
ఆ రోజు నిన్ను చూశాను...
నేటి మేటి కవిత
పచ్చటి మైదానంలాంటి
నీ నవ్వును చూసి హృదయం నిండా నింపుకున్నాను
మాట్లాడుతున్న ప్రతిసారి అధరాల నృత్యవిన్యాసం చూశాను
ఆ రోజు నిన్ను చూశాను
ఎంత లౌల్యంగా మాట్లాడావో కదా..
ఒక్క కరచాలనం కూడా ఇవ్వకపోయినా
తనువంత స్పర్శించి గిలిగింతలు పెట్టావు
ఆ రోజు నిన్ను చూశాను
మనసెంత మాయల మరాఠీ కదా
తనువును నియంత్రణలో ఉంచుకుంది..
ఐనా నీలో నా విస్తారమైన ప్రపంచాన్ని నిరంతరం చూసుకుంటున్నా..
ఆ రోజు నిన్ను చూశాను
నా కనుచూపు దూరమంతా ప్రసరించే ప్రకృతంతా నువ్వే నప్పుడు
ప్రపంచం నువ్వు కావా?
ఆ రోజు నిన్ను చూశాను
పరిహాసానికో పరవశానికో
పండు వెన్నెల నువ్వనో
పున్నమి రాత్రి నువ్వనో
చెప్పడం లేదు
నాకెప్పుడూ నేను నువ్వే
ఆ రోజు నిన్ను చూశాను
గుండె నిండా గులకరాళ్ళ గుట్టలు నింపుకొని నువ్వు
గుండె నిండా
నీ ప్రతిబింబాన్ని
నీలాకాశం సాక్షిగా
ఆరోజు నిన్ను చూశాను
నీలమెరుపు కాంతులు నింపుకొని నేను
చెరో దేహమై
చెరో విశ్వమై
విశ్వాంతరాళంలో
బతుకును యుద్ధమైదానం చేసుకొని
బతకడం
అంపశయ్య మీద నిదురించినట్లే కదా..
ఆ రోజు నిన్ను చూశాను.
Next Story

