
ఆటో డ్రైవర్ నుంచి ఎమ్మెల్యే..
తమిళనాడులో విజయ్ దాము సంచలన విజయం
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కె.వి. విజయ్ దాముది ఒక అద్భుత విజయగాథ. ఇతను గతంలో ఆటో డ్రైవర్. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా, ఆర్థిక బలం లేకున్నా..చెన్నైలోని రాయపురం నియోజకవర్గం నుంచి తమిళగ వెట్రి కజగం (టీవీకే) అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు.
దాము గెలుపు సాధారణ విజయం కాదు. ఆయన ప్రత్యర్థులు ఇద్దరూ రాజకీయంగా బలమైన కుటుంబాలకు చెందినవారు. ఏఐఏడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి డి. జయకుమార్, అలాగే డీఎంకే మాజీ మంత్రి రెహమాన్ ఖాన్ కుమారుడు డాక్టర్ ఎ. సుబైర్ ఖాన్‌ను ఆయన ఓడించారు. సుబైర్ ఖాన్‌పై దాము 14,249 ఓట్ల తేడాతో గెలవగా, జయకుమార్ మూడో స్థానంలో నిలిచారు.
ఈ విజయం తమిళనాడు రాజకీయాల్లో ఒక పెద్ద మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు. డబ్బు, కుటుంబ ఆధిపత్యం, వంశపారంపర్య రాజకీయాలపై ప్రజలు విసుగు చెందినట్లు ఇది చూపిస్తోంది. సాధారణ ప్రజలకూ రాజకీయాల్లో స్థానం ఉందని ఈ ఫలితం స్పష్టం చేసింది.
విజయ్ దాము వ్యక్తిగత జీవితం కూడా స్ఫూర్తిదాయకమే. ఆయన ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. 8వ తరగతి వరకు మాత్రమే చదివాడు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, ఆయన ఆస్తులు రూ.28.9 లక్షలు మాత్రమే, అప్పులు లేవు. ఒకప్పుడు ఆటో డ్రైవర్‌గా పనిచేసిన ఆయన, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎదగడం సామాన్య ప్రజలకు కొత్త ఆశలను రేక్కెత్తిస్తోంది.
ఈ విజయానికి టీవీకే అధినేత, నటుడు విజయ్ ప్రభావం కూడా ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. సామాన్య ప్రజలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తామన్న ఆయన హామీకి ఇది ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.
రాయపురం మాత్రమే కాదు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా టీవీకే ప్రభావం స్పష్టంగా కనిపించింది. మదురై సెంట్రల్‌లో టీవీకే అభ్యర్థి బధురుద్దీన్ (ముస్తఫా) డీఎంకే నేత పళనివేల్ త్యాగ రాజన్‌పై దాదాపు 20 వేల ఓట్ల తేడాతో గెలిచారు.
మొత్తంగా ఈ ఎన్నికలు తమిళనాడులో రాజకీయాల్లో ఒక కొత్త దశను ప్రారంభించాయి. నిజాయితీ, సాధారణ జీవితం, ప్రజలతో అనుబంధం వంటి అంశాలు ఇప్పుడు కీలకంగా మారుతున్నాయి. ‘విజయ్ వేవ్’గా చెబుతోన్న ఈ మార్పు, భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాలను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉంది.

