
అస్సాం చరిత్రలో భాగమైన అహోం వీరుల పోరాట దృశ్యం
అస్సాంను శాసిస్తున్న ఈ 'గొగోయ్'లు ఎవరు? ఎక్కడి వాళ్లు?
పార్టీ ఏదైనా, జెండా ఏదైనా.. గొగోయ్ అనే పేరు ఉంటే గెలుపు గుర్రం
అస్సాం అసెంబ్లీకి ఈనెల 9న ఎన్నికలు జరగబోతున్నాయి. ఏ ఊరు వెళ్లినా అదిగో 'గొగోయ్' వస్తున్నాడు ఇదిగో 'గొగోయ్' వస్తున్నాడనే వారే తప్ప వాళ్లు ఎవరో ఏ పార్టీ వాళ్లో అర్థం పరిస్థితి.
అస్సాం రాజకీయాల్లో 'గొగోయ్' పేరు ఓ "పొలిటికల్ బ్రాండ్". పార్టీ ఏదైనా, జెండా ఏదైనా.. గొగోయ్ అనే పేరు ఉంటే గెలుపు గుర్రం ఈజీ అని రాజకీయ పార్టీల నమ్మకం.
అందుకే వారు 'అందుగలడు ఇందులేడన్నట్టుగా' అన్ని పార్టీల్లోనూ ఉంటారు. అస్సాం అనడంతోనే మనకు గుర్తొచ్చే పేర్లు తరుణ్ గొగోయ్, రంజన్ గొగోయ్, గౌరవ్ గొగోయ్, ప్రియ గొగోయ్... ఇలా ఎక్కడ చూసినా ఏదో ఒక 'గొగోయ్' అనే వినిపిస్తూ ఉంటుంది. ఇంతకీ వీళ్లు ఎవరు? ఎక్కడి వాళ్లు? అది ఇంటి పేరా, ఓ వంశవృక్షమా? వాళ్ల చరిత్ర ఏమిటో చూద్దాం..
అస్సాంలో గొగోయ్ ఓ ఇంటి పేరు. వీరు కేవలం ఒక కులానికో, తెగకో చెందిన వారు కాదు. అస్సాంను సుమారు 600 ఏళ్ల పాటు పాలించిన అహోమ్ (Ahom) వంశీయుల వీరగాథకు వీరు సజీవ సాక్ష్యాలు.
అహోమ్ వంశీయుల వీరగాథ భారత చరిత్రలో అత్యంత స్ఫూర్తిదాయకమైన అధ్యాయం. ఢిల్లీని పాలించిన మొఘల్ చక్రవర్తులు దాదాపు భారతదేశం మొత్తాన్ని జయించినా, ఈ అహోమ్ వీరుల ముందు మాత్రం వారి ఆటలు సాగలేదు. 1228 - 1826 వరకు 600 ఏళ్ల పాటు అప్రతిహతంగా ఈ వంశీయులు విజయాలు సాధించారు.
మొఘల్ సామ్రాజ్యం అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు, ఔరంగజేబు కాలంలో కూడా అస్సాంను లొంగదీసుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అహోమ్ వీరులు మొఘలుల దండయాత్రలను 17 సార్లు తిప్పికొట్టారు. భారత చరిత్రలో ఏ ఇతర వంశం కూడా మొఘలులను ఇన్నిసార్లు ఓడించలేదు.
అహోమ్ వీరగాథలో అతిపెద్ద మలుపు 1671లో జరిగిన శరాయ్‌ఘాట్ యుద్ధం (Battle of Saraighat). బ్రహ్మపుత్ర నదిపై జరిగిన ఈ నౌకా యుద్ధంలో అహోమ్ సేనాని లాచిత్ బోర్ఫుకన్ (Lachit Borphukan) అద్భుత చాకచక్యంతో మొఘల్ సైన్యాన్ని మట్టికరిపించారు. ఈ యుద్ధం కోసం రక్షణ గోడ కట్టడంలో నిర్లక్ష్యం వహించాడని లాచిత్ తన సొంత మేనమామ తలతీసేసి, "నా మేనమామ కంటే నా దేశమే ముఖ్యం" అని చాటాడు. ఈ సంఘటన వారి దేశభక్తికి నిదర్శనంగా చెబుతారు.
అహోమ్ సైన్యం తక్కువే గాని గెరిల్లా యుద్ధ తంత్రాల్లో ఆరితేరిన వారు. బ్రహ్మపుత్ర నది, అస్సాం అడవులు, కొండ ప్రాంతాలను అనువుగా మార్చుకుని శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేసేవారు. వారు నదులపై నిర్మించిన నౌకా వంతెనలు ఆ కాలంలో ఓ అద్భుతం. వీరు నిర్మించిన కోటలు, ప్యాలెస్‌లు (ఉదాహరణకు రంగ్ ఘర్, తలాతల్ ఘర్) నేటికీ చెక్కుచెదరని సౌధాలు. వీరు తమ రాజుల సమాధులను (Maidams) ఈజిప్ట్ పిరమిడ్ల తరహాలో నిర్మించేవారు. ఇటీవల వీటిని యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
ఎక్కడి నుండి వచ్చారు?
గొగోయ్‌లు లేదా అహోమ్‌లు భారతదేశానికి చెందిన వారు కాదు. 13వ శతాబ్దంలో (క్రీ.శ. 1228) చైనాలోని యునాన్ ప్రాంతం, మయన్మార్ సరిహద్దుల నుండి వలస వచ్చారు. 'సుకాఫా' (Sukaphaa) అనే యువరాజు నాయకత్వంలో వీరు బ్రహ్మపుత్ర లోయలోకి ప్రవేశించి 'అహోమ్ సామ్రాజ్యాన్ని' స్థాపించారు. వీరు థాయ్ (Tai) జాతికి చెందిన వారు. అహోమ్‌లు బయట నుండి వచ్చిన వారైనప్పటికీ అస్సాం సంస్కృతిని, భాషను, హిందూ మతాన్ని స్వీకరించి స్థానిక ప్రజలతో కలిసిపోయారు.
'గొగోయ్' అంటే అర్థం ఏంటి?
అహోమ్ భాషలోని 'కుకోయ్' (Kukoy) అనే పదం నుంచి గొగోయ్ అనే పేరు వచ్చింది. దీని అర్థం 'తమ్ముడు' (Younger Brother) అని. అహోమ్ రాజ్యంలో కుల వ్యవస్థ లేదు, కానీ హోదాల వారీగా విభజన ఉండేది. రాజ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే ముఖ్య అధికారులకు, మేధావులకు రాజులు 'గొగోయ్' అనే గౌరవప్రదమైన బిరుదును ఇచ్చేవారు. కాలక్రమేణా ఇది ఒక బలమైన ఇంటిపేరుగా స్థిరపడిపోయింది.
సామాజిక హోదా ఏమిటీ?
రాజ్యాలను పాలించారు కాబట్టి వీరు 'క్షత్రియ' లక్షణాలను కలిగి ఉన్న యోధులు. ప్రస్తుతం మాత్రం వీరు అస్సాంలో OBC (ఇతర వెనుకబడిన తరగతులు) జాబితాలో ఉన్నారు. అయితే, తమను ST (షెడ్యూల్డ్ తెగలు) గా గుర్తించాలని వీరు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఎందుకంటే వీరి ఆచారాలు, సంప్రదాయాలు గిరిజన మూలాలను కలిగి ఉంటాయి.
అస్సాం జనాభాలో వీరి శాతం ఎంత?
అస్సాం మొత్తం జనాభాలో అహోమ్‌లు సుమారు 13% నుండి 15% వరకు ఉంటారు. దాదాపు 13 లక్షల నుండి 15 లక్షల మంది గొగోయ్ వంశీయులు ఉన్నట్లు అంచనా. వీరు ప్రధానంగా అప్పర్ అస్సాం (ఎగువ అస్సాం) లో కేంద్రీకృతమై ఉన్నారు. అక్కడ ఉన్న 30-35 అసెంబ్లీ స్థానాల్లో గొగోయ్‌ల ఓట్లే గెలుపోటములను నిర్ణయిస్తాయి. అందుకే ఏ పార్టీ అయినా 'గొగోయ్' కార్డు వాడకుండా అక్కడ ఎన్నికల్లో గెలవలేదు.
ప్రముఖ వ్యక్తులు ఎవరెవరు?
ఈ వంశం భారత దేశానికి ఎంతో మంది దిగ్గజాలను అందించింది. అస్సాం చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ముఖ్యమంత్రి గొగోయ్ వంశం నుండే వచ్చారు.
తరుణ్ గొగోయ్ (Tarun Gogoi): ఈయన అస్సాం రాజకీయాల్లో ఒక శకం. వరుసగా మూడు సార్లు (2001 నుండి 2016 వరకు) అంటే 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అస్సాంను అత్యధిక కాలం పాలించిన ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. ఉగ్రవాదంతో అట్టుడుకుతున్న అస్సాంలో శాంతిని నెలకొల్పడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
కేశబ్ చంద్ర గొగోయ్ (Keshab Chandra Gogoi): ఈయన కూడా 1982లో కొద్దికాలం పాటు అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈయన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (CJI) రంజన్ గొగోయ్ తండ్రి.
రంజన్ గొగోయ్: భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (CJI). అయోధ్య వంటి కీలక తీర్పులు ఇచ్చారు.
గౌరవ్ గొగోయ్: ప్రస్తుత కాంగ్రెస్ యువ నేత, లోక్‌సభలో విపక్ష ఉపనేతగా కీలక పాత్ర పోషిస్తున్నారు.
అన్ని పార్టీల్లో ఉన్నారా?
గొగోయ్‌లు ఏ ఒక్క పార్టీకో పరిమితం కాలేదు. అస్సాంలోని ప్రతి ప్రధాన రాజకీయ పక్షంలోనూ గొగోయ్ వంశస్థులు అగ్రస్థానంలో ఉన్నారు. తరుణ్ గొగోయ్ వారసుడిగా ఆయన కుమారుడు గౌరవ్ గొగోయ్ ప్రస్తుతం కాంగ్రెస్‌లో అత్యంత కీలక నాయకుడు.
బీజేపీలో కూడా గొగోయ్‌లు కీలక పదవుల్లో ఉన్నారు. ఉదాహరణకు కామాఖ్యా ప్రసాద్ గొగోయ్ వంటి వారు పార్టీ బలోపేతంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అహోమ్ ఓట్లను ఆకర్షించడానికి బీజేపీ గొగోయ్ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తోంది.
అసోం గణ పరిషత్ (AGP): ఇది ప్రాంతీయ పార్టీ. ఇందులోనూ అనేక మంది గొగోయ్‌లు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
రైజోర్ దల్ (Raijor Dal): ప్రముఖ సామాజిక కార్యకర్త, ఫైర్ బ్రాండ్ నాయకుడు అఖిల్ గొగోయ్ ఈ పార్టీని స్థాపించారు. ప్రస్తుతం ఆయన ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వ వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నారు.
గొగోయ్‌లు - పాలకుల వంశం (అహోమ్) నుండి వచ్చిన వారు కావడంతో, నాయకత్వ లక్షణాలు వీరి రక్తంలోనే ఉంటాయని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఒకే కుటుంబ పేరుతో ఇన్ని విభిన్న రాజకీయ భావజాలాలు ఉండటం అస్సాం ప్రజాస్వామ్య ప్రత్యేకత! తమ పూర్వీకుల రాజసం, నేటి రాజకీయ చాణక్యం కలగలిసిన గొగోయ్‌ల చరిత్ర అస్సాం మట్టిలో అంతర్భాగం. అందుకే అస్సాం కథ చెప్పాలంటే 'గొగోయ్'ల ముచ్చట లేకుండా పూర్తి కాదు!
Next Story

