ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గాలి ఎటు వీచినా.. జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్న అచంచలమైన నమ్మకం మాత్రం చెక్కుచెదరలేదని తాజా పరిణామాలు మరోసారి నిరూపించాయి. నియోజకవర్గాల పునర్విభజన వంటి అత్యంత సంక్లిష్టమైన అంశంలో దేశంలోని విపక్షాలన్నీ ఒకతాటిపైకి వచ్చి కేంద్రాన్ని నిలదీస్తుంటే.. ఏపీలో పదకొండు సీట్లతో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా మోదీ ప్రతిపాదించిన ఫార్ములాకే జై కొట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం మద్దతు ఇవ్వడమే కాకుండా, కేంద్రం మేలైన అడుగు వేస్తోందని, దీనిని కావాలసనే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆయన తీవ్రంగా ఎండగట్టారు. దక్షిణాది ప్రయోజనాలను కాపాడుతున్న బీజేపీకి అండగా ఉండాల్సింది పోయి, అడ్డుపడటం ఏంటి? అన్నట్లుగా ఆయన చేసిన విశ్లేషణ.. మోదీ-జగన్‌ల మధ్య ఉన్న ధృడమైన రాజకీయ, విధానపరమైన బంధాన్ని బట్టబయలు చేసింది. బిల్లును అడ్డకోవడంపై ప్రతిపక్షాలను భారీ ఎత్తున్న విమర్శించే పనిని బీజేపీ చేస్తున్నప్పటికీ ఆ పనిని కూడా జగన్ భుజాన వేసుకోవడం వెనుక వీరి బంధం ఏమాత్రం చెక్కు చెదరలేదు అనే విషయం మరో సారి తేట తెల్లమైందనే స్పష్టమైన సంకేతాలను పంపింది.
కేంద్రం ప్రతిపాదనే ఉత్తమం – జగన్ విశ్లేషణ
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచితే, దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని వైఎస్ జగన్ గణాంకాలతో సహా వివరించారు. ఈ విధానం అమలైతే దక్షిణాది రాష్ట్రాల వాటా పార్లమెంట్‌లో తగ్గకపోగా, ప్రస్తుతం ఉన్న ప్రాతినిధ్యం కంటే మరింత మెరుగుపడుతుందని ఆయన గట్టిగా సమర్థించారు. కేంద్రం ఆలోచనలు దక్షిణాది ప్రయోజనాలను కాపాడేలా ఉన్నాయని, దీనిని రాజకీయ కోణంలో చూడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
815 సీట్ల ఫార్ములా .. దక్షిణాది బలం
జగన్ వెల్లడించిన గణాంకాల ప్రకారం, కేంద్రం ప్రతిపాదించిన 815 సీట్ల ఫార్ములా అమలైతే పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల వాటా 23.87 శాతానికి పెరుగుతుంది. అంటే దేశవ్యాప్త నిర్ణయాల్లో దక్షిణాది వాయిస్ మరింత బలంగా వినబడుతుంది. కానీ, దురదృష్టవశాత్తు కొన్ని పార్టీలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ ప్రతిపాదనను అడ్డుకున్నాయని, తద్వారా దక్షిణాదికి దక్కాల్సిన అదనపు బలాన్ని దూరం చేశాయని ఆయన అభిప్రాయపడ్డారు.
జనాభా ప్రాతిపదికన వెళ్తే భారీ నష్టం
ఒకవేళ కేంద్రం చెప్పిన 50 శాతం పెంపుదల విధానాన్ని కాదని, కేవలం జనాభా లెక్కల ఆధారంగా (2011 Census) నియోజకవర్గాల విభజన జరిగితే దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతుందని జగన్ హెచ్చరించారు. అలా జరిగితే మొత్తం 850 సీట్లలో దక్షిణాది వాటా 20.44 శాతానికి పడిపోతుందని, ఫలితంగా దక్షిణాది రాష్ట్రాలు ఏకంగా 21 ఎంపీ సీట్లను నష్టపోవాల్సి వస్తుందని ఆయన గణాంకాలతో సహా నిరూపించారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే కేంద్రం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లును యథాతథంగా ఆమోదించడమే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాలకు లాభం అదే
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పునర్విభజన బిల్లు యథాతథంగా ఆమోదం పొందితే ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్‌లో అసాధారణమైన బలం చేకూరుతుందని జగన్ వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 25 ఎంపీ సీట్లు ఏకంగా 38కి పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ కేంద్రం చెప్పిన 50 శాతం పెంపుదల ఫార్ములాను కాదని, కేవలం జనాభా ప్రాతిపదికన విభజన జరిగితే ఏపీకి 34 సీట్లు మాత్రమే దక్కుతాయని.. అంటే రాష్ట్రం 4 ఎంపీ సీట్లను శాశ్వతంగా నష్టపోతుందని ఆయన గణాంకాలతో సహా హెచ్చరించారు.
తెలంగాణ ప్రాతినిధ్యంపై స్పష్టత
తెలంగాణ విషయంలోనూ కేంద్ర ప్రతిపాదనే అత్యుత్తమమని జగన్ విశ్లేషించారు. 50 శాతం సీట్ల పెంపు విధానం అమలైతే తెలంగాణలోని ఎంపీ సీట్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 17 నుండి 26కి పెరుగుతుందని ఆయన తెలిపారు. అలా కాకుండా 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకుంటే తెలంగాణకు కేవలం 24 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని, తద్వారా రెండు కీలకమైన ఎంపీ స్థానాలను రాష్ట్రం కోల్పోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
రాజకీయ స్వార్థం అంటూ జగన్ చురకలు
ఈ గణాంకాలను బట్టి చూస్తే, కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేసేలా ఒక సమగ్రమైన ప్రణాళికను సిద్ధం చేసిందని జగన్ అభిప్రాయపడ్డారు. ఇంతటి ప్రయోజనకరమైన బిల్లును కొన్ని పార్టీలు తమ రాజకీయ స్వార్థం కోసం లోక్‌సభలో అడ్డుకున్నాయని ఆయన పరోక్షంగా చురకలు అంటించారు. కేంద్రం వేసిన మేలైన అడుగును అడ్డుకోవడం వల్ల తెలుగు రాష్ట్రాల ప్రాతినిధ్యం పెరిగే అవకాశాన్ని ఆ పార్టీలే కాలరాశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దక్షిణాది రాష్ట్రాల నష్టాల అంచనా (జగన్ పోస్ట్ ప్రకారం)
కేంద్రం ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపుదల విధానాన్ని కాదని, కేవలం 2011 జనాభా లెక్కల ప్రకారం ముందుకు వెళ్తే దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తింటాయని జగన్ తన విశ్లేషణలో హెచ్చరించారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం ఏకంగా 9 ఎంపీ సీట్లను, కేరళ 7 సీట్లను నష్టపోవాల్సి వస్తుందని ఆయన గణాంకాలతో సహా వివరించారు. కుటుంబ నియంత్రణను విజయవంతంగా అమలు చేసినందుకు రివార్డు ఇవ్వాల్సింది పోయి, ఇలా ప్రాతినిధ్యం తగ్గించడం ద్వారా శిక్షించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే ఈ అన్యాయాన్ని అడ్డుకోవాలన్నా, పార్లమెంట్‌లో మన వాయిస్ బలంగా ఉండాలన్నా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 50 శాతం పెంపు ఫార్ములా ఒక్కటే ఏకైక మార్గమని జగన్ గట్టిగా వాదించారు.జగన్ చేసిన ఈ సుదీర్ఘ పోస్ట్ ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ దార్శనికతపై ఆయనకున్న అచంచలమైన నమ్మకం మరోసారి బహిర్గతమైంది. దక్షిణాది రాష్ట్రాల గొంతు పార్లమెంట్‌లో నొక్కబడకుండా ఉండాలంటే మోదీ సర్కార్ సూచించిన మార్గమే సరైనదని జగన్ చెప్పడం.. అటు జాతీయ రాజకీయాల్లోనూ, ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.
బలమైన న్యాయవాదిలా
మొత్తానికి, నియోజకవర్గాల పునర్విభజనపై జగన్ మోహన్ రెడ్డి చేసిన ఈ గణాంకాల విశ్లేషణ చూస్తుంటే.. ఆయన బీజేపీ , మేదీ ప్రతిపాదనలకు కేవలం మద్దతుదారుడిగా మాత్రమే కాకుండా, ఆ పార్టీ తరపున ఒక బలమైన న్యాయవాదిలా (Advocate) వ్యవహరించారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ మోదీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న తరుణంలో, జగన్ మాత్రం తన గళాన్ని బీజేపీ వాదనతో కలపడం వెనుక మర్మమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రధాని మోదీ ప్రతిపాదించిన విధానమే దక్షిణాదికి మేలని జగన్ ఇంతలా సమర్థించడం, అటు కేంద్రానికి అండగా నిలవడమే కాకుండా.. బిల్లును వ్యతిరేకించిన ప్రతిపక్షాలను విమర్శించే పని పెట్టుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ పక్షాన నిలబడి విపక్షాలను విమర్శించడం ద్వారా జగన్ నిజంగానే బీజేపీ పనిని భుజాన వేసుకున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. మోదీ, జగన్‌ల మధ్య ఉన్న ఈ దృఢమైన బంధం మాత్రం రాబోయే కాలంలో జాతీయ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు వేదిక కాబోతోందన్నది తిరుగులేని వాస్తవం.