సుబ్బూ.. సైన్స్ లో నువ్వు గ్రేటబ్బా! కలాం స్పేస్ ఆన్ వీల్స్ అంటే..!
పిల్లల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంచేందుకు కృషి చేస్తున్న ఈ సుబ్రమణ్యం ఎవరు, ఎక్కడి వారు?
బుక్స్ ఆన్ వీల్స్... ఫుడ్ ఆన్ వీల్స్... టెంపుల్ ఆన్ వీల్స్... ఇలాంటి ఎన్నో కాన్సెప్టులు విన్నాం... చూశాం. రోడ్లపై బండ్ల మీద టిఫిన్లు అమ్మడం కూడా సర్వసాధారణమే. కానీ "సైన్స్ ఆన్ వీల్స్" గురించి ఎప్పుడైనా విన్నారా? పిల్లల దగ్గరికే సైన్స్‌ను తీసుకెళ్తున్న ఓ వినూత్న ప్రయోగం ఇది. దీనిపేరు "కలాం స్పేస్ ఆన్ వీల్స్."
ఇదిగో ఈయనే దీని సృష్టికర్త. పేరు సుబ్రమణ్యం. నెల్లూరు.
ఇదిగో ఈ వ్యానేసుకుని ఊరూరా తిరిగి గవర్నమెంటు స్కూళ్లలో పిల్లలకు సైన్స్ అంత ఈజీ సబ్జెక్టు మరేదీ లేదని చెబుతారు. ఈ భూమి ఎలా ఏర్పడిందో, మనిషి ఎలా పుట్టారో, ఆకాశంలోకి రాకెట్ ఎలా వెళుతుందో.. ఇలా అనేకం ఆయన చెబుతుంటారు. తన దగ్గరున్న గ్లోబును చూపిస్తుంటారు. అదేంటో చెప్పమని పిల్లల్ని అడుగుతారు. వాళ్లు చెప్పకపోతే తానే వాళ్లకు సులువుగా అర్థమయ్యేలా చెప్తారు.
సైన్స్ అంటే భయపడాల్సిన విషయం కాదని... అది మన నిత్యజీవితంలో భాగమేనని పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడమే ఆయన లక్ష్యం. సమాజంలో శాస్త్రీయ దృక్పథం పెరగాలని, గ్రామీణ విద్యార్థులకు కూడా ప్రపంచ స్థాయి విజ్ఞానం అందాలని భావించి "కలాం స్పేస్ ఆన్ వీల్స్"కు శ్రీకారం చుట్టారు.
ఇది కేవలం ఒక బస్సు కాదు... ఒకప్పుడు అందరితో "మొద్దబ్బాయి" అనిపించుకున్న సాధారణ విద్యార్థి... వేలాది మంది పిల్లల్లో శాస్త్రవిజ్ఞాన జ్యోతి వెలిగిస్తున్న స్ఫూర్తిదాయక ప్రయాణం.
చిన్నతనంలో సుబ్రహ్మణ్యాన్ని చాలామంది నిరుత్సాహపరిచారు. "నీకు చదువు రాదు... నువ్వు బలహీనుడివి" అంటూ తక్కువ అంచనా వేశారు. కానీ ఆ మాటలు ఆయనను వెనక్కి లాగలేదు.
చదువుపై పట్టు సాధించి ఉపాధ్యాయుడిగా మారిన తర్వాత ఆయన ఒక నిజాన్ని గ్రహించారు.
పిల్లల్లో లోపం లేదని... చదువు చెప్పే విధానంలోనే లోపం ఉందని అర్థం చేసుకున్నారు.
అదే ఆలోచన ఈ వినూత్న ప్రయోగానికి పునాది అయింది.
గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌లు, ఆధునిక పరికరాలు అందుబాటులో ఉండవు. ఈ లోటును భర్తీ చేయాలనే సంకల్పంతో సుబ్రహ్మణ్యం తన సొంత జీతాన్ని వెచ్చించి ప్రత్యేకంగా ఈ సైన్స్ బస్సును రూపొందించారు.
ఈ బస్సులోని ప్రతి అంశం పిల్లల్లో ఆసక్తిని రేకెత్తించేలా ఉంటుంది.
"లెర్నింగ్ బై డూయింగ్" విధానంలో పుస్తకాల్లో బొమ్మలు చూడడం మాత్రమే కాదు... పిల్లలే స్వయంగా సైన్స్ పరికరాలను ఉపయోగించి ప్రయోగాలు చేసే అవకాశం కల్పించారు.
అంతర్జాతీయ ప్రమాణాల టెలిస్కోపులు, మైక్రోస్కోపులు ఇందులో ఉన్నాయి. వాటి ద్వారా అంతరిక్షంలోని గ్రహాలను పరిశీలించడమే కాదు... కంటికి కనిపించని సూక్ష్మజీవులను కూడా నేరుగా చూసే అవకాశం పిల్లలకు లభిస్తోంది.
చార్టుల రూపంలో సులువుగా పాఠాలు చెబుతుంటారు. మానవ పరిణామ క్రమం మొదలు అంతరిక్షంలోకి మనిషి ఎలా వెళ్లాడు అనే వరకు తెలియజేస్తుంటారు.
అంతేకాదు... "బడ్డీంగ్ సైంటిస్ట్" పేరుతో ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. ప్రతి చిన్నారిలో దాగి ఉన్న శాస్త్రవేత్తను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.
సుబ్రహ్మణ్యం చేస్తున్న ఈ సైన్స్ యజ్ఞాన్ని గుర్తించిన ప్రముఖ సంస్థ ఇన్ఫోసిస్ ఆయనను దేశవ్యాప్తంగా ఎంపికైన ముగ్గురు ఉపాధ్యాయుల్లో ఒకరిగా ఎంపిక చేసి *"శిక్షాగ్రహ అవార్డు"*తో సత్కరించింది. ఆ అవార్డు ద్వారా వచ్చిన నగదు బహుమతిని కూడా ఆయన తన కోసం కాకుండా... బస్సు నిర్వహణకు, సైన్స్ ప్రచారానికే వినియోగించడం ఆయన నిబద్ధతకు నిదర్శనం.
సుబ్రహ్మణ్యం నమ్మకం ఒక్కటే...
"చదువు అంటే ర్యాంకులు సాధించడం కాదు... కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగడం కాదు. పిల్లలు ఒత్తిడి లేకుండా ఆనందంగా నేర్చుకోవాలి. చుట్టూ ఉన్న సమాజాన్ని, ప్రకృతిని పరిశీలిస్తూ సమస్యలకు పరిష్కారాలు వెతకడమే నిజమైన సైన్స్."
ఒకప్పుడు సమాజం చేత తక్కువ అంచనా వేయబడిన విద్యార్థి... నేడు "కలాం స్పేస్ ఆన్ వీల్స్" ద్వారా నెలకు 15కు పైగా పాఠశాలలను సందర్శిస్తూ వేలాది మంది గ్రామీణ విద్యార్థుల్లో శాస్త్రవిజ్ఞానంపై ఆసక్తిని, కొత్త ఆలోచనలను, పెద్ద కలలను నాటుతున్నారు.
నెల్లూరు సుబ్రహ్మణ్యం ప్రస్థానం... ఒక వ్యక్తి సంకల్పం ఉంటే సమాజంలో ఎంత పెద్ద మార్పు తీసుకురాగలడో చెప్పే స్ఫూర్తిదాయక గాథ.
Next Story

