టీవీకేకు కాంగ్రెస్ కండీషనల్ సపోర్ట్‌..
x

టీవీకేకు కాంగ్రెస్ కండీషనల్ సపోర్ట్‌..

మమతత్వ శక్తులను దూరం పెడితేనే మద్దతు ఇస్తామన్న కాంగ్రెస్ ..


Click the Play button to hear this message in audio format

ఎట్టకేలకు టీవీకే (Tamilaga Vettri Kazhagam)కు కాంగ్రెస్ పార్టీ షరతులతో కూడిన మద్దతు ప్రకటించింది. మే 6న ఈ విషయాన్ని హస్తం పార్టీ అధికారికంగా వెల్లడించింది. ఇదే సందర్భంలో మతతత్వ శక్తులను దూరంగా ఉంచాలని షరతు కూడా పెట్టింది. అందుకు అంగీకరిస్తే మద్దతు ఇస్తామని నిర్మొహమాటంగా చెప్పేసింది కాంగ్రెస్.

కూటమి లెక్కలు..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ ఫిగర్ 118. విజయ్ నేతృత్వంలోని టీవీకే గెలిచిన స్థానాలు 108. ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 10 స్థానాలు అవసరం. అయితే కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకుంది. మరో 5 సీట్లు అవసరం. దీంతో ఇతర పార్టీల మద్దతు కూడా విజయ్‌కి అవసరమైంది. ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీలు కూడా టీవీకేకు మద్దతు ఇవ్వొచ్చన్న వార్తలొస్తున్నాయి. ఈ మేరకు ఆ పార్టీ ముఖ్యనేతలతో చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం.


ఏఐఏడీఎంకేతో సంప్రదింపులు?

టీవీకే ప్రతినిధులు E. ఫళని స్వామి నివాసానికి వెళ్లినట్లు సమాచారం. దీంతో AIADMK (All India Anna Dravida Munnetra Kazhagam) తో కూడా చర్చలు జరుపుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పెట్టిన షరతు ప్రకారం, “మతతత్వ శక్తులు” కూటమిలో ఉండకూడదన్న కండీషన్‌తో టీవీకే దాదాపుగా బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇతర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, ముఖ్యంగా ఏఐఏడీఎంకే వంటి పార్టీలు కీలకంగా మారే అవకాశం ఉంది. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ప్రకటనలో ఈ కూటమి లౌకిక, ప్రగతిశీల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యమని తెలిపింది. ఇది పెరియార్ ఈవీ రామసామి సామాజిక భావాలు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సూత్రాలను అనుసరిస్తుందని పేర్కొంది. అలాగే కే. కామరాజ్ స్వర్ణయుగాన్ని తిరిగి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కూటమి పనిచేస్తుందని తెలిపింది.

వచ్చే ఎన్నికల్లోనూ..

తమ మద్దతు కేవలం ప్రభుత్వ ఏర్పాటుకే పరిమితం కాదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. స్థానిక సంస్థలు, లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఈ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఇటు టీవీకే అధినేత విజయ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలిసి ప్రజలకు హామీ ఇచ్చారు. తమిళ ప్రజల తీర్పును గౌరవిస్తూ, ముఖ్యంగా యువత ఆశయాలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉంటామని వారు పేర్కొన్నారు.

మొత్తంగా, కాంగ్రెస్ మద్దతుతో టీవీకేకు రాజకీయంగా బలం పెరిగింది. అయితే పూర్తి మెజారిటీ కోసం ఇంకా కూటమి చర్చలు కీలకంగా మారనున్నాయి.

Read More
Next Story