x

INDIA కూటమితో జగన్ జత కడతారా? సీపీఐ నేతలు చొరవ తీసుకున్నారా?

రాజకీయ ఊహాగానాలకు తెరలేపిన తాడేపల్లి భేటీ


ఏపీలో రాజకీయ సమీకరణలు మారడానికి తెర లేచిందా? జగన్ తో సీపీఐ నేతల భేటీ వెనుక భవిష్యత్తు వ్యూహంపై రాజకీయంగా ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. నిన్నటి వరకు తీవ్రంగా వ్యతిరేకించిన నాయకులే.. ఇప్పుడు తాడేపల్లి నివాసంలో ప్రత్యక్ష్యం అయ్యారు. ఇది దేనికి సంకేతం?

రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై రౌండ్ టేబుల్ సమావేశానికి రావాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను సీపీఐ అగ్రనేతలు ఆహ్వానించడం వెనుక కేవలం ప్రజా సమస్యలే ఉన్నాయా? లేక 2029 రాజకీయ సమీకరణాలకు ఇది తొలి అడుగా? అసలు సీపీఐ వ్యూహం ఏంటి? జగన్ క్యాలిక్యులేషన్స్ ఏంటి?

తాడేపల్లి భేటీ - అకస్మాత్తుగా మారిన సమీకరణాలు

విజయవాడ తాడేపల్లి నివాసంలో వైఎస్ జగన్‌తో సీపీఐ నేతల బృందం భేటీ కావడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య నాయకత్వంలో జరిగిన ఈ భేటీలో జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, హరినాథరెడ్డి, అక్కినేని వనజ పాల్గొన్నారు. ఈ నెల 26న కరువు పరిస్థితులపై నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి రావాలని జగన్‌ను కోరారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే వామపక్షాలు, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తమ శైలిలోనే స్పందిస్తాయి. అయితే, ఈ భేటీ వెనుక ఉన్న రాజకీయ ప్రాధాన్యతే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సీపీఐ గత ఎన్నికల చరిత్ర పరిశీలిద్దాం..

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో వామపక్షాల ప్రాధాన్యత గణనీయంగా తగ్గింది. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ లేదా టీడీపీతో పొత్తులతో అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించిన సీపీఐకి, 2014 నుంచి ఆ పరిస్థితి లేదు.
2014 ఎన్నికల్లో: సీపీఐ, సీపీఎంతో కలిసి ఎన్నికల బరిలోకి దిగింది. సీపీఐ దాదాపు 14 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినప్పటికీ, కేవలం 0.5% కంటే తక్కువ ఓట్ల శాతానికే పరిమితమై ఒక్క సీటూ గెలవలేకపోయింది.
2019 ఎన్నికల్లో: జనసేన, సీపీఎంతో కలిసి బీఎస్పీ కూటమిగా పోటీ చేసినా, సీపీఐ ఓట్ల శాతం మరింత క్షీణించి (సుమారు 0.11%) అసెంబ్లీలో బోణీ కొట్టలేకపోయింది.
2024 ఎన్నికల్లో: కాంగ్రెస్ నాయత్వంలోని 'ఇండియా' కూటమిలో భాగస్వామిగా వెళ్లి పోటీ చేసినా, ఫలితాల్లో ఎలాంటి మార్పూ రాలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయారు.
సీఎం చంద్రబాబు వైఖరి మార్చుకోవాలని సీపీఐ విజ్ఞప్తులు ఎలా ఉన్నాయంటే..
2014 నుంచి చంద్రబాబు నాయుడు బీజేపీతో జతకట్టిన ప్రతిసారీ సీపీఐ నేతలు తీవ్రంగా నిరసించారు. కే.రామకృష్ణ, నారాయణ వంటి సీనియర్ నేతలు "టీడీపీ సెక్యులర్ పార్టీగా పుట్టింది, మతోన్మాద సిద్ధాంతాలున్న బీజేపీ వైపు వెళ్లొద్దు" అని పదే పదే హెచ్చరించారు. కానీ చంద్రబాబు 2024లోనూ కూటమి కట్టి అధికారంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలంటే, ప్రత్యామ్నాయ శక్తి అవసరమని సీపీఐ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో బీజేపీతో ఉంది. జనసేన బాట అదే మార్గంలో బలంగా సాగుతోంది. ఇక వామపక్షాలకు ప్రధాన పార్టీ వెంట వెళ్లే ఛాన్స్ లేదు. అయిన ఓ ట్రయల్ వేద్దామని అనుకుంటున్నారా? అనే ఊహాగానాలకు తెరతీసినట్టు కనిపిస్తోంది.

జగన్ లెక్కలు వేరు కదా..?

మరోవైపు వైఎస్ జగన్ వైసీపీ స్థాపించినప్పటి నుంచి ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తూ వచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు అఖిలపక్ష సమావేశాలను గానీ, ప్రతిపక్షాల అభిప్రాయాలను గానీ పెద్దగా పట్టించుకోలేదనే విమర్శ ఉంది. మరి అలాంటి జగన్ వద్దకు వెళ్లి, కరువుపై రౌండ్ టేబుల్ మీట్‌కు రమ్మని సీపీఐ కోరడం వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏమిటి?

భవిష్యత్ వ్యూహం - ఇది పొత్తులకేనా?

కరువుపై చర్చ పేరిట జగన్‌ను కలవడం వెనుక రెండు ప్రధానమైన అంశాలు ప్రచారంలో ఉన్నాయి. జగన్ మాస్ చరిష్మాను వాడుకోవడం: జగన్కున్న ప్రజాకర్షణ, మాస్ బేస్‌ను ఉపయోగించి కరువు సమస్యపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం.
2029 ఎన్నికల పునాది: కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్ష వేదికను సిద్ధం చేయడం. 'ఇండియా' కూటమి ద్వారా ఏమీ సాధించలేకపోవడంతో, వైఎస్సార్సీపీకి చేరువకావడం ద్వారా భవిష్యత్తులో నూతన పొత్తులకు బాటలు వేసుకోవాలనేది సీపీఐ ఆలోచన కావచ్చు.
ఏది ఏమైనా, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి ఈ తాడేపల్లి భేటీ మరో ఉదాహరణ. కరువుపై నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి జగన్ హాజరవుతారా? ఈ భేటీ భవిష్యత్తులో కొత్త రాజకీయ కూటమికి దారితీస్తుందా? అనేది వేచి చూడాల్సిందే!
Read More
Next Story