ముద్రగడ తరహాలో యానాం మల్లాడి ఎందుకు భీష్మ ప్రతిజ్ఞ చేశారు?
x
యానాంలో పోటీ పడుతున్న మల్లాడి, గొల్లపల్లి

ముద్రగడ తరహాలో యానాం మల్లాడి ఎందుకు భీష్మ ప్రతిజ్ఞ చేశారు?

గురుశిష్యుల మధ్య హోరాహోరీ పోరు, 9న ఎన్నికలు


ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని గోదావరి తీరప్రాంతం యానాంలో ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత పరిధిలోకి వచ్చే ఈ నియోజకవర్గంలో వచ్చే నెల 9న (ఏప్రిల్ 9, 2026) పోలింగ్ జరగనుంది. మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ మాత్రం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు (NDA కూటమి), ప్రస్తుత ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ (కాంగ్రెస్) మధ్యే నెలకొంది.

సవాళ్లు - శపథాల మధ్య ఎన్నికల కురుక్షేత్రం

గత 2021 ఎన్నికల్లో మల్లాడి కృష్ణారావు తాను స్వయంగా రాజకీయాల నుంచి తప్పుకుని, అప్పటి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామిని యానాం నుంచి పోటీకి నిలబెట్టారు. "ఒకవేళ రంగస్వామి ఇక్కడ ఓడిపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను" అని ఆనాడు మల్లాడి చేసిన సవాల్ ఆయనకే ఎదురుదెబ్బ తగిలింది. యువ నాయకుడు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థి రంగస్వామిపై 655 ఓట్ల తేడాతో సంచలన విజయం సాధించారు.

ఈసారి పరిస్థితులు మారాయి. గతంలో స్వతంత్రుడిగా గెలిచిన అశోక్ ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగగా, రాజకీయ సన్యాసం చేస్తానన్న మల్లాడి కృష్ణారావు మళ్ళీ నేరుగా రంగంలోకి దిగి ఎన్డీయే (NDA) అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తన పట్టును నిరూపించుకోవాలని మల్లాడి, తన విజయం గాలివాటం కాదని నిరూపించాలని అశోక్ కంకణం కట్టుకున్నారు. అయితే యానాం లో పోటీ చేస్తున్న మల్లాడి కృష్ణారావు ఇప్పుడు మరో భీష్మ ప్రతిజ్ఞ చేశారు. 2026 ఏప్రిల్ 9న జరిగే ఎన్నికల్లో ఓడితే గుండు కొట్టించుకుని పేరు మార్చుకుంటానంటూ ప్రతిజ్ఞ చేశారు.

ఈ ప్రతిజ్ఞ విన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం గుర్తుకు రాకమానరు. అందుకే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ప్రముఖ నేత- మల్లాడి బ్యాలెన్స్ తప్పి మాట్లాడారాని వ్యాఖ్యానించారు. సీనియర్ జర్నలిస్టు రామకృష్ణం రాజు మల్లాడి వ్యాఖ్యాలను ఆక్షేపించారు. ఎన్నికల్లో గెలుపోటములు క్రీడా స్ఫూర్తితో తీసుకోవడానికి బదలు ఇలాంటి భీష్మ ప్రతిజ్ఞలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ముద్రగడ పద్మనాభం కూడా గతంలో పవన్ కల్యాణ్ ను ఓడించకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభమే కాదని, పేరు మార్చుకుంటానని చెప్పి ఆ పని చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలు వీళ్లను అడిగారా అని ఆయన నిలదీశారు.
యానాం ఎన్నికల చరిత్ర - ఆసక్తికర అంశాలు
పుదుచ్చేరి అసెంబ్లీలో యానాం ఒక చిన్న నియోజకవర్గమే అయినప్పటికీ (సుమారు 37,747 ఓటర్లు), దీని ప్రభావం మాత్రం చాలా ఎక్కువ. 1964 నుంచి 1990 వరకు కామిశెట్టి శ్రీపరశురామ వరప్రసాదరావు నాయుడు ఇక్కడ తిరుగులేని నేతగా వెలుగొందారు.
1996లో స్వతంత్రుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన మల్లాడి కృష్ణారావు, ఆ తర్వాత వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. 2021లో తాను పోటీ నుంచి తప్పుకుని ఆనాటి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామిని బరిలోకి దింపారు. అయితే ఆయన ఓడిపోయారు. ఇప్పుడు తిరిగి మల్లాడి పోటీ చేస్తున్నారు.
ఇండిపెండెంట్ల అడ్డా
యానాం ఓటర్లు పార్టీల కంటే వ్యక్తులకే ప్రాధాన్యం ఇస్తారు. గత 50 ఏళ్లలో ఇక్కడ 5 సార్లు స్వతంత్ర అభ్యర్థులే విజయం సాధించడం దీనికి నిదర్శనం.

ప్రధాన సమస్యలు - ప్రచార అస్త్రాలు

గొల్లపల్లి అశోక్ విమర్శలు: "యానాంలో అభివృద్ధి కుంటుపడింది. పరిశ్రమలు మూతపడ్డాయి, యువతకు ఉపాధి లేదు. చిన్న వైద్యం కావాలన్నా కాకినాడ వెళ్లాల్సి వస్తోంది. ఏకవ్యక్తి పాలనకు ముగింపు పలకడమే నా లక్ష్యం."
మల్లాడి వర్గం ధీమా:
"యానాంకు గుర్తింపు తెచ్చింది మల్లాడి కృష్ణారావే. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే అనుభవజ్ఞుడైన నేత అవసరం. ఈసారి విజయం మాదే."
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతోనూ, ముఖ్యంగా వైఎస్సార్ కుటుంబంతోనూ సన్నిహిత సంబంధాలు కలిగిన మల్లాడి కృష్ణారావుకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. మరోవైపు, యువ రక్తం అశోక్ తన స్థానాన్ని కాపాడుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అభ్యర్థుల శపథాలు, సవాళ్ల మధ్య యానాం ఓటర్లు ఎవరికి "గుండు" కొట్టిస్తారో, ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే మే 4న వెలువడే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే!
ముఖ్య తేదీలు:
పోలింగ్ తేదీ: ఏప్రిల్ 9, 2026
ఫలితాలు: మే 4, 2026
Read More
Next Story