బెంగాల్‌లో మమత పతనం ఖాయమా?
x

బెంగాల్‌లో మమత పతనం ఖాయమా?

అవినీతి, చొరబాట్లు, ప్రభుత్వ వ్యతిరేకత వల్ల 2026లో తృణమూల్‌కు పరాజయం తప్పదా? మాజీ గవర్నర్ తథాగత రాయ్ చెప్పిన సంగతులేంటి?


Click the Play button to hear this message in audio format

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారనున్నాయని మాజీ గవర్నర్, వెస్ట్ బెంగాళ్ బీజేపీ మాజీ చీఫ్ తథాగత రాయ్ (Tathagata Roy) అన్నారు. బీజేపీ ఈసారి తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 'ది ఫెడరల్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయ్ పలు కీలక విషయాలు వెల్లడించారు.

ప్రశ్న: 2026 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది?

జవాబు: ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాజకీయాలు పూర్తిగా ద్వైపాక్షికంగా మారాయి. అంటే ప్రధానంగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంది. చిన్న పార్టీలకు అవకాశాలు తగ్గిపోయాయి. ఒకప్పుడు ప్రజలు మమతా బెనర్జీపై విశ్వాసం ఉంచినా, ఇప్పుడు ఆ నమ్మకం దెబ్బతిన్నది.

ప్రశ్న: మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఎందుకు పెరిగింది?

జవాబు: మమతా పాలనలో అనేక సమస్యలు బయటపడ్డాయి. ముఖ్యంగా అవినీతి పెరగడం, పాలనా వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడటం, పోలీసులపై ప్రభుత్వ ప్రభావం పెరగడం, ఆర్థిక అభివృద్ధి మందగించడం..ఇవి ప్రజల్లో అసహనాన్ని పెంచాయి. ఒకప్పుడు నిజాయితీ నాయకురాలిగా గుర్తింపు పొందిన మమతా బెనర్జీపై ఇప్పుడు ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రశ్న: 2021 ఎన్నికల్లో బీజేపీ ఎందుకు విఫలమైంది?

జవాబు: 2021 ఎన్నికలు బీజేపీకి పెద్ద అవకాశం అయినప్పటికీ, కొన్ని వ్యూహాత్మక తప్పిదాల వల్ల ఆ అవకాశం కోల్పోయింది. అవి అభ్యర్థుల ఎంపికలో తప్పులు, స్థానిక బెంగాలీ సంస్కృతిని అర్థం చేసుకోలేకపోవడం, హిందీ రాష్ట్రాల మాదిరి ప్రచారం చేయడం నాయకత్వంలో సమన్వయం లేకపోవడం..ఈ కారణాల వల్ల ప్రజల్లో విశ్వసనీయత తగ్గింది.

ప్రశ్న: ఈసారి బీజేపీ వ్యూహంలో ఏమి మారింది?

జవాబు: ఈసారి బీజేపీ చాలా పద్ధతిగా పనిచేస్తోంది. అనుభవజ్ఞుల నాయకత్వం తీసుకొచ్చారు.స్థానిక సంస్కృతికి ప్రాధాన్యం ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో సంస్థాగత బలం పెంచుతున్నారు. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడం తనకు పూర్తిగా సంతృప్తినివ్వలేదు.

ప్రశ్న: ఈ ఎన్నికల్లో ప్రధాన సమస్యలు ఏమిటి?

జవాబు: మూడు ప్రధాన అంశాలు ఎన్నికలను ప్రభావితం చేస్తాయి.. అవినీతి, చొరబాట్లు (ఇన్‌ఫిల్ట్రేషన్), ప్రభుత్వ వ్యతిరేక.. ఇవి ప్రజల ఓటింగ్ నిర్ణయాన్ని ప్రభావితం చేసే కీలక అంశాలు.

ప్రశ్న: చొరబాట్ల అంశంపై మీరేమంటారు?

జవాబు: బంగ్లాదేశ్ నుంచి చట్టవిరుద్ధంగా చొరబాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిరోధించడంలో విఫలమైంది. ముర్షిదాబాద్ వంటి సున్నిత ప్రాంతాల్లో సరిహద్దు భద్రతా చర్యలకు చాలా అడ్డంకులు ఉన్నాయి. ఇది ప్రభుత్వ విధాన వైఫల్యాన్ని సూచిస్తుంది.

ప్రశ్న: అవినీతి ఎంత పెద్ద ఎన్నికల అంశం?

జవాబు: అవినీతి ఈసారి ఎన్నికల్లో అత్యంత కీలక అంశం. పలువురు మంత్రులు జైలుకు వెళ్లడం, భారీగా నగదు స్వాధీనం, ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు.. ఈ ఘటనలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహం కలిగించాయి. కోర్టులు కూడా కొన్ని నియామకాలపై ప్రశ్నలు లేవనెత్తడం పరిస్థితిని మరింత తీవ్రమయ్యేలా చేసింది.

ప్రశ్న: ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రభావం ఏమిటి?

జవాబు: ఓటర్ల జాబితా శుద్ధి చాలా అవసరం. దాదాపు లక్షల సంఖ్యలో నకిలీ, మరణించిన, చట్టవిరుద్ధ ఓటర్లను తొలగించారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని నా విశ్వాసం. నిజమైన ఓటర్లకు నష్టం జరగకూడదు.

ప్రశ్న: బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం ఎంతవరకు ఉంది?

జవాబు: తృణమూల్ కాంగ్రెస్ ప్రభావం కారణంగా కొంత భయానక వాతావరణం ఉంది. బీజేపీ మద్దతుదారులు బయటకు రావడంలో కొంత సంకోచం ఉన్నప్పటికీ, 2021 తర్వాత పార్టీ బలం క్రమంగా పెరిగింది. 2024 నాటికి సంస్థాగత నిర్మాణం బలపడింది.

ప్రశ్న: హిందుత్వ అంశం బెంగాల్‌లో ఎలా పనిచేస్తుంది?

జవాబు: హిందుత్వ, బెంగాల్ సంస్కృతి వేర్వేరు అయినప్పటికీ, కొన్ని చారిత్రక సంబంధాలు ఉన్నాయి. శ్యామా ప్రసాద్ ముఖర్జీ పాత్రను ఇప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. తమ గుర్తింపును కాపాడుకోవాలనే భావన ప్రజల్లో పెరుగుతోంది.

ప్రశ్న: బీజేపీ సీట్ల లక్ష్యం ఏమిటి? అది సాధ్యమా?

జవాబు: అమిత్ షా నిర్దేశించిన 170 సీట్ల లక్ష్యం వాస్తవానికి సాధ్యమే కాకుండా మించవచ్చు కూడా. ఈసారి ఓటర్ల మనోభావాల్లో పెద్ద మార్పు వస్తుందని అనుకుంటున్నా.

ప్రశ్న: ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని చూడాలనుకుంటున్నారు?

జవాబు: సువెందు అధికారీనే. ఎందుకంటే 2021లో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీని ఓడించడం ఆయన నాయకత్వ సామర్థ్యాన్ని చూపుతోంది.

మొత్తంగా అవినీతి ఆరోపణలు, చొరబాట్లపై ఆందోళనలు, ప్రభుత్వంపై పెరుగుతోన్న వ్యతిరేకత.. అన్నీ కలిసి ఈసారి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పెద్ద మార్పుకు దారి తీస్తాయని తథాగత రాయ్ విశ్లేషిస్తున్నారు.


Read More
Next Story