
అసెంబ్లీ ఓటింగ్‌కు TVK ఎమ్మెల్యే సేతుపతిపై తాత్కాలిక నిషేధం ఎందుకు?
తిరుప్పత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడిన డీఎంకే అభ్యర్థి కేఆర్ పెరియకరుప్పన్ ఎందుకు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు?
తమిళనాడులో తిరుప్పత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నిక ఫలితంపై పెద్ద వివాదం చెలరేగింది. అక్కడ ఒక్క ఓటు తేడాతో టీవీకే అభ్యర్థి ఆర్. సీనివాస సేతుపతి విజయం సాధించారు. ఈ ఫలితాన్ని డీఎంకే అభ్యర్థి కేఆర్ పెరియకరుప్పన్ మద్రాసు హైకోర్టులో సవాలు చేశారు. విచారించిన న్యాయస్థానం కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేసును జస్టిస్ విక్టోరియా గౌరీ, జస్టిస్ సెంథిల్‌కుమార్‌ల ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించిన కోర్టు, టీవీకే ఎమ్మెల్యే సేతుపతిని తాత్కాలికంగా అసెంబ్లీ ఓటింగ్ ప్రక్రియలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. కేసు విచారణ పూర్తయ్యే వరకు విశ్వాస తీర్మానం, అవిశ్వాస తీర్మానం, ఏ ఇతర ఓటింగ్‌లోనూ ఆయన పాల్గొనరాదని స్పష్టం చేసింది. అయితే ఇదే ఉత్తర్వుతో సేతుపతి ఎన్నిక రద్దయినట్లు కోర్టు స్పష్టంగా పేర్కొనలేదు.
ఈ వివాదానికి ప్రధాన కారణం ఒక పోస్టల్ బ్యాలెట్. తిరుప్పత్తూరు-185 నియోజకవర్గానికి చెందిన పోస్టల్ బ్యాలెట్‌ను పొరపాటున మరో తిరుప్పత్తూరు నియోజకవర్గానికి పంపారని, ఆ ఓటు లెక్కలోకి వచ్చి ఉంటే ఫలితం మారిపోయేదన్నది డీఎంకే అభ్యర్థి వాదన.
అంతేకాకుండా ఓట్ల లెక్కింపులో మరిన్ని అవకతవకలు జరిగాయని కూడా కోర్టుకు తెలిపారు. ఈవీఎం గణాంకాల్లో 18 ఓట్ల వ్యత్యాసం కనిపించిందని, పోస్టల్ బ్యాలెట్ల పరిశీలనలో కూడా సరైన విధానం పాటించలేదని పెరియకరుప్పన్ ఆరోపించారు.
ఈ నేపథ్యంలో కోర్టు ఎన్నికల రికార్డులన్నింటిని భద్రపరచాలని అధికారులను ఆదేశించింది. రౌండ్ల వారీ లెక్కింపు పత్రాలు, పోస్టల్ బ్యాలెట్ పత్రాలు, తిరస్కరించిన కవర్లు, డిక్లరేషన్లు, పునఃపరిశీలనకు సంబంధించిన రికార్డులు అన్నింటినీ సురక్షితంగా ఉంచాలని తెలిపింది.
తిరుప్పత్తూరు-185 నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ మరొక నియోజకవర్గంలో స్వీకరించారా? లేదా తిరస్కరించారా?
ఒక వేళ తిరస్కరిస్తే దాన్ని తెరవకుండా ప్రత్యేకంగా సీల్ చేసి భద్రపరచాలని ఆదేశించింది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, తిరస్కరణ, పునఃపరిశీలన సమయంలో తీసిన వీడియో ఫుటేజీని కూడా అసలు ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరచాలని సూచించింది. చట్టపర అనుమతి లేకుండా ఎలాంటి రికార్డులను మార్చడం, నాశనం చేయడం లేదా తరలించడం చేయరాదని కోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసులో ఎన్నికల సంఘం కూడా కోర్టులో తన వాదనలు వినిపించింది. తాము కేవలం ఎన్నికల రికార్డులను సంరక్షించే సంస్థ మాత్రమేనని, ఎవరు గెలిచారో నిర్ణయించే అధికారం తమకు లేదని ఈసీఐ తెలిపింది. పోస్టల్ బ్యాలెట్‌పై నిజానిజాలు తెలుసుకోవాలంటే సీల్ చేసిన కవర్లను తెరిచి విచారణ జరపాల్సి ఉంటుందని పేర్కొంది.
ఈ మధ్యంతర ఉత్తర్వు తమిళనాడు అసెంబ్లీ సంఖ్యాబలంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో టీవీకే నేతృత్వంలోని కూటమికి ప్రస్తుతం 120 మంది సభ్యులు ఉన్నారు. కానీ సేతుపతి ఓటింగ్‌కు దూరం కావడంతో తాత్కాలికంగా ఆ బలం 119కి తగ్గినట్లైంది.

