జగన్ ది కిల్లర్ పార్టీ అట
x

జగన్ ది కిల్లర్ పార్టీ అట

టీడీపీలో కార్యకర్తలే అసలైన అధినేతలని, ప్రతి కార్యకర్త నాయకుడిగా ఎదగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ కేవలం రాజకీయ పార్టీ కాదని, అది ఒక కిల్లర్ పార్టీ అని ఆయన విమర్శించారు. శుక్రవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇన్‌చార్జ్‌లతో జరిగిన కాఫీ కబుర్లు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో జగన్ హయాంలో జరిగిన విధ్వంసాన్ని, అరాచకాలను ప్రజలకు నిరంతరం గుర్తు చేయాలని కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. వైసీపీ సోషల్ మీడియా సైకోలతో తప్పుడు ప్రచారాలు చేయిస్తోందని ఆయన మండిపడ్డారు.

అనుచరులను చంపుకుని..సానుభూతి రాజకీయాలా?
కడపలో ఇటీవల జరిగిన దస్తగిరి హత్యోదంతాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కలిసి భూములు దోచుకున్నారు. పంపకాల్లో తేడాలు రావడంతో సొంత పార్టీ కార్యకర్త దస్తగిరినే చంపేశారు. వాళ్ల మనుషులను వాళ్లే చంపుకుని, ఆ నేరాన్ని ఎదుటివారిపై నెట్టడం జగన్ రెడ్డికి అలవాటు అని సీఎం ఆరోపించారు. పరామర్శల పేరుతో జగన్ రోడ్ల మీదకు వచ్చి డ్రామాలు చేస్తున్నారని, తన కారు కింద పడి చనిపోయిన కార్యకర్తను మాత్రం జగన్ ఎందుకు పరామర్శించలేదని ఆయన ప్రశ్నించారు.
తల్లి, చెల్లిపై కోర్టుకా?..వివేకా హత్యపై విమర్శలు
సొంత కుటుంబ సభ్యుల పట్ల జగన్ వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఆస్తి కోసం తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చిన వ్యక్తిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదు. బాబాయ్ వివేకానందరెడ్డి హత్యను ఎన్నికల వరకు వాడుకుని, అధికారంలోకి వచ్చాక న్యాయం చేయమని అడిగిన చెల్లి సునీతను బెదిరించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. వైసీపీది గొడ్డలి సంస్కృతి అని ఆయన ఎద్దేవా చేశారు.
కార్యకర్తలే అధినేతలు .. కేడర్‌కు భరోసా
టీడీపీలో కార్యకర్తలే అసలైన అధినేతలని, ప్రతి కార్యకర్త నాయకుడిగా ఎదగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నన్ను అరెస్టు చేసినా, పార్టీని ఇబ్బంది పెట్టినా నేను కార్యకర్తలను కాపాడుకున్నాను. టీడీపీ కేడర్ రైట్ రాయల్‌గా బతకాలి అని ఆయన భరోసా ఇచ్చారు. సుదీర్ఘ కాలం అధికారంలో ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, గత ఐదేళ్లలో ఏపీ సర్వనాశనం అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నేరగాళ్లతో రాజకీయం చేయాల్సి రావడం తనకు కొత్తగా ఉందని, కిల్లర్ పార్టీ ఆగడాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వనని ఆయన హెచ్చరించారు.
Read More
Next Story