
‘అధిక ఓటింగ్ ‘మార్పునకు సంకేతం’
మమతా వైదొలగడం ఖాయమటున్న కేంద్ర మంత్రి అమిత్ షా
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో భారీగా ఓటర్లు పాల్గొనడం రాష్ట్రంలో మార్పునకు సంకేతమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఈ అధిక ఓటింగ్ శాతం బీజేపీకి అనుకూలంగా ఉందని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారం కోల్పోవడం ఖాయమని పేర్కొన్నారు.
తొలి దశ పోలింగ్‌లో 92 శాతం నమోదయిన తర్వాత, కోల్‌కతాలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. 152 నియోజకవర్గాల్లో బీజేపీ 110కి పైగా స్థానాలు దక్కుతాయని ధీమా వ్యక్తం చేశారు.
“మాకు వచ్చిన సమాచార ప్రకారం.. బెంగాల్ ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. వారు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపర్చారు. అధిక ఓటింగ్ శాతం మమతా ప్రభుత్వానికి ముగింపు దశ,” అని అన్నారు.
ఈ ఎన్నికలను “మార్పుల అల”గా అభివర్ణించిన షా.. ఓటర్ల ఉత్సాహం బీజేపీకి అనుకూలంగా ఉందని చెప్పారు. రెండో దశలో మరింత ఎక్కువగా ఓటర్లు పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
“152 స్థానాల్లో 110కి పైగా గెలిస్తే, రెండో దశ తర్వాతే బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే దిశగా ముందుకు సాగుతుంది,” అని తెలిపారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే, ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు ముగింపు పలికి, శాంతిభద్రతలను పునరుద్ధరిస్తామని షా హామీ ఇచ్చారు. చొరబాట్లు, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు, దోపిడీలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై దృష్టి పెడతామన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.
ఇక టీఎంసీపై కూడా షా విమర్శలు గుప్పించారు. బీజేపీపై ప్రజల్లో లేనిపోని భయాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. “బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాల్‌ను బయటివాళ్లు పాలిస్తారని ప్రచారం చేస్తున్నారు. కానీ తదుపరి ముఖ్యమంత్రి బెంగాల్‌లో పుట్టి, అక్కడే పెరిగి, బెంగాలీ మాట్లాడగలిగే వారే ఉంటారు,” అని షా స్పష్టం చేశారు.
మొత్తంగా, తొలి దశలో నమోదైన భారీ ఓటింగ్‌ను బీజేపీ తనకు అనుకూలంగా భావిస్తోంది. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామనే నమ్మకాన్ని అమిత్ షా వ్యక్తం చేశారు.

