TVK విజయ్‌తో కాంగ్రెస్ చేతులు కలుపుతుందా?
x

TVK విజయ్‌తో కాంగ్రెస్ చేతులు కలుపుతుందా?

విజయ్‌తో పొత్తు లేకపోవడంతో నష్టపోయామన్న ఏఐసీసీ ఇన్‌చార్జ్ గిరీష్ చోడంకర్..


Click the Play button to hear this message in audio format

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలనలో పడింది. ఓటర్లు విజయ్ నేతృత్వంలోని టీవీకేకు జై కొట్టారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ స్థానాలు సాధించలేకపోయారు. ఇక విజయ్ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన హస్తం పార్టీతో చేతులు కలుపుతారన్న వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పటివరకు డీఎంకేతో ఉన్న కాంగ్రెస్, ఆ పార్టీకి హ్యాండిచ్చి, విజయ్‌తో చేతులు కలుపుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

తమిళనాడు ఏఐసీసీ ఇన్‌చార్జ్ గిరీష్ చోడంకర్ మంగళవారం మీడియా మాట్లాడారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఇచ్చిన సూచనలను పట్టించుకోలేదని, రాహుల్, విజయ్ కలిసి ప్రచారం చేసి ఉంటే మెజార్టీని మించి స్థానాలు వచ్చేవని పేర్కొన్నారు.

“రాహుల్ గాంధీకి తమిళనాడులో మంచి ఆదరణ ఉంది. ఆయన విజయ్‌తో కలిసి ప్రచారం చేసి ఉంటే, కూటమి 180–190 సీట్లు గెలుచుకునే అవకాశం ఉండేది” అని చోడంకర్ అన్నారు.

అయితే, ఇండియా కూటమి రాజకీయ పరిమితులు, అలాగే డీఎంకే వంటి దీర్ఘకాల మిత్రపక్షంతో ఉన్న బంధం కారణంగా, కాంగ్రెస్ నాయకత్వం టీవీకేతో పొత్తు పెట్టుకోకుండా డీఎంకేతోనే కొనసాగిందని ఆయన వివరించారు.

టీవీకే విజయాన్ని విశ్లేషిస్తూ, యువత, మహిళలు పెద్ద ఎత్తున మార్పుకోరుకున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా టీవీకేకు అనుకూలంగా ఒక బలమైన వాతావరణం ఏర్పడిందని, అదే ఫలితాల్లో ప్రతిబింబించిందని చెప్పారు.

డీఎంకేతోనే ఉండడం నచ్చని కొంతమంది తమ పార్టీ కార్యకర్తలు, ఓటర్లు టీవీకే వైపు వెళ్లారని, మరికొంతమంది ఆ పార్టీ తరఫున పోటీ చేశారని కూడా చెప్పారు.

ఎన్నికల అనంతర రాజకీయాలపై స్పందిస్తూ, ప్రస్తుత పరిస్థితులను కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలియజేశామని చోడంకర్ పేర్కొన్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తామని, దానిని మార్చే ప్రయత్నం చేయబోమని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయ మార్గాన్ని జాతీయ నాయకత్వమే నిర్ణయిస్తుందని ఏఐసీసీ కార్యదర్శి ఆల్వా నివేదిత్ తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో చర్చల అనంతరం తదుపరి వ్యూహం ఖరారు చేస్తామని చెప్పారు.

తాజా ఎన్నికల్లో టీవీకే అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఎం.కే. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కేవలం 59 సీట్లకే పరిమితమవగా, విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 సీట్లు సాధించి సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఐదు స్థానాలకే పరిమితమైంది.

మొత్తంగా చూస్తే, ఈ ఫలితాలు తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పుకు సంకేతంగా కనిపిస్తున్నాయి. కొత్త రాజకీయ శక్తిగా టీవీకే ఎదుగుతుండగా, సంప్రదాయ పార్టీల వ్యూహాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Read More
Next Story