
తమిళనాడు ఎన్నికలు: విజయ్ టీవీకే పార్టీకి 25% ఓట్లు?
ప్రతిపక్ష ఓట్లు చీలడంతో డీఎంకేకు లాభం.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా సినీనటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ రంగప్రవేశంతో ఎన్నికల సమీకరణాలు పూర్తిగా మారాయి. యువ ఓటర్లలో ఈ పార్టీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
టీవీకే ప్రవేశంతో సంప్రదాయ ఓటింగ్ సరళిలో మార్పు వచ్చిందని రాజకీయ విశ్లేషకుడు వెంకట్రామన్ అభిప్రాయపడ్డారు. ‘‘గతంలో కులం, ప్రాంతం, సామాజిక అంశాలు కీలక పాత్ర పోషించేవి. అయితే ఈసారి యువతలో నాయకుడి వ్యక్తిత్వం, ఆయన చెప్పే మాటలే ప్రధానంగా మారాయి. డబ్బు, కులం వంటి అంశాలు యువ ఓటర్లపై ప్రభావం చూపలేదు. కానీ 30 ఏళ్లు పైబడిన ఓటర్లలో మాత్రం ఇవి ఇంకా ప్రభావం చూపుతున్నాయి .’’ అని ఆయన పేర్కొన్నారు.
యువతలో టీవీకేకు గణనీయ మద్దతు లభిస్తోంది. 18 నుంచి 29 ఏళ్ల వయస్సు గల ఓటర్లలో ఈ పార్టీ 45–48 శాతం వరకు ఓట్లు పొందే అవకాశముందని ఒక అంచనా. అదే సమయంలో, 50 ఏళ్లు పైబడిన వర్గంలో డీఎంకేకు 60 శాతం పైగా మద్దతు ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా వయస్సు ఆధారంగా ఓటింగ్ ధోరణుల్లో తేడా కనిపిస్తుంది.
ఏఐఏడీఎంకే, బీజేపీ యువతను ఆకర్షించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. గతంలో సీమాన్ నేతృత్వంలోని ఎన్‌టీకే యువ ఓటర్లను ఆకర్షించగా, ఈసారి ఆ స్థానాన్ని టీవీకే దక్కించుకుంది. ముఖ్యంగా పశ్చిమ తమిళనాడులోని గౌండర్లు, ముదలియార్లు, నాయుడులు, ఆది ద్రావిడులు వంటి వర్గాలలో టీవీకే చొచ్చుకుపోతోంది. దీని వల్ల ఏఐఏడీఎంకే తన కీలక ఓటు బ్యాంకులో కొంత కోల్పోతోంది.
డీఎంకే మాత్రం విస్తృతమైన ఓటు బ్యాంకుతో ముందంజలో ఉంది. కొన్ని యువ ఓట్లు టీవీకేకు వెళ్లినా, పెద్దగా నష్టం లేకుండా తన మద్దతును నిలుపుకుంటోంది. అదే సమయంలో ప్రతిపక్ష ఓట్లు చీలిపోవడం వల్ల డీఎంకేకు అదనపు లాభం కలుగుతోంది.
ఈ ఎన్నికల్లో టీవీకేకు సుమారు 25 శాతం ఓట్ల వాటా లభించే అవకాశం ఉందని అంచనా. అయితే ఈ ఓట్లను సీట్లుగా మార్చుకోవడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. గెలవాలంటే కనీసం 35–40 శాతం ఓట్లు అవసరం. టీవీకే ఆ స్థాయిని అందుకోలేకపోవచ్చు.
చెన్నైలో రెండో స్థానంలో..
చెన్నైలో టీవీకే బలంగా రాణిస్తోంది. అక్కడ డీఎంకే తర్వాత రెండో స్థానంలో నిలిచి, ఏఐఏడీఎంకేను మూడో స్థానానికి నెట్టే అవకాశం ఉంది. ఈ ధోరణి కొనసాగితే భవిష్యత్తులో టీవీకే మరింత బలపడే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే, టీవీకే తమిళనాడులో ఒక కీలక ప్రభావశీలిగా మారింది. ఇది డీఎంకే, ఏఐఏడీఎంకే రెండింటినీ ప్రభావితం చేస్తున్నప్పటికీ, ప్రతిపక్ష ఓట్లు చీలిపోవడం వల్ల డీఎంకేకు ఎక్కువ లాభం కలుగుతోంది. దీంతో ఈ ఎన్నికల్లో డీఎంకే ఆధిక్యం సాధించే అవకాశాలు మరింత పెరిగినట్లు విశ్లేషణలు సూచిస్తున్నాయి.

