
ఆధ్యాత్మికత నుంచి రాజకీయాల దిశగా..
నితీష్ తనయుడు నిశాంత్‌కు మంత్రి పదవి ..
బీహార్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ గురువారం (మే 7) బీహార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయాల్లోకి అధికారికంగా అడుగుపెట్టిన రెండు నెలల వ్యవధిలోనే, ఆయనకు మంత్రి పదవి దక్కడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
పాట్నాలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో నిశాంత్‌తో పాటు మరో 30 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, ఎన్డీఏ కూటమి కీలక నేతలు హాజరయ్యారు. గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
రాజ్యసభకు నితీష్.. నిశాంత్‌కు మంత్రిపదవి..
గత నెలలో నితీష్ కుమార్ రాజ్యసభకు ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీ నేత సమ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ పరిణామాల తర్వాత నిశాంత్ రాజకీయాల్లోకి చురుకుగా అడుగుపెట్టారు. తండ్రి రాజకీయ వారసుడిగా ఆయనను ముందుకు తీసుకురావాలని జేడీయూ నేతలు, కార్యకర్తలు కోరుతున్న నేపథ్యంలో, కేవలం రెండు నెలల్లోనే ఆయనకు మంత్రి పదవి దక్కింది.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి రాజకీయ నాయకుడిగా..
1975 జూలై 20న జన్మించిన నిశాంత్ కుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆయనకు ఇంకా వివాహం కాలేదు. నితీష్ కుమార్, దివంగత మంజు సిన్హాల ఏకైక కుమారుడు. నిశాంత్ తల్లి మంజు సిన్హా 2017లో మరణించారు. చాలా కాలం నుంచి నిశాంత్ ప్రజా జీవితానికి, రాజకీయాలకు దూరంగా ఉండటానికే ఇష్టపడ్డారు. ఆయన పాట్నాలోని సెయింట్ కరెన్స్ స్కూల్, మసూరీలోని మానవ భారతి ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకున్నారు. తర్వాత రాంచీలోని మెస్రాలో ఉన్న బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BIT)లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.
రాజకీయాలపై ఆసక్తి లేదన్న నిశాంత్..
2017లో ఒక సందర్భంలో నిశాంత్ తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని స్పష్టం చేశారు. “నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు. ఆ రంగంపై పెద్దగా అవగాహన కూడా లేదు. ప్రస్తుతం నేను ఆధ్యాత్మిక మార్గంలోనే ప్రయాణిస్తున్నాను,” అని నిశాంత్ అన్నారు. అయితే కాలక్రమేణా పరిస్థితులు మారాయి. జేడీయూలో నాయకత్వ మార్పుల చర్చలు, కార్యకర్తల ఒత్తిడి, పార్టీ భవిష్యత్తుపై చర్చల నేపథ్యంలో నిశాంత్ రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మార్చి 7న రాజకీయ ప్రవేశం..
మార్చి 7న నిశాంత్ అధికారికంగా జేడీయూలో చేరారు. ఆ తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు.
ఇటీవల ఆయన “సద్భావ యాత్ర” పేరుతో పశ్చిమ చంపారన్ జిల్లాలోని వాల్మీకి నగర్ నుంచి పర్యటన ప్రారంభించారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడం, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం ద్వారా రాజకీయంగా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు.
బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నితీష్ కుమార్ కూడా అనేక యాత్రలను ఇదే వాల్మీకి నగర్ నుంచే ప్రారంభించేవారు.
“జై నిశాంత్” పోస్టర్లతో హల్‌చల్..
నిశాంత్ రాజకీయ ప్రవేశం తర్వాత జేడీయూ కార్యకర్తలు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం ప్రారంభించారు. “జై నిశాంత్, తే నిశాంత్” అనే నినాదాలు పార్టీ పోస్టర్లు, సోషల్ మీడియా ఖాతాల్లో వైరల్ అయ్యాయి. ఇది ఆయనను భవిష్యత్ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
జేడీయూ, బీజేపీ నేతల ప్రశంసలు..
జేడీయూ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ మాట్లాడుతూ నిశాంత్ తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తారని అన్నారు.
“నితీష్ కుమార్ ఎప్పుడూ నేరం, అవినీతి, మతతత్వానికి దూరంగా ఉన్నారు. అదే మార్గాన్ని నిశాంత్ కొనసాగిస్తారు,” అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ నేత, బీహార్ పరిశ్రమల శాఖ మంత్రి దిలీప్ జైస్వాల్ కూడా నిశాంత్‌ను ప్రశంసించారు. “కొత్త తరం రాజకీయాల్లోకి రావడం సంతోషకరం. నిశాంత్ బీటెక్ చదివిన విద్యావంతుడైన యువ నాయకుడు,” అని ఆయన అన్నారు.
వారసత్వ రాజకీయాలకు నాంది?
నిశాంత్ వేగవంతమైన రాజకీయ ఎదుగుదల, ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. జేడీయూకి భవిష్యత్ నాయకుడిగా ఆయనను సిద్ధం చేస్తున్నారా? అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
ఇప్పటి వరకు ప్రజా జీవితానికి దూరంగా ఉన్న నిశాంత్, ఇప్పుడు మంత్రి పదవి చేపట్టడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నట్లు స్పష్టమైంది.

