
’మీ బతుకంతా నాటకాలు, మోసాలే‘: లక్ష్మీపార్వతి
చంద్రబాబు, లోకేష్‌లపై లక్ష్మీపార్వతి నిప్పులు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ పాత సెగలు పుడుతున్నాయి. కూటమి ప్రభుత్వం, నారా కుటుంబంపై వైఎస్సార్‌సీపీ నాయకురాలు, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేష్‌ల రాజకీయ ప్రస్థానం అంతా అబద్ధాలు, మోసాలతోనే సాగిందని ఆమె విమర్శించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె, నారా లోకేష్ తన కుటుంబ చరిత్రను తెలుసుకోవాలని, అడ్డదారుల్లో అమృతం తాగే అలవాటును మానుకోవాలని హితవు పలికారు.
కుటుంబ అనుబంధాలపై సూటి ప్రశ్నలు
లోకేష్‌ను ఉద్దేశించి లక్ష్మీపార్వతి పలు వ్యక్తిగత, రాజకీయ ప్రశ్నలను సంధించారు. లోకేష్.. ఏనాడైనా అమ్మమ్మ అంటూ నా దగ్గరికి వచ్చావా? అసలు నా పుట్టినరోజు నీకు తెలుసా? అని ప్రశ్నిస్తూనే, సొంత కుటుంబ సభ్యుల పట్లే నారా కుటుంబానికి ప్రేమాభిమానాలు లేవని ఆరోపించారు. కన్న తండ్రి ఎన్టీఆర్‌పై వెన్నుపోటు పొడిచి, చెప్పులేసి అవమానిస్తుంటే.. మీ అమ్మ భువనేశ్వరి ఏనాడైనా నోరు మెదిపిందా? అని నిలదీశారు. మీ మేనత్తలే మీ ఇంటికి రారని, ఇలా కుటుంబాలను చీల్చి రాజకీయంగా ఏమీ సాధించలేరని ఆమె హెచ్చరించారు.
మావిగన్ విమర్శలపై ఆగ్రహం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ (MAVIGAN) కాన్సెప్ట్‌పై కూటమి నేతలు చేస్తున్న విమర్శలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. మావిగన్ రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరమని, దానిపై కనీస అవగాహన లేకుండా లోకేష్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ముందు నీ స్థాయి ఎంత లోకేష్? నువ్వు ఈవీఎంల మేనేజ్‌మెంట్ ద్వారా గెలిచావని ప్రజలకు తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలలోనూ చంద్రబాబు మనుషులే ఉన్నారని, ఇది ఆయన రాజకీయ నైజమని ఎద్దేవా చేశారు.
జగన్ పాలనే మహిళలకు రక్షణ
వైఎస్సార్‌సీపీ హయాంలో మహిళల సంక్షేమం కోసం జగన్ చేసిన కృషిని లక్ష్మీపార్వతి కొనియాడారు. మహిళా సాధికారత కోసం జగన్ ఏకంగా 35 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చారని గుర్తుచేశారు. మంచి నాయకుడంటే జగన్‌లా ఉండాలని, ప్రజల కోసం పనిచేయాలని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం చంద్రబాబు, లోకేష్ చేస్తున్న నాటక రాజకీయాలను చూసి ప్రజలే అసహ్యించుకుంటున్నారని, రాబోయే రోజుల్లో వారికి తగిన శాస్తి జరుగుతుందని విమర్శించారు.
Next Story

