
చంద్రబాబూ, ఆ ₹13,840 కోట్ల రుణం ఏం చేశావు? ఎంవీఎస్ నాగిరెడ్డి
"పంటకి ధరా లేదు, చంద్రబాబుకి పట్టింపూ లేదూ! పంట ఉత్పత్తుల్ని కొనే నాధుడు లేక అల్లాడుతున్న ఏపీ రైతు"
ప్రస్తుతం రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభాన్ని, గిట్టుబాటు ధరల కొరతను మరియు ప్రభుత్వ విధానాల లోపాలను ఆంధ్రప్రదేశ్ అగ్రీ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్. నాగిరెడ్డి ఈ ఇంటర్వ్యూలో సుదీర్ఘంగా విశ్లేషించారు.
ఆయన ప్రధానంగా వ్యవసాయ సంక్షోభానికి మూలల నుంచి ప్రస్తుత పరిస్థితి వరకు వివరించారు.
భారతదేశం 1950 నాటి ఆహార కొరత స్థితి నుంచి నేడు 140 కోట్ల జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలను పండించే మిగులు (Surplus) దేశంగా ఎదిగింది. అయితే, ఈ ఉత్పత్తి పెరుగుదల రైతులకు శాపంగా మారింది. పంటలు బాగా పండినా మార్కెట్లో లాభసాటి ధర రాకపోవడం వల్లే రైతులు తీవ్ర అప్పులపాలై ఆత్మహత్యలకు గురవుతున్నారు.
స్వామినాథన్ కమిటీ సిఫార్సులు- అమలులో వైఫల్యం
సాగు వ్యయానికి అదనంగా 50 శాతం లాభం చేర్చి (C2 + 50%) గిట్టుబాటు ధర ఇవ్వాలని స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసినప్పటికీ, ఏ ప్రభుత్వాలు కూడా దానిని పూర్తిస్థాయిలో పార్లమెంట్లో పెట్టి చట్టబద్ధత కల్పించలేదు.
రైతులు ఉద్యోగుల మాదిరిగా ఒక సంఘటిత శక్తిగా లేకపోవడం. వివిధ రాజకీయ పార్టీలకు బద్ధులై విడిపోవడం వల్ల వారి హక్కుల కోసం బలమైన పోరాటాలు చేయలేకపోతున్నారు.
ఖరీఫ్, రబీ సీజన్లలో వివిధ పంటల దుస్థితి
2025-26 ఆర్థిక సంవత్సరాన్ని రైతాంగానికి ఒక "చీకటి సంవత్సరం" గా అభివర్ణించారు. వివిధ పంటల్లో ఎదురైన నష్టాలను నాగిరెడ్డి గణాంకాలతో వివరించారు.
ఉల్లి, టమాటా: కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో ఉల్లిపాయలు, అరిటి పంటలకు కనీస ధర లేక రోడ్లపై పారబోసిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ప్రత్తి సాగులో 50% కర్నూలులోనే జరుగుతుంది. సాధారణంగా ఎకరానికి 13-14 క్వింటాళ్లు వచ్చే దిగుబడి ఈసారి 4-5 క్వింటాళ్లకు పడిపోయింది. కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీ ₹8,110 కాగా, మార్కెట్లో కేవలం ₹5,000 నుండి ₹6,000 కే అమ్ముకోవాల్సి రావడం వల్ల ప్రత్తి రైతులు దాదాపు ₹8,000 కోట్లు నష్టపోయారు.
మొక్కజొన్న: నంద్యాల ప్రాంతంలో ఎక్కువగా పండే మొక్కజొన్నకు కేంద్ర ప్రభుత్వం ₹2,400 మద్దతు ధర ప్రకటిస్తే, ఏపీ రైతులు ₹1,400 నుండి ₹1,600 కే తెగనమ్ముకున్నారు. పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం రబీలో స్టేట్ గవర్నమెంట్ నిధులతో కొనుగోళ్లు జరపగా, ఏపీ కూటమి ప్రభుత్వం మాత్రం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
పొగాకు (Tobacco): లైసెన్స్డ్ పంట అయిన పొగాకు విషయంలో ఐటీసీ (ITC) వంటి పెద్ద కంపెనీలు సిండికేట్గా మారి ధరలు తగ్గించేశాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి వేలం రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు మందగించి, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా సుమారు ₹13,840 కోట్ల రుణం సేకరించినప్పటికీ, ఆ నిధులను రైతుల పంటల కొనుగోళ్లకు వాడకుండా ఇతర పథకాలకు డైవర్ట్ చేశారని ఆరోపించారు.
అలాగే గతంలో ఉన్న ఉచిత పంటల బీమా (Insurance), సున్నా వడ్డీ రాయితీలు వంటివి ప్రస్తుత ప్రభుత్వంలో సక్రమంగా అందడం లేదని, గత 18 నెలలుగా ఇన్పుట్ సబ్సిడీలు కూడా చెల్లించలేదని పేర్కొన్నారు.
పంటల మార్పిడిపై విశ్లేషణ
డెల్టా ప్రాంతాలైన కృష్ణా, గోదావరి, పెన్నా బేసిన్లలో కరీఫ్ సీజన్లో వరి కాకుండా వేరే ప్రత్యామ్నాయ పంట వేసే అవకాశం భూగర్భ పరిస్థితుల రీత్యా సాధ్యం కాదు. అక్కడ వర్షపు నీరు నిల్వ ఉంటుంది కాబట్టి వరి మాత్రమే పండుతుంది.
అయితే బోర్ వెల్స్ ఉన్న మెట్ట ప్రాంతాలలో వరికి బదులుగా మొక్కజొన్న, జొన్న లేదా ఆయిల్ పామ్ వంటి లాభసాటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలే తప్ప, కేవలం వరి సాగును నిరుత్సాహపరచడం సరికాదని హితవు పలికారు.
రైతులకు కావలసింది ప్రభుత్వాల నుంచి వచ్చే కేవలం 'జాలి' లేదా చిన్నపాటి ఆర్థిక సాయం కాదు, తాము రక్తం చెమట మార్చి పండించిన పంటకు ధర్మబద్ధమైన గిట్టుబాటు ధర (న్యాయం) మాత్రమేనని నాగిరెడ్డి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.
Next Story

