తుల సౌకర్యార్థం కల్యాణకట్ట సమీపంలో కూడా ప్రత్యేక కేంద్రాలను టీటీడీ ఏర్పాటు చేసింది.
1) KKC 1, 2, 3 – కౌంటర్లలో 18 సిబ్బంది ఆరు షిప్టుల్లో పనిచేస్తుంటారు. ఇక్కడ 688 సెల్ ఫోన్లు, 820 లగేజీ డిపాజిట్ చేయడానికి ఆస్కారం ఉంది.
2) సుపథం కౌంటర్ – 1 కౌంటర్ వద్ద ఆరుగులు రెండు షిప్టుల్లో సేవలు అందిస్తుంటారు. ఇక్కడ 1,286 సెల్ ఫోన్లు, 245 లగేజీ డిపాజిట్ల సామర్థ్యం అందుబాటులో ఉంది.
3) సీనియర్ సిటిజన్ / దివ్యాంగులు (PHC) – 1 కౌంటర్, ఇద్దరు ఉద్యోగులు అందుబాటులో ఉంటారు. 265 సెల్ ఫోన్లు, 75 లగేజీ డిపాజిట్ల సామర్థ్యం ఉంది.
4) వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 మెయిన్ గేట్ (శ్రీవాణి ట్రస్ట్) – 1 కౌంటర్లో ఆరుగురు సిబ్బంది ఉంటారు.
తిరుమలలో లగేజీ డెలివరీ కేంద్రాలు
తిరుపతి నుంచి కాలిబాటలో తిరుమలకు వెళ్లే యాత్రికుల లగేజీ అందించే కేంద్రాలు ఏర్పాటు చేశారు. తిరుపతిలోని అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గంలో నడిచివెళ్లే యాత్రికులు డిపాజిట్ చేసే లగేజీని 2.30 గంటలకు ఒకసారి 900, 1200 బ్యాగులు తీసుకుని వెళ్లే సామర్థ్యం కలిగిన కంటైనర్లలో తిరుమలకు చేరుస్తారు.
అలిపిరి నడకమార్గంలో వచ్చే యాత్రికులు తిరుమల (జీఎన్సీ టోల్ గేటు వద్ద) – 5 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ 53 మంది షిప్టుకు 18 మంది సేవలు అందిస్తుంటారు.
శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చిన యాత్రికులకు (టీబీసీ వద్ద) – రెండు కౌంటర్లలో మూడు షిప్టుల్లో 24 సిబ్బంది సేవలు అందిస్తుంటారు.
తిరుమలలో లగేజీ తీసుకోవడం ఎలా..?
తిరుపతి నగరానికి సమీపంలోని అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గంలో నడిచి వెళ్లడానికి యాత్రికులు టీటీడీ లగేజీ డిపాజిట్ కేంద్రాల్లో డిపాజిట్ చేస్తారు. ఆ సమయంలో సిబ్బంది ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా క్యూఆర్ కోడ్ జెనరేటర్ చేసి బ్యాగుపై కోడ్ స్కిక్కర్ వేస్తారు. ఆ తర్వాత లగేజీకి సంబంధించిన సమాచారంతో ఒక స్లిప్ జెనరేట్ చేసి భక్తులకు అందిస్తారు.
తిరుమలకు యాత్రికులు చేరగానే జీఎన్సీ టోల్ గేట్, టీబీ కౌంటర్ వద్దకు చేరుకోగానే. డిపాజిట్ డెలివరీ సమయంలో డెలివరీ కేంద్రంలో ఆ స్లిప్ సిబ్బందికి చూపితే ఆ నెంబర్ ఆధారంగా లగేజీని సులభంగా గుర్తించి ఒక నిమిషంలోపు లగేజీని భక్తులకు అందిస్తారు.
సామాన్య యాత్రికుల కోసం
తిరుమల యాత్రకు వచ్చే యాత్రికులు గదులు దొరకకుంటే టీటీడీ పీఏసీ (Public Amenities Complex (PAC)) కేంద్రాలు ఏర్పాటు చేసింది. విశాలమైన హాళ్లలో సేదదీరడానికి వసతి తోపాటు లగేజీ, సెల్ ఫోన్ల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇక్కడ కూడా డిపాజిట్ కేంద్రాలు అందుబాటులో ఉంచామని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి చెప్పారు.
తిరుమల PAC-4 కౌంటర్లు అందుబాటులో ఉంచారు. కౌంటర్లు 1–4: 16 కౌంటర్లు, 48 సిబ్బంది ఉన్న ఈ కేంద్రాల్లో 20,477 సెల్ ఫోన్లు, 7,899 లగేజీ డిపాజిట్ చేయడానికి సదుపాయం కల్పించారు.
కౌంటర్ 07: 4 కౌంటర్లలో 16 సిబ్బంది.
కౌంటర్ 08: 4 కౌంటర్లు, 16 సిబ్బంది.
కౌంటర్ 05: 4 కౌంటర్లు, 15 సిబ్బంది అందుబాటులో ఉంచడం ద్వారా నిరంతరాయంగా యాత్రికులకు సేవలు అందిస్తున్నారు.
అలిపిరి వద్ద లగేజీ కంటైనర్ లోకి ఎక్కించగానే తలుపులకు తాళాలు వేస్తారు. తిరుపతి నుంచి 18 కిలోమీటర్ల ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనం నుంచి బ్యాగులు కదిలించడం ఏమాత్రం సాధ్యం కాదు. తిరుమలకు చేరగానే అక్కడి డిపాజిట్ కేంద్రం వద్ద మాత్రమే మరో తాళంతో తలుపులు తెరవడానికి వీలుగా గట్టి భద్రత ఉంటుందని అలిపిరి వద్ద బ్యాగులను డిపాజిట్ చేసుకునే సిబ్బంది చెప్పారు.