
తొలి కేబినెట్‌లో సువేందు కీలక నిర్ణయాలు..
చొరబాట్లను అడ్డుకునేందుకు బంగ్లాదేశ్ సరిహద్దు వెంట కంచె ఏర్పాటుకు బీఎస్ఎఫ్‌కు అనుమతి..
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి సువేందు అధికారి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దు వెంట కంచె ఏర్పాటు కోసం బీఎస్ఎఫ్‌కు భూమి బదిలీకి ఆమోదం తెలపడం, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఈ సమావేశంలో ప్రధాన అంశాలుగా నిలిచాయి.
సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. బీఎస్ఎఫ్‌కు భూమి బదిలీ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నామని చెప్పారు. “బంగ్లాదేశ్ సరిహద్దుకు కంచె వేయడానికి అవసరమైన భూమిని బీఎస్ఎఫ్‌కు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది” అని ఆయన తెలిపారు.
అదేవిధంగా, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆరోగ్య పథకం ‘‘ఆయుష్మాన్ భారత్’’ను పశ్చిమ బెంగాల్‌లో అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే పీఎం జన్ ఆరోగ్య యోజన, పీఎం విశ్వకర్మ వంటి పథకాలను కూడా రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పారు.
రాష్ట్ర పాలనలో సంస్కరణలకు సంబంధించి కూడా పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర కేడర్ అధికారులకు కేంద్ర ప్రభుత్వ శిక్షణ అందించేందుకు అధికారాన్ని ప్రధాన కార్యదర్శికి ఇచ్చినట్లు సువేందు తెలిపారు.
ఇక క్రిమినల్ చట్టాలకు సంబంధించి, గత ప్రభుత్వం బీఎన్ఎస్ అమలు చేయకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని ఆరోపించిన ఆయన, ఇప్పుడు రాష్ట్రంలో బీఎన్ఎస్ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు చెప్పారు.
అలాగే, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన 2025 జనాభా లెక్కల సర్క్యులర్‌ను గత ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపిస్తూ, దానిని తక్షణమే అమలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, శాంతిభద్రతల పరిస్థితులపై కూడా సమీక్ష జరిగింది. ప్రధాన కార్యదర్శి, హోం కార్యదర్శి, డీజీపీ, కోల్‌కతా పోలీస్ కమిషనర్ సహా సీనియర్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు.
రాష్ట్రంలో రాజకీయ హింస ఘటనలపై కూడా ప్రభుత్వం స్పందించింది. రాజకీయ ఘర్షణల్లో మరణించిన 321 మంది కేసులను బాధిత కుటుంబాలు కోరితే విచారణకు సిద్ధమని సీఎం తెలిపారు.
“డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేస్తుంది. ప్రజలకు పారదర్శక, సమర్థవంతమైన పాలన అందిస్తాం” అని సువేందు అధికారి స్పష్టం చేశారు.

