
బెంగాల్‌లో బీజేపీ విజయం..ఢాకాలో తీస్తాపై ఆశలు, అక్రమ వలసలపై ఆందోళనలు.
2024 ఆగస్టులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అధికారాన్ని కోల్పోయిన తర్వాత, భారత్-బంగ్లాదేశ్ మధ్య బలహీనపడ్డ సంబంధాలు.. అవి మళ్లీ బలపడతాయా?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి రావడం బంగ్లాదేశ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. అక్కడి రాజకీయ, దౌత్య వర్గాల్లో ఒకవైపు ఆశాభావం కనిపిస్తుండగా, మరోవైపు ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ప్రత్యేకంగా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న తీస్తా నదీ జలాల పంపిణీ ఒప్పందం ఇప్పుడు ముందుకు కదిలే అవకాశం ఉందని ఢాకాలో ఆశలు చిగురిస్తున్నాయి. అదే సమయంలో, బీజేపీ ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రస్తావించిన “అక్రమ బంగ్లాదేశీ వలసదారులు” అంశం భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీయవచ్చన్న భయం కూడా కనిపిస్తోంది.
2024 ఆగస్టులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అధికారాన్ని కోల్పోయిన తర్వాత, భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు కొంత ఉద్రిక్త దశలోకి వెళ్లాయి. అయితే ప్రస్తుతం రెండు దేశాలు సంబంధాలను మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయి.
భారత్, బంగ్లాదేశ్ మధ్య సుమారు 4,097 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు అనేక ప్రాంతాల్లో సులభంగా దాటగలిగేలా ఉండటం వల్ల అక్రమ వలసలు, స్మగ్లింగ్ వంటి సమస్యలు ఎప్పటినుంచో ఉన్నాయి.
ఇదే సమయంలో, గంగా, బ్రహ్మపుత్ర, మేఘనతో పాటు 54కు పైగా నదులను ఈ రెండు దేశాలు పంచుకుంటున్నాయి. అందులో తీస్తా నది అత్యంత కీలకం.
తీస్తా నదీ వివాదం ఎందుకు కీలకం?
తీస్తా నది ఉత్తర బెంగాల్‌తో పాటు బంగ్లాదేశ్ ఉత్తర ప్రాంతాలకు జీవనాధారం లాంటిది. వ్యవసాయం, తాగునీరు, నీటిపారుదల అవసరాలకు లక్షలాది మంది ఈ నదిపై ఆధారపడుతున్నారు.
2011లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా తీస్తా జలాల ఒప్పందం ఖరారయ్యే దశకు చేరింది. కానీ అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ఒప్పందం నిలిచిపోయింది.
రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరుగుతుందనే కారణంతో మమతా ఆ ఒప్పందాన్ని వ్యతిరేకించారు. రాష్ట్ర మద్దతు లేకుండా కేంద్రం ముందుకు వెళ్లకపోవడంతో, ఈ ఒప్పందం ఇప్పటివరకు అమలు కాలేదు.
బంగ్లాదేశ్‌లో ఈ విషయం ఎప్పటినుంచో రాజకీయంగా సున్నిత అంశంగా ఉంది. అక్కడి భారత్ వ్యతిరేక వర్గాలు తీస్తా అంశాన్ని తరచూ ఢిల్లీపై విమర్శలకు ఉపయోగించాయి.
ఇప్పుడు బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడంతో, కేంద్రం-రాష్ట్రం మధ్య సమన్వయం పెరిగి తీస్తా ఒప్పందం ముందుకు కదిలే అవకాశం ఉందని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ వలసల అంశంపై కొత్త టెన్షన్..
తీస్తా అంశంపై ఆశలు పెరుగుతున్నప్పటికీ, అక్రమ వలసల విషయం బంగ్లాదేశ్‌లో ఆందోళన కలిగిస్తోంది. అస్సాం, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారాల్లో బీజేపీ నేతలు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వలసదారుల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో కొత్త ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందేమోనని ఢాకాలో చర్చ మొదలైంది.
బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహమాన్ మాట్లాడుతూ, “పశ్చిమ బెంగాల్‌లో కొత్త ప్రభుత్వం ‘పుష్-ఇన్’ చర్యలు పెంచితే బంగ్లాదేశ్ కూడా స్పందిస్తుంది” అని హెచ్చరించారు.
అయితే బంగ్లాదేశ్ హోం మంత్రి సలాహుద్దీన్ అహ్మద్ మాత్రం కొంత మితంగా స్పందించారు. అలాంటి పరిస్థితులు రావని ఆశిస్తున్నట్లు చెప్పారు. సరిహద్దు దళాలను అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆదేశించినట్లు తెలిపారు.
కీలక అంశం అక్రమ వలసలు..
బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలపై గతంలో కూడా చర్చ జరిగినప్పటికీ, బీజేపీ ఈ ఎన్నికల్లో దాన్ని ప్రధాన రాజకీయ అస్త్రంగా మలిచింది. అస్సాంలో ఇది చాలా కాలంగా ప్రధాన రాజకీయ అంశంగా ఉండగా, ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో కూడా అదే వ్యూహాన్ని బీజేపీ అనుసరించింది. రాష్ట్రంలో ముస్లిం జనాభా గణనీయంగా ఉండటం, సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ చొరబాట్ల ఆరోపణలు రావడం వంటి అంశాలను బీజేపీ తన ప్రచారంలో బలంగా వినిపించింది.
ఇటీవల జరిగిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (S.I.R) వివాదం కూడా రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. లక్షలాది పేర్లు తొలగించారన్న ఆరోపణల మధ్య కూడా బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేయడం, రాష్ట్రంలో ఆ పార్టీకి పెరుగుతున్న మద్దతును చూపుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
బంగ్లాదేశ్ ఎందుకు కీలకం?
భారత్ ఈశాన్య రాష్ట్రాలకు బంగ్లాదేశ్ భౌగోళికంగా అత్యంత కీలకం. ఆ ప్రాంతంలో భద్రత, వాణిజ్యం, కనెక్టివిటీ పరంగా ఢాకాతో మంచి సంబంధాలు భారత్‌కు అవసరం. ఇదే సమయంలో, బంగ్లాదేశ్‌లో చైనా ప్రభావం పెరుగుతోంది. మరోవైపు పాకిస్థాన్ కూడా అక్కడ తన ప్రభావాన్ని మళ్లీ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీ భావిస్తోంది. అందుకే బంగ్లాదేశ్‌తో సంబంధాలను బలంగా కొనసాగించడం భారత్‌కు వ్యూహాత్మక అవసరంగా మారింది.
కొత్త ప్రభుత్వానికి ద్వంద్వ సవాలు..
బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వానికి ఇప్పుడు రెండు కీలక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒకవైపు బంగ్లాదేశ్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తీస్తా ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లాలి. మరోవైపు అక్రమ వలసల అంశంపై తమ ఎన్నికల హామీలను కూడా సమతుల్యం చేయాలి. ఈ రెండు అంశాలు రాబోయే రోజుల్లో భారత్-బంగ్లాదేశ్ సంబంధాల దిశను నిర్ణయించే కీలక అంశాలుగా మారే అవకాశం ఉంది.

