తిరుపతిలో సరికొత్త రుచుల సందడి..
x

తిరుపతిలో సరికొత్త రుచుల సందడి..

రాత్రిళ్లు యాత్రికులకు అందుబాటులో హైటెక్ 'ఈట్ స్ట్రీట్'


ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కేవలం భక్తి మాత్రమే కాదు, నయా ట్రెండ్ రుచుల జాతర కూడా మొదలైంది. నగరం నడిబొడ్డున ఉన్న 'ఈట్ స్ట్రీట్' (Eat Street) ఇప్పుడు ఆహార ప్రియులకు అసలైన అడ్డాగా మారింది. సాయంత్రం వేళల్లో రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులో, వేడివేడి వంటకాల ఘుమఘుమలతో ఈ వీధి పర్యాటకులను, స్థానికులను ఇట్టే ఆకట్టుకుంటోంది.

తిరుపతిలో ఉండి మీరు ఇక్కడి స్పెషల్ ఐటమ్స్ రుచి చూడకపోతే, ఒక అద్భుతమైన ఫుడ్ ఎక్స్‌పీరియన్స్ మిస్ అయినట్లే! యాత్రికులకు కూడా రాత్రిళ్లు ఆహారానికి ఇబ్బంది ఉండదని అధికారులు చెప్పారు.

తిరుమల యాత్రకు వచ్చే యాత్రికులకు కూడా రాత్రిళ్లు తిండికి ఇబ్బంది పడే పరిస్థితి లేకుడా జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు. అలిపిరి నుంచి రుయా ఆస్పత్రి మీదుగా నడిచి వచ్చినా పది నిమిషాల్లో ఈట్ స్ట్రీట్ వద్దకు చేరవచ్చు. ఈ ప్రచార బోర్డులు కూడా ఏర్పాటు చేయడానికి మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో 'హెల్తీ ఫుడ్ స్ట్రీట్స్' అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా తిరుపతిలో అధికారులు కొత్త విధానం పరిచయం చేశారు. సాయంత్రం నగర ప్రజలు కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా గడిపేలా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు.
తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్, జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్యతో కలిసి గురువారం రాత్రి నగరంలో ఈట్ స్ట్రీట్ ప్రారంభించారు. తిరుపతి ఈట్ స్ట్రీట్ (Tirupati Eat Street) వద్ద శాఖాహార, మాంసాహారం, ఉత్తరాది, దక్షిణాది రుచులతో పాటు చైనీస్ వంటకాలు. విభిన్న రకాల ఐస్ క్రీంలు, నోరూరిస్తున్నాయి. తిరుమలకు వచ్చే యాత్రికులకు నిత్యం ఈ ప్రదేశంలో ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచే ఉంచడానికి స్టాల్స్ ఏర్పాటు చేశారు.

దుకాణదారుడికి శుభాకాంక్షలు చెబుతున్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్, పక్కన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య

"తిరుపతి నగర ప్రజలకు దుబాటులో ఉండేవిధంగా ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేశాం. 1.63 కోట్ల రూపాయల నిధులతో 14 కంటైనర్లను ఏర్పాటు చేశాం" అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు.

రాష్ట్రంలో ఎక్కడెక్కడ?

రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఈ తరహా 'హెల్తీ ఫుడ్ స్ట్రీట్స్'ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ఇప్పటికే కొన్ని ప్రాంతాలు ఫుడ్ స్ట్రీట్లుగా గుర్తింపు వచ్చింది. కేంద్ర పథకం కింద క్రమబద్ధీకరించిన వసతులతో కూడిన ఈ సరికొత్త విధానం తిరుపతిలో కార్యరూపం దాల్చింది. భవిష్యత్తులో మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఇలాంటి కంటైనర్ ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

తిరుపతికి దక్కిన అవకాశం..

దేశవ్యాప్తంగా వంద ఫుడ్ స్ట్రీట్‌లను అభివృద్ధి చేయాలనే లక్ష్యంలో భాగంగా తిరుపతికి ఈ అవకాశం దక్కింది. నాణ్యమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలకు చేరవేయడమే దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.
తిరుపతిలో ఈ వినూత్న కార్యక్రమాన్ని నేషనల్ హెల్త్ మిషన్ (National Health Mission - NHM), తిరుపతి నగరపాలక సంస్థ సంయుక్తంగా చేపట్టిన 'హెల్తీ అండ్ హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్' పథకంలో భాగంగా ఏర్పాటు చేశారు. ఆహార నాణ్యతను పెంచుతూ, ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చేలా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ నిధుల ద్వారా ఈ కార్యక్రమానికి ఆర్థిక, సాంకేతిక సహకారం అందించింది.

"తిరుపతి ప్రజలకు, యాత్రికులకు నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలు అందించేందుకు ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేశాం. రుచి, నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలు 24 గంటలు అందుబాటులో ఉంటుంది" అని నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు చెప్పారు.

ఎలా వెళ్లాలి..

తిరుపతి నగరంలో అలిపిరి నుంచి ఎడమవైపు తిరిగితే.. ఎస్వీ మెడికల్ కాలేజీ దాటాలి. శ్రీవేంకటేశ్వర ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) ఆస్పత్రి సర్కిల్ కు ముందే మున్సిపల్ క్రీడా మైదానం పక్కనే కొత్త మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఈట్ స్ట్రీట్ లో 14 కంటైనర్లలో ఏర్పాటు చేశారు.
"నగర ప్రజలకు ఆహ్లాదం కలిగించేలా నేషనల్ హెల్త్ మిషన్, నగరపాలక సంస్థ నిధులతో ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేశాం" అని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ కల్పించిన వసతులను ఆమె వివరించారు. నగరపాలక సంస్థ ద్వారా సుమారు రూ. 1.63 కోట్ల భారీ నిధులతో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించింది. ఇక్కడ 14 కంటైనర్లలో దుకాణాలు ఏర్పాటు చేశారు.
"తిరుపతి స్థానికులకు ఆటవిడుపుగా సాయంత్రం వేళ ఆహ్లాదంగా సేదదీరడానికి వసతులు కల్పించాం. యాత్రికులు, పర్యాటకుల సౌకర్యం కోసం ఇక్కడ ఆహార పదార్థాలు 24 గంటల పాటు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం" అని కమిషనర్ మౌర్య చెప్పారు. డ్రైనేజీ వ్యవస్థ తోసహా, స్వచ్ఛమైన తాగునీరు, సీటింగ్ ఏర్పాట్లు, పిల్లలు ఆడుకోవడానికి వసతులు కల్పించామని ఆమె వివరించారు.

రుచుల సంగమం..

రాష్ట్రంలో విజయవాడ తరువాత నెల్లూరు మైపాడుబీచ్ వద్ద కూడా గత ఏడాది ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా కంటైనర్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది, ఆ ప్రదేశాలను సుందరంగా తీర్చిదిద్దడం ద్వారా మహిళలు స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవడంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ శ్రద్ధ తీసుకున్నారు. తిరుపతిలో కూడా అన్ని రకాల రుచులు ఒకే చోట అందుబాటులో ఉంచుతూ, ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకుంటున్నాయి.

దక్షిణాది టిఫిన్లలో ఇడ్లీ, దోసే, వడ తోపాటు ఉత్తరాది వంటకాల స్పెషల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు ఫాస్ట్ ఫుడ్, చైనీస్, చాట్ ఐటమ్స్ రుచులు నోరు ఊరిస్తున్నాయి. రిఫ్రెష్‌మెంట్స్ కోసం జ్యూస్లు, ఐస్ క్రీమ్లు, కాఫీ, టీ అందించడానికి దుకాణాల నిర్వాహకుల ద్వారా ఏర్పాట్లు చేయించారు.
"ఈట్ స్ట్రీట్ లో మే ఒకటో తేదీ నుంచి అన్ని రకాల దుకాణాల్లో అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి" అని నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య చెప్పారు.

యాత్రికుల కోెసం కూడా..

తిరుమల యాత్రకు వచ్చే యాత్రికులు రాత్రిళ్లు ఆహారం కోసం తోపుడు బండ్లపై ఆధారపడుతుంటారు.
"నగరంలో రాత్రిళ్లు పోలీసులు మాత్రమే తిరగాలి. జనం కాదు" అని చెబుతూ ఆకతాయిల భరతం పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో యాత్రికులకు ఇబ్బంది లేకుండా తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానం ( Tirupati Nehru Municipal High School Sports Ground) వద్ద ఈట్ స్ట్రీట్ లో ఆకలి తీర్చుకోవచ్చని సూచిస్తున్నారు.
తిరుపతి ఈట్ స్ట్రీట్ వద్ద 14 కంటైనర్లలో ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్ద విభిన్న రకాల రుచులు అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకున్నారు.

"క్వాలిటీ తగ్గకూడదు. ధరలు అధికంగా ఉండకూడుదు" అని షరతుపై డిప్ పద్ధతిలో చిన్నతరహా హోటళ్లను తలపించే స్టాల్స్ ఏర్పాటుకు తిరుపతి నగర పాలక సంస్థ అధికారులు అనుమతి ఇచ్చారు. ఆహార పదార్థాల్లో చాట్స్, పానీపూరీ రూ.30, మసాలా పూరీ రూ.35, భేల్ పూరీ రూ.50 గోబీచాట్ రూ. 60, ధై పూరీ, ఇడ్లీ, పూరి, వడ, దోసె ధరలు సరళంగానే ఉన్నాయి. మొదటి రోజు అన్ని ఆహార పదార్థాలు నాణ్యతలో రాజీ పడలేదు.

నిర్వాహకులకు భారమే..


తిరుపతి ఈట్ స్ట్రీట్ లో కంటైనర్ స్టాల్స్ ఏర్పాటు చేసిన వారు ఆర్థికంగా భారం భరించారనే మాటలు వినిపించాయి. రూ. 50 వేలు డిపాజిట్ చేశారు. మళ్లీ తిరిగి ఇవ్వరనే నిబంధనకు కట్టుబడి రూ. మూడు లక్షలు చెల్లించారు. ప్రతి నెలా రూ.24 వేలు అద్దె చెల్లించాలి. విద్యుత్ చార్జీతో కలిపి ఆ మొత్తం రూ. 26 వేల నుంచి 30 వేలు వరకు ఉండే అవకాశం లేకపోలేదు. ఆర్చి నుంచి ఇక్కడ సీటింగ్, కంటైనర్ల డిజైన్, ఫ్లోరింగ్, వీధిదీపాల ఏర్పాటు, పిల్లలు ఆదుకోవడానికి ఆకర్షణీయంగా ఊయల, క్రీడా వసతులు నగర పాలక సంస్థ కల్పించింది.
Read More
Next Story