ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కమ్మ, రెడ్డి, బీసీ, దళిత, మైనారిటీ వంటి సామాజికవర్గాలు ఉన్నప్పటికీ, అధికారం ఎవరికి దక్కాలనే సమీకరణం ఎప్పుడూ కాపు సామాజికవర్గం చుట్టూనే తిరగడం వెనుక ఒక తిరుగులేని ఓట్ బ్యాంక్ సైకాలజీ దాగి ఉంది. కమ్మ, రెడ్డి పాలక వర్గాలుగా ఉన్నప్పటికీ వాటి చుట్టు కాకుండా, బీసీలు, దళిత, గిరిజనులతో పాటుగా మైనారిటీలు ఉన్నప్పటికీ వాటి చుట్టూ కాకుండా కేవలం కాపుల చుట్టూ రాజకీయ చర్చలు జరుగుతుండటం గమనార్హం. రాష్ట్రంలో ఇతర ప్రధాన వర్గాల ఓట్లు చాలా వరకు నిర్దిష్ట పార్టీల వైపు ఫిక్స్ అయి ఉండగా, రాష్ట్ర జనాభాలో సుమారు 19 శాతం పైగా ఉన్న కాపులది మాత్రం అటూ ఇటూ మారే స్వింగ్ ఓట్ బ్యాంక్, అదే ఎన్నికల ఫలితాలను శాసించే శక్తి కలిగి ఉండటం ఇందుకు ప్రధాన కారణం. ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని దాదాపు 60 నుండి 70 అసెంబ్లీ స్థానాల గెలుపోటములను శాసించే శక్తి వీరికి ఉండటంతో, ఏపీ రాజకీయంలో కాపు సామాజికవర్గం ఒక తిరుగులేని కింగ్ మేకర్ శక్తిగా అవతరించింది.
గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఈ కింగ్ మేకర్ పవర్ ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. 2019 ఎన్నికల్లో కాపు సామాజికవర్గ ఓట్లు చీలిపోవడం, మెజారిటీ వర్గం వైఎస్సార్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో వైఎస్ జగన్ 151 సీట్లతో బంపర్ మెజారిటీ సాధించారు. అదే సమీకరణం 2024 ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా రివర్స్ అయింది. పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీ ద్వారా ఈ కాపు ఓట్లను వంద శాతం ఏకీకృతం చేసి, టీడీపీ-బీజేపీ కూటమి వైపు విజయవంతంగా తిప్పడం వల్లే కూటమి చారిత్రాత్మక విజయం సాధించి అధికార పీఠాన్ని దక్కించుకోగలిగింది. అంటే ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా, ఎవరు ప్రతిపక్షంలో కూర్చోవాలన్నా కాపుల స్వింగ్ ఓటే అత్యంత కీలకమైన మైలురాయిగా మారుతోంది.
ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ఈ కింగ్ మేకర్ ఓట్ బ్యాంక్‌ను కాపాడుకోవడానికి, ఆకర్షించడానికి ముగ్గురు అగ్రనేతలు సరికొత్త మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ ఈ బలమైన అండతో పాటు సనాతన ధర్మ రక్షణ అస్త్రాన్ని వాడుకుంటూ కులం పరిధులను దాటి జాతీయ స్థాయి ఇమేజ్ కోసం వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో పాటుగా ఎన్నికలకు ముందు కుల స్వభాన్ని కలిగి ఉండాలని, కాపులంతా ఓట్లేస్తే కాపు అయిన తాను సీఎం అవతానని చెప్పడం, ఎన్నికల్లో పెద్దన్న పాత్ర పోషించాలని కాపులను కోరడం, గెలిచిన తర్వాత తాను ఓ కులం కోసం రాలేదని, తనను కాపు కులానికి పరిమితం చేయొద్దని చెప్పడం, మరో పదిహేనేళ్ల పాటు సీఎంగా చంద్రబాబే ఉండాలని చెప్పడం కాపులు, వారి నేతల్లో తీవ్ర అసహనం వ్యక్తమైంది. అటు చంద్రబాబు నాయుడు కాపులకు ప్రాధాన్యత ఇస్తూనే, టీడీపీకి వెన్నెముక లాంటి బీసీ (BC) ఓట్ బ్యాంక్ దెబ్బతినకుండా బ్యాలెన్సింగ్ రాజకీయం నడుపుతున్నారు. మరోవైపు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వ లోపాలను, సూపర్ సిక్స్ పథకాల వైఫల్యాలను ఎండగడుతూ కాపు సామాజికవర్గంలో కనిపిస్తున్న చిన్నపాటి అసంతృప్తిని కూడా క్యాష్ చేసుకునేందుకు క్షేత్రస్థాయిలో ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.