తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో ఎన్డీఏ కూటమి ఒక సాహసోపేతమైన ప్రయోగానికి తెరలేపింది. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల ఆధిపత్యంలో గడ్డకట్టిన తమిళ రాజకీయాలను ఈసారి ఎలాగైనా బద్దలు కొట్టాలని ప్రధాని మోదీ పక్కా వ్యూహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని స్టార్ క్యాంపెయినర్ గా తమిళ గడ్డపై బరిలోకి దింపడం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. హోసూరు, ఆవడి, కోయంబత్తూరు వంటి ప్రాంతాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న లక్షలాది మంది తెలుగు ఓటర్లు తమ ఆరాధ్య నేత చంద్రబాబు మాట వింటారా? ద్రవిడ రాజకీయాల సెంటిమెంట్ మధ్య ఈ తెలుగు చాణక్యుడి మంత్రం పనిచేస్తుందా? అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మోదీ నమ్మకాన్ని చంద్రబాబు నిలబెట్టి, తమిళనాట ఎన్డీఏ జెండా ఎగురవేస్తారా అన్నది వేచి చూడాలి. మోదీ నమ్మకాన్ని చంద్రబాబు నిలబెడతారా? అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
వ్యూహాత్మక ప్రచార పర్వం
తమిళనాడులో ఎన్డీఏ కూటమిని అధికార పీఠంపై కూర్చోబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేశారు. హోసూరు, ఆవడి, కోయంబత్తూరు వంటి ప్రాంతాల్లో తెలుగు జనాభా ప్రభావం అత్యధికం. అక్కడ చంద్రబాబుకు ఉన్న అపారమైన చరిష్మాను వాడుకుని, ఆ ఓట్లను కూటమి వైపు మళ్లించాలని ఎన్డీఏ భావిస్తోంది. మోదీ సర్కార్ అందిస్తున్న అభివృద్ధి పథకాలు, చంద్రబాబు దశాబ్దాల రాజకీయ అనుభవం తోడైతే ద్రవిడ గడ్డపై పాగా వేయడం సాధ్యమని బీజేపీ అధిష్టానం బలంగా నమ్ముతోంది. అందుకే తన బిజీ షెడ్యూల్‌లోనూ చంద్రబాబు ఈ కీలక బాధ్యతను భుజాన వేసుకున్నారు.
తొలిరోజు సుడిగాలి పర్యటన
చంద్రబాబు తన పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకమైన కోయంబత్తూరు నుంచి ప్రారంభించనున్నారు. సోమవారం ఉదయం అమరావతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:00 గంటకు కోయంబత్తూరులో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 4:45 గంటలకు హోసూరు, తళ్లి ప్రాంతాల్లో నిర్వహించే ప్రచార ర్యాలీల్లో పాల్గొని శ్రేణుల్లో ఉత్సాహం నింపుతారు. రాత్రికి రాజధాని చెన్నై చేరుకుని, ఆవడిలో నిర్వహించే భారీ రోడ్ షోలో ప్రజలతో నేరుగా ముచ్చటిస్తారు. ఆ రాత్రికి అక్కడే బస చేసి, స్థానిక నేతలతో మంతనాలు జరుపుతారు.
రెండో రోజు సాత్తూర్..మధురైలపై గురి
రెండో రోజైన మంగళవారం చంద్రబాబు ఫోకస్ దక్షిణ తమిళనాడుపై పడనుంది. ఉదయం చెన్నై నుంచి మధురై చేరుకుని, మధ్యాహ్నం 1:00 గంటకు సాత్తూర్ లో వివిధ సామాజిక వర్గాల నేతలు, ప్రముఖులతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు. కుల, మత సమీకరణాలను విశ్లేషిస్తూ కూటమి విజయానికి బాటలు వేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3:00 గంటలకు సాత్తూర్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. పర్యటన ముగిశాక సాయంత్రం 5:15 గంటలకు మధురై నుంచి నేరుగా హైదరాబాద్‌కు బయలుదేరుతారు. ఈ రెండు రోజుల పర్యటన తమిళ ఎన్నికల ముఖచిత్రాన్ని ఏ మేరకు మారుస్తుందోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.