ఏపీలో మహిళలే రాజకీయ టార్గెట్
x
ఏపీలోని నిడదవోలులో మహిళలతో సీఎం ర్యాలీ

ఏపీలో మహిళలే రాజకీయ టార్గెట్

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏపీలో ‘రెచ్చగొట్టే’ రాజకీయ వ్యూహాలు?


పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు (33 శాతం సీట్లు) డీలిమిటేషన్ బిల్లుతో కలిపి ప్రవేశపెట్టడంతో వీగిపోయింది. ప్రతిపక్షాలు వ్యతిరేక ఓటు వేయడం, ఈ ఘటనను ఏపీలో పాలక కూటమి ‘మహిళలకు అన్యాయం’గా చిత్రీకరించి ర్యాలీలు, మహిళా సమావేశాలు నిర్వహిస్తోంది. నిడదవోలులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన మహిళా ర్యాలీలో బీజేపీ అధ్యక్షుడు మాధవ్, జనసేన మంత్రి కందుల దుర్గేష్ పాల్గొనడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. “పాలకులే మహిళలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా?” అన్న ప్రశ్న ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


డీలిమిటేషన్ ను తిరస్కరిస్తూ ఢిల్లీలో మహిళా నేతల ప్రెస్ మీట్

పార్లమెంట్‌లో ఏమైంది?

ప్రతిపక్షాలు (కాంగ్రెస్, ఇతరులు) స్పష్టంగా ప్రకటించారు. “మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేము వ్యతిరేకం కాదు. కానీ డీలిమిటేషన్‌తో ముడిపెట్టకుండా వేరుగా ప్రవేశపెట్టాలి.” అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం రెండు బిల్లులను కలిపి ఓటింగ్‌కు పెట్టడంతో ప్రతిపక్షాలు వ్యతిరేక ఓటు వేశాయి. ఫలితంగా బిల్లు రెండింట మూడింతల మెజారిటీ కొరవడి ఓడిపోయింది. దీనిని కేంద్రంలోని ప్రతిపక్షాలు ‘మహిళల శత్రువులు’గా, ఏపీ పాలకులు ‘ఏపీ మహిళలకు ఉద్భోదిస్తున్నారు.

ఏపీలో రాజకీయ చిత్రం మరింత క్లిష్టం

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతలు మాత్రమే కాదు, వైఎస్‌ఆర్‌సీపీ కూడా డీలిమిటేషన్ బిల్లును మౌనంగా సమర్థించింది, వ్యతిరేకించలేదు. ఇది దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. “జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణ రాష్ట్రాలు, ముఖ్యంగా ఏపీ, తమ సీట్లు కోల్పోతాయి. ఇది ఫెడరల్ సమస్య” అని సీపీఎం వంటి పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయినప్పటికీ ఏపీ కూటమి నేతలు మహిళా రిజర్వేషన్‌ను ‘మహిళల హక్కు’గా మాత్రమే చూపిస్తూ ప్రతిపక్షాలను టార్గెట్ చేసి ర్యాలీలు నిర్వహిస్తున్నారు.


నిడదవోలులో మహిళలతో నిర్వహించిన ర్యాలీలో సీఎం చంద్రబాబు

నిడదవోలు ర్యాలీ ఎందుకు?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలతో కలిసి ర్యాలీ నిర్వహించి “ప్రతిపక్షాలు మహిళలకు అన్యాయం చేశాయి” అని ప్రకటించడం రాజకీయ వ్యూహకరమైన కదలికగా కనిపిస్తోంది. బీజేపీ, జనసేన నేతలు పాల్గొనడం దీనిని మరింత బలపరిచింది.

పాలకుల వాదన: మహిళలకు 33 శాతం రిజర్వేషన్ వెంటనే అమలు కావాలి. ప్రతిపక్షాలు దానిని అడ్డుకున్నాయి. ఇది మహిళా సాధికారతకు గొడ్డలి వంటిది.

విమర్శకుల వాదన: ఇది మహిళల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓటు బ్యాంక్‌ను లక్ష్యంగా చేసుకున్న ‘ఎమోషనల్ పాలిటిక్స్’. డీలిమిటేషన్ వల్ల దక్షిణ రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని కప్పిపుచ్చడానికి మహిళా రిజర్వేషన్‌ను ఉపయోగిస్తున్నారు. వేరుగా బిల్లు ప్రవేశపెట్టాలని కోరే ధైర్యం లేకపోవడం రెండు పార్టీల (టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ) తలవంచుడు తనానికి నిదర్శనమనే విమర్శలు వెల్లువెత్తాయి.

వాస్తవం ఏమిటి?

మహిళా రిజర్వేషన్ ఒక ముఖ్యమైన సామాజిక సమస్య. కానీ దానిని డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం ఫెడరల్ సమస్యగా మారింది. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ చేసినందుకు శిక్ష పడకూడదన్న వాదన సరైనదే. అదే సమయంలో మహిళల సాధికారతను ఆలస్యం చేయడం కూడా సమస్య. ఏపీలో పాలకులు మహిళలను ర్యాలీల్లోకి తీసుకురావడం రాజకీయంగా చతురతగా కనిపించినా, ఇది మహిళలను ‘భావోద్వేగాల బలి’గా చేస్తున్నట్లు విమర్శకులు చెబుతున్నారు.

నిజమైన మహిళా సాధికారత ఎక్కడ?

ఈ రాజకీయ దుమారం మధ్య మహిళల నిజమైన సాధికారత ఎక్కడ ఉంది? రిజర్వేషన్ బిల్లు వేరుగా రావాలా లేదా డీలిమిటేషన్‌తో కలిపి రావాలా అన్న చర్చ సామాజిక న్యాయం కోసం కాకుండా ఓటు రాజకీయాలకు మారిపోతున్నదా? ఏపీ పాలకుల వ్యూహం మహిళలకు లాభం చేస్తుందా లేదా వారిని రెచ్చగొట్టి రాజకీయ లాభం పొందడమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే ఎన్నికల్లోనే తేలవచ్చు.

Read More
Next Story