
పొగాకు రైతులపై ఇంత పగ ఎందుకన్న జగన్!
వారం పది రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తానని పొగాకు రైతులకు హామీ
ఆంధ్రప్రదేశ్‌లో పొగాకు రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ధరలు కుప్పకూలిపోవడంతో లక్షలాది మంది రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు అండగా నిలుస్తామని ప్రకటిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పొగాకు రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పొగాకు రైతులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రైతుల నుంచి నేరుగా సమస్యలు విన్న ఆయన... వచ్చే వారం లేదా పది రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తానని ప్రకటించారు.
గోపాలపురం లేదా జంగారెడ్డిగూడెంలో రైతులను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. అక్కడి నుంచే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని వెల్లడించారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే... కొద్ది రోజుల వ్యవధిలో ప్రకాశం జిల్లా కందుకూరులో కూడా మరో పర్యటన చేపడతానని స్పష్టం చేశారు.
ఏ జిల్లాలో, ఏ పంట రైతులు ఇబ్బందులు పడుతున్నా వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు.
జగన్ చేసిన ప్రధాన ఆరోపణల్లో ఒకటి... పొగాకు కొనుగోళ్లలో తీవ్ర జాప్యం. ఆయన వివరాల ప్రకారం...
పొగాకు వేలం ప్రారంభమై దాదాపు 94 రోజులు గడిచినా... రాష్ట్రంలో పండిన 232 మిలియన్ కిలోల పొగాకులో కేవలం 38 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు చేశారని అన్నారు. అంటే మొత్తం పంటలో కేవలం 16.5 శాతం మాత్రమే కొనుగోలు జరిగిందని చెప్పారు.
సాధారణంగా వంద రోజుల్లో పూర్తవాల్సిన కొనుగోళ్లు... 94 రోజులు గడిచినా ఐదో వంతు కూడా పూర్తి కాకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన విమర్శించారు.
అంతేకాదు... సెప్టెంబరులో కర్ణాటకలో వేలం ప్రారంభమైతే వ్యాపారులు అక్కడికి వెళ్లిపోతారని, అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన పొగాకును ఎవరు కొనుగోలు చేస్తారనే ఆందోళన రైతుల్లో ఉందని పేర్కొన్నారు.
ధరల అంశంపై కూడా జగన్ తీవ్ర విమర్శలు చేశారు.
పొగాకు ధర రూ.200కు తగ్గకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలో చెప్పిన మరుసటి రోజే మార్కెట్లో ధరలు పడిపోయాయని అన్నారు.
పొదిలిలో రూ.179... టంగుటూరులో రూ.184... కనిగిరిలో రూ.184... కందుకూరులో రూ.186... జంగారెడ్డిగూడెంలో రూ.170... గోపాలపురంలో అయితే కేవలం రూ.130కే కొనుగోలు చేశారని పేర్కొన్నారు.
ఇది వ్యాపారుల సిండికేట్ ఎంత బలంగా పనిచేస్తోందో చెప్పే ఉదాహరణ అని జగన్ ఆరోపించారు.
రైతులు "ఏదో ఒక ధరకు మా పంట కొనండి... మమ్మల్ని బతికించండి" అని వేడుకునే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు.
టొబాకో బోర్డు ఉద్దేశం... వ్యాపారుల మధ్య పోటీ పెంచి రైతులకు మంచి ధర కల్పించడమేనని గుర్తు చేసిన జగన్... ప్రస్తుతం వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను నియంత్రిస్తున్నారని ఆరోపించారు.
నిబంధనలు ఉల్లంఘించిన ఒక్క కంపెనీపైనా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని... ఏ కంపెనీ లైసెన్సును సస్పెండ్ చేయలేదని... ఒక్క వ్యాపారినీ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టలేదని విమర్శించారు.
లైసెన్సుదారులు ముందుగా ఇచ్చిన కొనుగోలు హామీలను అమలు చేయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే... మార్క్‌ఫెడ్‌ను వెంటనే కొనుగోళ్లలోకి తీసుకురావాలని జగన్ కోరారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మార్క్‌ఫెడ్‌ను పొగాకు వేలం ప్లాట్‌ఫారంపైకి తీసుకురావడంతో మార్కెట్లో నిజమైన పోటీ ఏర్పడిందని... వ్యాపారుల సిండికేట్ బలహీనపడిందని చెప్పారు.
ప్రభుత్వం రైతుల తరఫున కొనుగోళ్లకు సిద్ధంగా ఉందనే సంకేతంతో అప్పట్లో ధరలు పెరిగాయని... కానీ ఇప్పుడు మార్క్‌ఫెడ్‌ను కొనుగోళ్లలోకి రానివ్వకపోవడంతో వ్యాపారుల సిండికేట్ మరింత బలపడుతోందని ఆరోపించారు.
పొగాకు రైతుల సమస్యలపై జగన్ ప్రకటించిన పర్యటన రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందా? రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? లేక ఈ అంశం రాజకీయ విమర్శలకే పరిమితం అవుతుందా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.
Next Story

