x
అనంతపురంలో రోడ్డుపై బైఠాయించిన వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి

పులివెందుల: జగన్ అడ్డాలో పొలిటికల్ హీట్ పెంచిన ర్యాలీ.. ఉద్రిక్తత

రాయలసీమలో వైసీపీ ప్రదర్శనలు. అనంతపురంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు


Click the Play button to hear this message in audio format

మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సోమవారం ఆ పార్టీ నేతలు నిరసన ర్యాలీలు నిర్వహించారు.

వైసీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ అడ్డా పులివెందులలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి సారధ్యంలో భారీ ప్రదర్శనకు పిలుపు ఇచ్చారు. దీంతో పోలీసులు ఆంక్షలు విధించినా ఏమాత్రం ఖాతరు చేయకుండా వైసీపీ శ్రేణులతో పాటు విద్యార్థులను కూడా ఈ కార్యక్రమంలో మమేకం చేశారు. దీంతో పులివెందుల పట్టణం జనసంద్రంగా మారింది. ఆర్డీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కార్యాలయంలోకి దూసుకుని వెళ్లడానికి ప్రయత్నించిన కార్యకర్తలను నిలువరించడానికి పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జీ చేశారు. దీంతో ఉద్రిక్తతకు దారితీసింది.
పట్టణంలో పోలీసులు నిషేధాజ్ణలు విధించినా, భారీగా తరలివచ్చిన విద్యార్థులు, వైసీపీ నేతలతో పాటు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి తరలి వచ్చిన కార్యకర్తలతో ఈ కార్యక్రమం బలప్రదర్శనకు వేదికగా మారింది.
"మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి" అని కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్య శాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేసే వరకు పోరాటం సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. పులివెందుల పట్టణంలో సుదీర్ఘ విరామం తరువాత భారీ ప్రదర్శన నిర్వహించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ర్యాలీ అనంతరం ఎంపీ అవినాష్‌రెడ్డి, వైసీపీ నేతలు ఆర్డీవోకి వినతిపత్రం అందించారు. ఇదిలావుంటే,

తాడిపత్రిలో ఉద్రిక్తత

రాయలసీమలోని అన్ని జిల్లాల్లో వైసీపీ సోమవారం ఉదయం నుంచి నిర్వహించిన ప్రదర్శనలతో హోరెత్తాయి. కాగా, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉదయం నుంచి ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. డీఎస్సీలో అక్రమాలపై విచారణ జరిపించాలనే వైసీపీ పోరుబాటలో భాగంగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సారధ్యంలో భారీగా జనం రోడ్లపైకి వచ్చారు. ధర్నా నిర్వహించడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు.
"ప్రదర్శనలకు అనుమతి లేదు. ఆంక్షలు ఉన్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దు" అని పోలీసులు చేసిన సూచనలు కూడా తాడిపత్రిలో ఫలించలేదు. పార్టీ శ్రేణులలో కలిసి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎన్ని కేసులు ఎదురైనా సరే. మా పోరాటం ఆగదని పెద్దారెడ్డి తేల్చి చెప్పారు.
ఈ ప్రదర్శన రాజకీయంగా వైసీపీ సత్తా చాటిందని చెప్పవచ్చు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏమన్నారంటే..
"అవినీతి, అక్రమాలు చేయడం మా సంస్కృతి కాదు. మత్తు పదార్థాలు విక్రయాలతో సమాజాన్ని నాశనం చేయవద్దు" అని కేతిరెడ్డి పెద్దారెడ్డి హితవు పలికారు. అంతేకాకుండా,
"వైసీపీకి మద్దతుగా రాలేని వారు. టీడీపీ పక్కకు మాత్రం వెళ్ల వద్దు. ఇంటి పట్టున ఉండి పని చూసుకోండి" వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.

అనంతలో పార్టీ నేతల అడ్డగింత


తాడిపత్రిలో జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో వైసీపీ అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, ఆ పార్టీ రాయలసీమ కో ఆర్డినేటర్, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేష్ రెడ్డి బయలుదేరారు. వారందరినీ అనంతపురంలోనే పోలీసులు అడ్డగించడం ఉద్రిక్తతకు దారి తీసింది. తాడిపత్రికి బయలుదేరిన వారిని ముచ్చుకోట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ అక్కడే బైఠాయించి వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఆందోళనకు దిగారు.

Read More
Next Story