
గుజరాత్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం
15 మున్సిపల్ కార్పొరేషన్లు, 33 జిల్లా పంచాయతీల్లో ఎగిరిన కాషాయ జెండా..
గుజరాత్‌లో మంగళవారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన మొత్తం 15 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు రాష్ట్రంలోని 34 జిల్లా పంచాయతీలలో 33 పంచాయతీలను బీజేపీ గెలుచుకుంది.
250 తాలూకా పంచాయతీలు, 84 మున్సిపాలిటీల తుది ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ స్థానిక సంస్థలలో అత్యధిక స్థానాలను అధికార పార్టీ గెలుచుకోగా, కొన్నింటిని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), స్వతంత్ర అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.
15 మున్సిపల్ కార్పొరేషన్లు, 84 మున్సిపాలిటీలు, 34 జిల్లా పంచాయతీలు, 260 తాలూకా పంచాయతీలకు ఆదివారం పోలింగ్ జరిగింది. 4.18 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అహ్మదాబాద్, వడోదర, సూరత్, భావ్‌నగర్, జామ్‌నగర్, రాజ్‌కోట్ మునిసిపల్ కార్పొరేషన్‌లతో పాటు కొత్తగా ఏర్పడిన నవ్‌సారి, గాంధీధామ్, మోర్బి, వాపి, ఆనంద్, నదియాడ్, మెహసానా, పోర్ బందర్, సురేంద్రనగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ విజేతగా నిలిచింది.
గాంధీనగర్, జునాగఢ్ కార్పొరేషన్లకు వేరే ఎన్నికల విధానం ఉన్నందున, వాటికి ఎన్నికలు నిర్వహించలేదు. నర్మదా జిల్లా మినహా, బీజేపీ 33 జిల్లా పంచాయతీలను కూడా కైవసం చేసుకుంది.
నర్మదా జిల్లా పంచాయతీలో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఓడిపోయింది. ఈ పోటీలో 22 స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ 15 స్థానాలను గెలుచుకోగా, కాషాయ పార్టీ కేవలం ఏడు స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. నర్మదా జిల్లాలోని నాలుగు తాలూకా పంచాయతీలతో సహా 12 తాలూకా పంచాయతీలను కూడా తామే గెలుచుకున్నామని AAP ఒక ప్రకటనలో పేర్కొంది.
సిక్కా, జామ్ రావల్ మునిసిపాలిటీలతో పాటు వ్యారా, అంకాలవ్, హదద్, పాలన్‌పూర్, సిధ్‌పూర్, పటాన్ తాలూకా పంచాయతీలను కాంగ్రెస్ గెలుచుకుంది.
తాజా ఎస్ఈసీ గణాంకాల ప్రకారం.. 9,986 స్థానాలకు గాను బీజేపీ మొత్తం 7,491 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 1,740 సీట్లు, ఆప్ 489 సీట్లు గెలుచుకోగా, స్వతంత్రులు, ఏఐఎంఐఎం సహా ఇతర పార్టీలు 266 సీట్లు కైవసం చేసుకున్నాయి.
బీజేపీ తాలూకా పంచాయతీలలో 3,674 సీట్లు, జిల్లా పంచాయతీలలో 892 సీట్లు, మున్సిపాలిటీలలో 1,988 సీట్లు, మున్సిపల్ కార్పొరేషన్లలో 937 సీట్లు గెలుచుకుంది. భారీ భద్రత నడుమ ఉదయం 9 గంటలకు లెక్కింపు ప్రారంభమైంది.
డిసెంబర్ 26న జరిగిన ఓటింగ్ శాతం మున్సిపల్ కార్పొరేషన్లలో 55.1 శాతం, మున్సిపాలిటీలలో 65.53 శాతం, జిల్లా పంచాయతీలలో 66.64 శాతం మరియు తాలూకా పంచాయతీలలో 67.26 శాతంగా నమోదైంది.
మున్సిపల్ కార్పొరేషన్లలో కచ్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన గాంధీధామ్‌లో అత్యల్పంగా 46.03 శాతం పోలింగ్ నమోదు కాగా, వల్సాద్ జిల్లాలోని వాపిలో అత్యధికంగా 72.29 శాతం పోలింగ్ నమోదైంది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 51.81 శాతం పోలింగ్ నమోదైంది.
ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్ల కోసం సవరించిన నిబంధనల ప్రకారం ఎన్నికలు జరిగాయి. దీని కోసం అనేక జిల్లాల్లో విస్తృతమైన పునర్విభజన, వార్డుల పునర్నిర్మాణం అవసరమైంది.
ఈసారి అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ అహ్మదాబాద్‌లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయినప్పటికీ, భుజ్ మున్సిపాలిటీలో ఆ పార్టీ అభ్యర్థులు ముగ్గురు గెలుపొందారు.
మోదీ హ్యాపీ..
ఫలితాల అనంతరం, గుజరాత్, భారతీయ జనతా పార్టీ మధ్య బంధం "ఇప్పుడు మరింత గాఢంగా, విడదీయరానిదిగా మారింది!" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. "రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, తాలూకా పంచాయత్, జిల్లా పంచాయత్ ఎన్నికలలో బీజేపీకి లభించిన అఖండ ప్రజా మద్దతు, తీర్పునకు గుజరాత్ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను," అని ప్రధాని ఎక్స్‌లో పోస్టు చేశారు.
ప్రధాని మోదీ అభివృద్ధి-కేంద్రీకృత రాజకీయాలకు మద్దతు ఇచ్చి, బీజేపీకి భారీ విజయాన్ని అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ విలేకరుల సమావేశంలో అన్నారు.
బీజేపీ టికెట్‌పై పోటీ చేసిన మాజీ ఐపీఎస్ అధికారి మనోజ్ నినామా, మాజీ ఎమ్మెల్యే భూపేంద్ర భయానీ ఓడిపోయారు.

