
బీహార్‌లో మంత్రివర్గ విస్తరణ..
జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్‌తో పాటు మరో 30 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ నేత సమ్రాట్ చౌదరి గురువారం మంత్రివర్గ విస్తరణకు శ్రీకారం చుట్టారు. జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్‌తో పాటు మరో 30 మంది గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం ఐదు పార్టీల ఎన్డీఏ కూటమి నాయకులకు మంత్రివర్గంలో చోటు దక్కింది.
ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌తో పాటు ఎన్డీఏ కీలక నేతలు హాజరయ్యారు.
బీజేపీ ఆధిపత్యానికి సంకేతం..
మంత్రివర్గ విస్తరణలో బీజేపీ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కొత్త క్యాబినెట్‌లో 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కగా, జేడీ(యూ)కు చెందిన 13మందికి బెర్త్‌లు కేటాయించారు. మిత్రపక్షాలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. బీహార్‌లో బీజేపీ తన బలాన్ని పెంచుకునే వ్యూహంలో భాగంగానే ఈ విస్తరణ జరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గత నెలలో నితీష్ కుమార్ రాజ్యసభకు ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం సమ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో బీహార్ చరిత్రలో తొలిసారిగా పాలనా పగ్గాలు బీజేపీ చేతుల్లోకి వెళ్లాయి.
మంత్రివర్గంలోకి నిశాంత్..
మంత్రివర్గ విస్తరణలో నిశాంత్ కుమార్ ఎంట్రీ అత్యంత చర్చనీయాంశం. జేడీయూలో అధికారికంగా చేరిన కొద్ది వారాల్లోనే ఆయనకు మంత్రి పదవి దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన నిశాంత్ తొలుత మంత్రి పదవి స్వీకరించేందుకు ఆసక్తి చూపలేదని సమాచారం. అయితే పార్టీ నాయకులు, కార్యకర్తల ఒత్తిడి, ప్రోత్సాహంతో చివరకు ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది.
నిశాంత్ ఎంట్రీ వారసత్వ మార్పునకు సంకేతం..
నిశాంత్ ప్రవేశాన్ని జేడీయూలో రాజకీయ వారసత్వ మార్పునకు సంకేతంగా భావిస్తున్నారు. నితీష్ తర్వాత పార్టీ భవిష్యత్ నాయకత్వానికి నిశాంత్‌ను సిద్ధం చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది.
జేడీయూ తరఫున పలువురు సీనియర్ నేతలకు మళ్లీ మంత్రి పదవులు దక్కాయి. మాజీ మంత్రులు శ్రావణ్ కుమార్, అశోక్ చౌదరికి క్యాబినెట్‌లో చోటు కల్పించారు. అలాగే శ్వేతా గుప్తా లాంటి కొత్త వారికి కూడా అవకాశం కల్పించారు.
ఇక బీజేపీ తరఫున ఉప ముఖ్యమంత్రిగా విజయ్ కుమార్ సిన్హాతో పాటు కేదార్ గుప్తా, మిథిలేష్ తివారీ, నితీష్ మిశ్రా, ప్రమోద్ చంద్రవంశీ, రామ నిషాద్, లఖింద్ర పాశ్వాన్, సంజయ్ సింగ్ టైగర్ వంటి నేతలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇంజనీర్ శైలేంద్ర తొలిసారిగా మంత్రి పదవి చేపట్టారు. కొత్త క్యాబినెట్‌లో ఇద్దరు బ్రాహ్మణ నేతలు- నితీష్ మిశ్రా, మిథిలేష్ తివారీకి కూడా చోటు కల్పించారు.
మిత్రపక్షాలకూ ప్రాధాన్యం..
ఎన్డీఏ మిత్రపక్షాలకు కూడా మంత్రి పదవులు కేటాయించారు. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జేపీ(ఆర్)కు రెండు మంత్రి పదవులు దక్కాయి. హెచ్ఏఎం, ఆర్ఎల్ఎంకు ఒక్కో స్థానం కేటాయించారు. ఎల్‌జేపీ(ఆర్) నుంచి సంజయ్ పాశ్వాన్, సంజయ్ సింగ్‌లు, హెచ్ఏఎం నుంచి సంతోష్ సుమన్, ఆర్ఎల్ఎం నుంచి దీపక్ ప్రకాష్ క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.
ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని ఆర్ఎల్ఎంకు ప్రాతినిధ్యంపై చివరి నిముషం వరకు ఉత్కంఠ నెలకొంది. అమిత్ షాతో జరిగిన చర్చల తర్వాత ఆ పార్టీకి ప్రాతినిధ్యం ఖరారైందని సమాచారం.
షా సమావేశం..
మంత్రివర్గ విస్తరణ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం పాట్నాకు చేరుకున్నారు. సమ్రాట్ చౌదరి స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో కలిసి అమిత్ షా హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఎన్డీఏ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరమే మంత్రుల జాబితా ఖరారైనట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
నిశాంత్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ..
నిశాంత్ కుమార్ క్యాబినెట్‌లో చేరడంతో, బీహార్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇది కేవలం మంత్రివర్గ విస్తరణ మాత్రమే కాకుండా, జేడీయూలో భవిష్యత్ నాయకత్వ మార్పుకు సంకేతమా? అనే ప్రశ్న కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
మరోవైపు బీజేపీ బలపడటం, సమ్రాట్ చౌదరి ఆధ్వర్యంలో ప్రభుత్వం మరింత దూకుడుగా ముందుకు సాగుతుందనే సంకేతాలు కూడా ఈ విస్తరణ ద్వారా స్పష్టమవుతోంది.

