‘వాట్సాప్ లేఖలతో మద్దతా?’..
x
VCK leader Sinthanai Selvan

‘వాట్సాప్ లేఖలతో మద్దతా?’..

TVK చీఫ్ విజయ్ తీరుపై వీసీకే తీవ్ర అసంతృప్తి..


Click the Play button to hear this message in audio format

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు చుట్టూ రాజకీయ చర్చలు వేడెక్కుతున్న వేళ, టీవీకే (Tamilaga Vettri Kazhagam) అధినేత విజయ్‌పై వీసీకే (Viduthalai Chiruthaigal Katchi) ప్రధాన కార్యదర్శి సింథనై సెల్వన్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల అనంతర రాజకీయ పరిస్థితిని విజయ్ సరిగా డీల్ చేయలేకపోయారని అన్నారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో, విజయ్ వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నారా? లేక ఆయన చుట్టూ ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారా? అని ప్రశ్నించారు.

“మద్దతు కోరే విధానం ఇదేనా?”

ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి మెజారిటీ లేనపుడు టీవీకే మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిందని సెల్వన్ అన్నారు. “మద్దతు కోరే పార్టీ అగ్ర నాయకులను విజయ్ స్వయంగా కలిసి మాట్లాడాలి. కానీ వాట్సాప్‌లో లేఖ పంపించి, దానికి సమాధానం ఇవ్వమని అడగడం రాజకీయ మర్యాదేనా?” అని ప్రశ్నించారు. టీవీకే మద్దతు కోరుతున్న తీరు సరిగా లేదన్నారు.

‘రాజకీయ విమర్శలు సరికాదు’

ఎన్నికల ఫలితాల అనంతరం టీవీకే నాయకత్వం రాజకీయ పరిపక్వత చూపలేదని సెల్వన్ విమర్శించారు. “గెలుపొందగానే ‘రాచరికపు రోజులు ముగిశాయి’ అని అనడం ప్రతీకార రాజకీయాలను సూచిస్తోంది” అని అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని, వంశపారంపర్య రాజకీయాలపై విమర్శలు చేయడం తగదన్నారు.

“మోతీలాల్ నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్‌లో ఐదు తరాల రాజకీయ వారసత్వం ఉంది. అలాంటి పార్టీతో మద్దతు పెట్టుకుని, వంశపారంపర్య రాజకీయాల గురించి మాట్లాడితే ఎలా ?” అని ప్రశ్నించారు.

డీఎంకేను ‘రాచరికం’ అంటూ విమర్శించిన తర్వాత, అదే కూటమిలో గెలిచిన వామపక్షాలు, వీసీకే మద్దతు కోరడంలో తార్కికత ఏమిటని సెల్వన్ ప్రశ్నించారు. టీవీకేలోని కొందరు నాయకులు వ్యక్తిగత కక్షలతో రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. “కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు విజయ్ ఇమేజ్‌ను ఉపయోగించుకుని డీఎంకేపై వ్యక్తిగత ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారు” అని అన్నారు.

“రిసార్ట్ రాజకీయాలు ఎందుకు?”

విజయ్ తన ఎమ్మెల్యేలకు రాజకీయ అవగాహన కల్పించాల్సిందిపోయి, వారిని రిసార్ట్‌లలో ఉంచడం సరైన పద్ధతి కాదని సెల్వన్ విమర్శించారు. “ఇది మళ్లీ రిసార్ట్ రాజకీయాలకు దారితీస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు” అని వ్యాఖ్యానించారు.

టీవీకే కార్యకర్తల వ్యాఖ్యలపై ఆగ్రహం..

వీసీకేలో కొద్దిమంది మాత్రమే తిరుమావళవన్‌తో ఉన్నారని, మిగతావారు టీవీకేకు అనుకూలమని కొందరు కార్యకర్తలు మాట్లాడుతున్నారన్న వార్తలపై కూడా సెల్వన్ స్పందించారు. “ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ నైతికతకు విరుద్ధం” అని అన్నారు.

బీజేపీతో జాగ్రత్త..

రాష్ట్ర రాజకీయ పరిస్థితిని బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందని సెల్వన్ ఆరోపించారు. “ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టి గవర్నర్ పాలన దిశగా బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ ప్రమాదాన్ని గుర్తించి తమిళనాడును కాపాడుకోవడం ఇప్పుడు ప్రధాన బాధ్యత” అని ఆయన హెచ్చరించారు.

విజయ్‌కు సూచన..

తన చుట్టూ ఉండి తప్పుడు సలహాలు ఇస్తున్న వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని విజయ్‌కు సూచించారు. “తనకు రావాల్సిన రాజకీయ మద్దతు ఎందుకు దూరమవుతోందో ఆయన అర్థం చేసుకోవాలి” అని అన్నారు.

Read More
Next Story