పొలిటికల్ అనలిస్టు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లపై చేసిన రాజకీయ వ్యాఖ్యల దుమారం చల్లారక ముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సహా పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతాయని వెల్లడించడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో అలజడి రేపుతోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ కొద్దిరోజుల క్రితం ఒక ఛానల్ డిబేట్‌లో జగన్‌ను అరెస్టు చేయాలని తమ వాళ్ల నుంచి ఒత్తిడి వస్తోందని పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు చెప్పారని, అందుకు ఆయన ససేమిరా అన్నారని చెప్పడం కూటమిలో మంటలు రేపాయి. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం మాధవ్ విశాఖలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జగన్ అరెస్టు గురించి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే?
కూటమి ఐక్యత కొల్లగొట్టేలా కుట్రలు..
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంలో ఉన్న ఐక్యతను కొల్లగొట్టేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. పొలిటికల్ అనలిసు్ట ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. `రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన సజావుగా సాగుతున్న వేళ అలా జరగకూడదని కొందరు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు. లేని కన్ఫ్యూజన్‌ను క్రియేట్ చేస్తున్నారు. అనలిస్టుల రూపంలో మైండ్ గేమ్ జరుగుతోంది. కూటమి ఐక్యతకు భంగం కలిగించేలా కుట్రలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ పొలిటికల్ అనలిస్టు (ప్రొఫెసర్ నాగేశ్వర్ పేరును ప్రస్తావించకుండా) లేని గాలిని సృష్టించి మంటలు రేపుతున్నారు. ఈనెల 19న ఆ అనలిస్టు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దానిపై మా పార్టీ నాయకుడు సోము వీర్రాజు, అధికార ప్రతినిధులు భానుప్రకాష్‌రెడ్డి, సామినేని యామినిలు వెంటనే స్పందించి ఆ అనలిస్టు వ్యాఖ్యలను ఖండించారు. ఆయన వ్యాఖ్యలు దుమారం రేపడంతో రెండ్రోజుల్లోనే వెనక్కి తీసుకున్నారు. జనసేన వాళ్లు కూడా దానిపై ఇక ముందుకు వెళ్లవద్దని వాళ్ల పార్టీ వారిని కోరారు. అనలిస్టులు ఏ పక్షం కాని వారై ఉండాలి. ఒకపక్షం, ఒక భావజాలం ఉన్నవారు దానికనుగుణంగానే మాట్లాడతారు. న్యూట్రల్‌గా మాట్లాడరు. టీవీ చర్చలకు న్యూట్రల్ అనలిస్టులనే పిలవాలి` అని మాధవ్ సూచించారు.
వైఎస్ జగన్ అరెస్టవుతారు..
`తప్పనిసరిగా వైఎస్ జగన్ సహా ఎవరు చేసిన పాపాలకు వారు పరిహారం చెల్లించుకునేలా పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతాయి. దానిపై మరో ఆలోచన లేనేలేదు` అని స్పష్టం చేశారు మాధవ్.
ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమన్నారు?
`వైఎస్ జగన్‌ను అరెస్టు చేయాలని తమ వాళ్ల నుంచి ఒత్తిడి వస్తోందని పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ అమిత్‌షాతో చెప్పారు. దీనికి అమిత్‌షా బదులిస్తూ రాజకీయాల్లో ఇన్‌స్టెంట్ ఫ్రెండ్ ఉంటాడు.. లాంగ్ టర్మ్ ఫ్రెండూ ఉంటాడు. చంద్రబరాబు ఇన్‌స్టెంట్ ఫ్రెండ్. జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబునాయుడికి ఆయన (జగన్) పట్ల శతృత్వం ఉండొచ్చు. కానీ మనకెందుకుండాలి? మీకు కూడా మంచి చెబుతున్నాను. మీకు ఆ అవసరం ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ మనకు ఉపయోగపడతాడు. మనకు 25 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా? మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారు` అని ఆ ఛానల్‌లో ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడారు. ఆ వ్యాఖ్యలే కూటమిలో కుతకుతలకు, ఆపై నాగేశ్వర్‌పై కేసుల నమోదుకు దారితీశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్.. జగన్ అరెస్టవుతారని, దానిపై మరో ఆలోచనే లేదని తాజాగా విశాఖపట్నంలో చేసిన వ్యాఖ్యలు అన్ని వర్గాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరతీశాయి.