మీ వారు చనిపోలేదు కదా? లోకేష్ కామెంట్స్‌పై కార్మికులు ఆగ్రహం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పరామర్శకు ఎందుకు వెళ్లలేదు?
విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో (RINL) తాజాగా జరిగిన ద్రవ ఉక్కు లాడిల్ పేలుడు దుర్ఘటనలో తమ్మిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, పలువురు తీవ్రంగా గాయపడటం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. 2024 జనవరి నుండి ఇప్పటివరకు సుమారు 29 మంది కార్మికులు మరణించడం, వందలాది మంది క్షతగాత్రులు కావడం ప్లాంట్‌లో పడిపోయిన భద్రతా ప్రమాణాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి నారా లోకేష్ కార్మిక సంఘాల నేతలతో తీవ్ర వాగ్వాదానికి దిగడం, పరిహారం పెంపుపై డిమాండ్ చేసిన వారిని ఉద్దేశించి మాట్లాడిన తీరు తీవ్ర దుమారానికి కారణమైంది. మీ వారు చనిపోలేదు కదా? అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బాధితుల గాయాలపై కారం చల్లినట్లు ఉన్నాయని, ఒక బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన భాష ఇది కాదంటూ కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇంత పెద్ద పారిశ్రామిక విపత్తు జరిగినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా రాకుండా నిమ్మకుండిపోవడం, గతంలో స్టీల్ ప్లాంట్ భూ కేటాయింపులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లోకేష్‌ను పంపడం వెనుక ప్రభుత్వ ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తోందని కార్మికులు, స్థానికులు విమర్శిస్తున్నారు.

