
విజయ్ గెలుపు ద్రావిడ రాజకీయాలకు ముగింపా?
టీవీకే పార్టీ పేరులో “ద్రావిడ” అనే పదం లేకపోయినా, విజయ్ అమలు చేస్తున్న పథకాలు ద్రావిడ పార్టీలకు దగ్గరగా ఉన్నాయంటున్న రాజకీయ విశ్లేషకులు..
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సంచలన విజయం సాధించింది. తొలి ఎన్నికల పోరులోనే 108 స్థానాలు గెలుచుకుని రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పుకు కారణమైంది. ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే–ఏఐఏడీఎంకే ఆధిపత్యానికి ఇది పెద్ద షాక్.
దీంతో కొందరు మితవాద వర్గాలు “ద్రావిడ రాజకీయాలకు ముగింపు మొదలైంది” అంటూ వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యంగా టీవీకే పేరులో “ద్రావిడ” అనే పదం లేకపోవడం, విజయ్ డీఎంకేను తీవ్రంగా విమర్శించడం వంటి అంశాలను ఆధారంగా తీసుకుని ఈ వాదనలు వినిపిస్తున్నాయి. కానీ విజయ్ రాజకీయ శైలి, ఎన్నికల హామీలు, ఆయన ఏర్పరచుకున్న పొత్తులు మాత్రం పూర్తిగా వేరే కథ చెబుతున్నాయి.
గతంలో ఉన్న పథకాలకు కొనసాగింపు..
విజయ్ ప్రచారం చేసిన సంక్షేమ హామీలను పరిశీలిస్తే, అవి ద్రావిడ రాజకీయాలకే కొనసాగింపుగా కనిపిస్తున్నాయి. మహిళా కుటుంబ యజమానులకు నెలకు రూ.2500, ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, ఉచిత విద్యుత్, పేద కుటుంబాల అమ్మాయిల పెళ్లికి బంగారం, పట్టు చీర, పుట్టిన పిల్లలకు బంగారు ఉంగరం వంటి హామీలు ఇచ్చారు. ఇవన్నీ గతంలో ఎంజీఆర్, జయలలిత అమలు చేసిన సంక్షేమ రాజకీయాలనే గుర్తు చేస్తున్నాయి.
ఎంజీఆర్ కాలంలో పేదలకు ప్రభుత్వం అండగా ఉండాలనే భావన బలపడింది. తర్వాత జయలలిత ఉచిత పథకాల రాజకీయాలను మరింత విస్తరించారు. ఇప్పుడు విజయ్ కూడా అదే మోడల్‌ను కొత్త భాషలో, కొత్త తరానికి అనుగుణంగా కొనసాగిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సామాజిక న్యాయానికి కట్టుబడే పార్టీలతో పొత్తు..
విజయ్ ఏర్పరచుకున్న రాజకీయ కూటమి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. టీవీకేకు కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్ వంటి పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. ఇవన్నీ సామాజిక న్యాయం, లౌకికవాదం, సంక్షేమ రాజకీయాలను ప్రాధాన్యం ఇచ్చే పార్టీలు. ప్రమాణ స్వీకారం సమయంలో విజయ్ కూడా “లౌకిక, సామ్యవాద ప్రభుత్వం” అందిస్తానని ప్రకటించారు.
ద్రావిడ రాజకీయాల మూల సూత్రాలైన సామాజిక న్యాయం, మహిళా సాధికారత, లౌకికవాదం — ఇవన్నీ టీవీకే విధానాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
విజయ్ బీజేపీని కేవలం ప్రత్యర్థిగా కాకుండా “సిద్ధాంతపరమైన శత్రువు”గా అభివర్ణించడం కూడా పెద్ద చర్చకు దారి తీసింది. దీంతో ఆయన రాజకీయ దిశ ద్రావిడ భావజాలానికి పూర్తిగా దూరం కాలేదనే అభిప్రాయం బలపడుతోంది.
విజయ్ వ్యక్తిగతంగా దేవాలయాలు, చర్చిలను సందర్శిస్తుండటం కొందరికి విరుద్ధంగా కనిపించినా, తమిళనాడు రాజకీయ సంస్కృతిలో ఇది కొత్త విషయం కాదు. ద్రావిడ రాజకీయాలు, వ్యక్తిగత భక్తి రెండూ కలిసి సాగడం తమిళ సమాజంలో చాలా కాలంగా కనిపిస్తున్న అంశమే.
దీనికి ఉదాహరణ విజయ్ పెరియార్ తిడల్ సందర్శన. 2024లో పెరియార్ జయంతి సందర్భంగా ఆయన చెప్పులు లేకుండా వెళ్లి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా తిరిగి అక్కడికే వెళ్లడం రాజకీయంగా పెద్ద సందేశంగా మారింది.
పెరియార్ జీవితాంతం హేతువాదం, దేవాలయ వ్యతిరేక భావజాలాన్ని ప్రచారం చేశారు. కానీ తమిళ సమాజంలో ఆయనను కూడా ఒక ప్రతీకగా, గౌరవప్రదమైన చిహ్నంగా చూస్తారు. తమిళ రాజకీయ సంస్కృతిలోని ఇదో ప్రత్యేకతగా చెబుతుంటారు.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ వైరుధ్యాలను కలిపి నడిపించగలిగాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు హేతువాదం, మరోవైపు వ్యక్తిగత భక్తి — ఈ రెండూ అక్కడ సమాంతరంగా కొనసాగుతుంటాయి. విజయ్ కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నారని కొందర భావిస్తున్నారు.
అందుకే టీవీకే విజయం ద్రావిడ రాజకీయాలకు ముగింపు కాదని, అవే రాజకీయాలు కొత్త రూపంలో తిరిగి వచ్చాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

