వైసీపీకి  సీసీడీ వ్యాధి సోకింది: చంద్రబాబు
x

వైసీపీకి సీసీడీ వ్యాధి సోకింది: చంద్రబాబు

గెలుపోటములకు అతీతమైన పసుపు సైన్యం నిలబడుతుందని చంద్రబాబు అన్నారు.


రాజకీయాల్లో ఓటమి ఎదురైనప్పుడు చాపచుట్టేసే పార్టీలు చాలా ఉంటాయని, కానీ 44 ఏళ్ల ప్రస్థానంలో ఎన్ని సంక్షోభాలు ఎదురైనా పసుపు జెండా పౌరుషం తగ్గలేదని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. గెలిచినా, ఓడినా కార్యకర్తలే సైనికులుగా నిలబడతారని, అది కేవలం తెలుగుదేశం పార్టీకే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. 2024 విజయం ఒక ఆరంభం మాత్రమేనని, వచ్చే ఎన్నికల్లో మరింత ఘనవిజయం సాధించడమే లక్ష్యమని కేడర్‌కు దిశానిర్దేశం చేశారు.

కార్యకర్తే అధినేత.. ఇది నినాదం కాదు, విధానం!
సాధారణంగా పార్టీల్లో పదవులు వారసులకో, ధనవంతులకో దక్కుతాయనే విమర్శ ఉంటుంది. కానీ, టీడీపీలో మండల స్థాయి నాయకురాలు, క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లను సైతం పొలిట్‌బ్యూరో సభ్యులుగా నియమించి, కార్యకర్తే అధినేత అనే సిద్ధాంతాన్ని ఆచరణలో చూపించామని చంద్రబాబు ప్రకటించారు. దాదాపు 250 మందితో కూడిన నూతన కమిటీలో సీనియారిటీకి గౌరవం ఇస్తూనే, నిబద్ధత కలిగిన కొత్త వారికి పెద్దపీట వేశామని ఆయన తెలిపారు.
వైసీపీపై వ్యంగ్యాస్త్రాలు..సీసీడీ వ్యాధి సోకింది
వైసీపీపై విమర్శలు చేస్తూ చంద్రబాబు తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓసీడీ అనేది ఒక వ్యాధి అయితే, వైసీపీకి ఇప్పుడు సీసీడీ (Credit Claiming Disorder - క్రెడిట్ చోరీ) వ్యాధి సోకింది అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధికి తామే పునాది అని, స్వాతంత్ర్యం కూడా తామే తెచ్చామని చెప్పుకున్నా ఆశ్చర్యం లేదంటూ మండిపడ్డారు. చివరికి ఆపరేషన్ సింధూర్ కోసం డ్రోన్లను కూడా తామే పంపించామని వారు ప్రచారం చేసుకునేలా ఉన్నారని ఎద్దేవా చేశారు.
కుట్రలను తిప్పికొడదాం.. అభివృద్ధిని కాపాడుకుందాం
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వారు, ఇప్పుడు ప్రభుత్వం తీసుకువస్తున్న పెట్టుబడులను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. కిల్లింగ్ మనస్తత్వం ఉన్న పార్టీకి అభివృద్ధి అంటే గిట్టదని, ఫేక్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీ చేస్తున్న ఈ కుట్రలను ప్రజలకు వివరించాలని, ప్రభుత్వంపై ఉన్న విశ్వాసంతో వస్తున్న పెట్టుబడులను కాపాడుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్ని సవాళ్లు వచ్చినా టీడీపీ కార్యకర్త ఎవరికీ తలవంచడని, మీసం మెలేసి ధైర్యంగా నిలబడతాడని చంద్రబాబు కొనియాడారు. కార్యకర్తల క్రమశిక్షణ, నాయకత్వపు విజన్ ఈ రెండు కలిస్తేనే తెలుగుదేశం అని ఆయన ముగించారు.
Read More
Next Story