
మోదీకి ఓపెన్ చాలెంజ్!
బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ గెలిస్తే రాజీనామా చేయండి: టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ'బ్రియన్ ================================ Derek O'Brien, TMC, PM Modi, BJP
అత్యంత కీలకమైన పశ్చిమ బెంగాల్ ఎన్నికల పోరులో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ చేతిలో బీజేపీ ఓడిపోతే రాజీనామా చేయాలని టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓ'బ్రియన్ బుధవారం (ఏప్రిల్ 29) ప్రధాని మోదీకి సవాలు విసిరారు. రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో మోదీ తనను తాను బీజేపీ ముఖచిత్రంగా ప్రదర్శించుకుని విమర్శించారు. "బెంగాల్‌లోని మొత్తం 294 స్థానాలకు మీరే అభ్యర్థి అని ప్రకటించుకున్నారు. గొప్ప గొప్ప మాటలు చెప్పడం ఆపి, ఈ సవాలును స్వీకరించండి. మే 4న మమతా బెనర్జీ బెంగాల్‌లో గెలిచినప్పుడు, ప్రధాని పదవికి రాజీనామా చేసే ధైర్యం చేయండి," అని టీఎంసీ ఎంపీ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, అధికార టీఎంసీ, బీజేపీల మధ్య తీవ్ర రాజకీయ పోరు జరుగుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఓ'బ్రియన్.
ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ నేడు జరుగుతోంది. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య 142 నియోజకవర్గాలలో పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. దక్షిణ జిల్లాల్లో అధికార టీఎంసీ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంటుందా? లేక తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై బీజేపీ పైచేయి సాధిస్తుందా? అన్నది మే 4న జరిగే ఓట్ల లెక్కింపుతో తేలిపోతుంది.
ఉదయం 7 గంటలకే కోల్‌కతా, హౌరా, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, నాడియా, హుగ్లీ, పూర్బ బర్ధమాన్ జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. గత ఫలితాలను పరిశీలిస్తే.. 2021లో అధికార పార్టీ ఈ 142 స్థానాలలో 123 గెలుచుకోగా, బీజేపీకి కేవలం 18, ఐఎస్‌ఎఫ్ ఒక స్థానం మాత్రమే వచ్చాయి.
మమత వర్సెస్ సువెందు..
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ కంచుకోటగా భావించే భబనీపూర్‌లో ఆమెతో ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి తలపడుతున్నారు. 2021లో నందిగ్రామ్‌లో ఆయన చేతిలో మమత ఓడిపోయారు.
మొత్తం 3.21 కోట్ల ఓటర్లు..
రెండో దశ పోలింగ్‌లో 1.57 కోట్ల మంది మహిళలు, 792 మంది థర్డ్-జెండర్ ఓటర్లు సహా మొత్తం 3.21 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 41వేల కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది.
7 జిల్లాల్లో 2,321 కంపెనీల కేంద్ర బలగాలను ఎన్నికల సంఘం, మోహరించింది. కోల్‌కతాలో అత్యధికంగా 273 కంపెనీలను రంగంలోకి దింపింది. 142 మంది సాధారణ పరిశీలకులు, 95 మంది పోలీసు పరిశీలకులు, 100 మంది వ్యయ పరిశీలకులను నియమించింది. పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షణకు డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు.
ఇదిలా ఉండగా, చప్రా, శాంతిపూర్, నిమ్తలా, భాంగర్‌తో సహా పలు ప్రాంతాల్లో హింసాత్మక, విధ్వంస ఘటనలు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు.
పశ్చిమ బెంగాల్ తొలి దశ ఎన్నికలు ఏప్రిల్ 23న జరిగిన విషయం తెలిసిందే. 152 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 93.19 శాతం ఓటింగ్ నమోదైంది.

