బెంగాల్ సీఎంగా సువెందు అధికారి..
x

బెంగాల్ సీఎంగా సువెందు అధికారి..

బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువెందు పేరును ప్రకటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా..


Click the Play button to hear this message in audio format

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన సువెందు అధికారి, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీన్ని బెంగాల్ రాజకీయ చరిత్రలో పెను మార్పుగా భావిస్తున్నారు. శుక్రవారం కోల్‌కతాలో జరిగిన బీజేపీ కొత్త ఎమ్మెల్యేల సమావేశంలో సువెందు అధికారిని ఏకగ్రీవంగా శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు.

అమిత్ షా సమక్షంలో కీలక సమావేశం..

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. బీజేపీకి చెందిన 207 మంది ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కూడా సమావేశంలో పాల్గొన్నారు. కోల్‌కతాలోని బిస్వా బంగ్లా కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశంలో సువెందు పేరును ప్రతిపాదించగా, ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ తర్వాత అధికారికంగా సువెందు అధికారిని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా అమిత్ షా ప్రకటించారు.

గవర్నర్‌ను కలవనున్న సువెందు..

శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైన అనంతరం, ప్రభుత్వ ఏర్పాటు కోసం సువెందు త్వరలో గవర్నర్ ఆర్.ఎన్. రవిని కలవనున్నారు.కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో భారీ స్థాయిలో జరగనుంది.

మమతపై విజయాలే కీలకం ..

సువెందు అధికారి సీఎం ఎంపికలో ముందంజలో నిలవడానికి ప్రధాన కారణం ఆయన ఎన్నికల రికార్డే. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీని ఆయన ఓడించారు. ఆ ఎన్నికల్లో 1,956 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో మరోసారి మమతాకు సవాల్ విసిరిన సువెందు, ఈసారి భబానిపూర్‌లోనూ ఆమెను ఓడించి సంచలనం సృష్టించారు.

భబానిపూర్‌లో భారీ మెజారిటీ..

మమతా బెనర్జీ రాజకీయ కంచుకోటగా భావించే భబానిపూర్‌లో సువెందు అధికారి 15 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు సమాచారం. దీంతో బీజేపీలో ఆయన స్థానం మరింత బలపడింది. పార్టీ శ్రేణుల్లో కూడా సువెందునే సహజ నాయకుడిగా భావించడం ప్రారంభమైంది.

బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం..

293 స్థానాల్లో బీజేపీ 207 సీట్లు గెలుచుకుని చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దశాబ్దానికి పైగా కొనసాగిన తృణమూల్ కాంగ్రెస్ పాలనకు ఈ ఎన్నికలతో ముగింపు పలికింది. ఇప్పుడు సువెందు అధికారి నాయకత్వంలో బెంగాల్‌లో తొలి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రానుంది.

Read More
Next Story