
సవాల్ చేసిన రెండ్రోజులకే బ్రహ్మనాయుణ్ణి అరెస్ట్ చేశారెందుకు?
ఒకప్పటి పల్నాడు ఫైర్ బ్రాండ్, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇలా సైబరాబాద్ పోలీసులకు దొరికిపోవడం అనూహ్య పరిణామమే..
రాజకీయాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఈ వార్త ఇప్పుడు ఒక సంచలనం. ఒకప్పటి పల్నాడు ఫైర్ బ్రాండ్, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇలా సైబరాబాద్ పోలీసులకు దొరికిపోవడం.. అది కూడా రూ. 1,000 కోట్ల భూ కుంభకోణం కేసులో కావడం సాధారణ విషయం కాదు.
పక్కా క్రిమినల్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది ఆయన్ను అరెస్ట్ చేసిన తీరు. తాను ఏ తప్పూ చేయలేదని, కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చని సవాల్ చేసిన ఆయన చివర్లో పోలీసుల్ని తప్పించుకునేందుకు నానా తంటాలు పడినట్టు తెలుస్తోంది.
ఐదు రాష్ట్రాల హై-డ్రామా...
కేసు నమోదు కాగానే ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి... హైదరాబాద్ టు కర్ణాటక (బెంగళూరు).. అక్కడ నుంచి కేరళ రిసార్టులు.. ఆపై తమిళనాడు (కాంచీపురం) అంటూ ఐదు రాష్ట్రాల మీదుగా సాగిన ఆయన అజ్ఞాత యాత్ర పోలీసుల వ్యూహం ముందు పారిపోలేకపోయింది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినా, కోర్టు విచారణను ఈ నెల 11కు వాయిదా వేయడంతో ఈలోపే స్కెచ్ వేసి పట్టుకున్నారు.
నకిలీ జీవోల వెనుక "బిగ్ బాస్"?
రంగారెడ్డి జిల్లా గండిపేట లాంటి అత్యంత ఖరీదైన ప్రాంతంలో, 104 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేయడానికి ఏకంగా 'నకిలీ జీవోలు' సృష్టించడం అనేది మామూలు విషయం కాదు. ఈ కుట్ర కోసం బొల్లా బ్రహ్మనాయుడు దాదాపు రూ. 12 కోట్లు ఫండింగ్ చేశారనే ప్రాథమిక ఆధారాలు దొరకడం ఈ కేసులో ఆయన పాత్రను తీవ్రతరం చేస్తోంది.
మిస్టరీ మ్యాన్ - "కాముని నాగేశ్వరరావు" ఎవరు?
నకిలీ జీవోల్లో ఎకరంన్నర భూమి ఉన్నట్లు చూపించిన 'కాముని నాగేశ్వరరావు' అనే వ్యక్తి ఎవరనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఆయన గండిపేట వాడు కాదని తేలింది కాబట్టి, బ్రహ్మనాయుడికి అత్యంత నమ్మకస్తుడైన ఏపీ వ్యక్తి అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బ్రహ్మనాయుడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తేనే ఈ 'బినామీ' గుట్టు రట్టవుతుంది.
అసలు గండిపేట ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన ఆ 'మాస్టర్ మైండ్' వెనుక ఉన్న శక్తులెవరు? నకిలీ జీవోల సృష్టి వెనుక ఉన్న ఆ 'మిస్టరీ నాగేశ్వరరావు' ఎవరు? చట్టానికి చిక్కిన వినుకొండ మాజీ ఎమ్మెల్యే చుట్టూ ఇప్పుడు ఎలాంటి ఉచ్చు బిగుస్తోంది? అనేది ఏపీ అండ్ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ఈరోజు హాట్ టాపిక్.
Next Story

