ఉన్నత విద్యా కమిషన్‌ను ఎందుకు రద్దు చేయాలనుకున్నట్టు?
x

ఉన్నత విద్యా కమిషన్‌ను ఎందుకు రద్దు చేయాలనుకున్నట్టు?

పాత విధానమే మేలని కూటమి ప్రభుత్వం నిర్ణయం.


ఏపీ ఉన్నత విద్యాశాఖలో గత ఐదేళ్లుగా కొనసాగిన కమిషన్ పాలనకు తెరపడనుంది. నిబంధనల పేరుతో విద్యా సంస్థలపై ఉక్కుపాదం మోపుతూ, ఫీజుల ఖరారులో గందరగోళానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందనే అనే కారణాలతో ఈ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ను రద్దు చేసేందుకు కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. న్యాయపరమైన చిక్కులు, కాలేజీల యాజమాన్యాల ఆందోళనల నేపథ్యంలో.. అనాలోచితంగా పుట్టుకొచ్చిన ఈ వ్యవస్థను పక్కనపెట్టి, మళ్లీ పాత చట్టబద్ధమైన ఫీజుల నియంత్రణ కమిటీ (AFRC)ని అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. అసలు ఈ కమిషన్‌ను రద్దు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కొత్తగా ఏర్పాటు చేసిన ఉన్నత విద్య కమిషనరేట్ తో వచ్చే మార్పులేంటి? అనే ఆసక్తికర అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

కమిషన్‌తో చిక్కులేంటి? ఎందుకు ఈ మార్పు?
గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంబంధించి అడ్మిషన్లు, ఫీజులను నిర్ణయించడానికి అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (AFRC) ఉండేది. అయితే, గత వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను పక్కనపెట్టి, దాని స్థానంలో ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ను తీసుకువచ్చింది. ఈ కమిషన్‌కు చట్టబద్ధమైన పరిధులను దాటి అపరిమితమైన అధికారాలు కట్టబెట్టడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇది విద్యాసంస్థల స్వయంప్రతిపత్తిపై ప్రభావం చూపుతుందనే విమర్శలు మొదటి నుంచీ వినిపిస్తూనే ఉన్నాయి.
ఫీజుల తగ్గింపుపై అదృశ్య ఒత్తిడి
వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారీ భారం పడింది. ఈ భారాన్ని తగ్గించుకునే క్రమంలో, కాలేజీల యాజమాన్యాలపై ఒత్తిడి తెచ్చి ఫీజులను పెంచకుండా ఈ కమిషన్ అడ్డుకుందనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి విద్యాసంస్థల నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నా, అందుకు అనుగుణంగా ఫీజుల పెంపునకు అనుమతించకపోవడం వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతిన్నాయని యాజమాన్యాలు వాపోతున్నాయి. కేవలం ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాల కోసమే కమిషన్‌ను ఒక అస్త్రంగా వాడుకున్నారనే విమర్శ ఇక్కడ బలంగా కనిపిస్తోంది.
న్యాయపోరాటాలు.. పెరిగిన గందరగోళం
ఈ కమిషన్ ఏర్పాటు, దాని పనితీరుపై మొదటి నుంచీ న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యాయి. అసలు ఫీజులను ఖరారు చేసే చట్టబద్ధమైన అధికారం ఈ కమిషన్‌కు లేదంటూ పలు ప్రైవేటు విద్యా సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుండటంతో, గత కొంతకాలంగా రాష్ట్రంలో ఫీజుల నిర్ణయంపై తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. ఈ గందరగోళం అటు విద్యార్థులను, ఇటు కాలేజీలను అయోమయంలోకి నెట్టింది. ఈ న్యాయపరమైన చిక్కులను తొలగించి, మళ్లీ చట్టబద్ధమైన కమిటీని తీసుకురావడం ద్వారా విద్యా వ్యవస్థలో స్థిరత్వం తీసుకురావాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
ఆర్డినెన్స్‌ ద్వారా తక్షణ చర్యలు
వచ్చే విద్యా సంవత్సరం నుండి మూడేళ్ల కాలానికి ఉన్నత విద్యా కోర్సుల (ఇంజనీరింగ్, మెడికల్ తదితర) ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. దీనికి కొంత సమయం పడుతుంది కాబట్టి, బడ్జెట్ సమావేశాల తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఈ నెల 20వ తేదీలోపు ఫీజుల నియంత్రణ కమిటీని అమల్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల వాస్తవ పరిస్థితులు మరియు కాలేజీల విజ్ఞప్తుల మేరకు సహేతుకమైన ఫీజులను నిర్ణయించే వెసులుబాటు ప్రభుత్వానికి కలుగుతుంది.
శాఖల విలీనం.. విద్యాశాఖలో భారీ ప్రక్షాళన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ఉన్నత విద్యా కమిషన్‌ను రద్దు చేయడమే కాకుండా, మొత్తం ఉన్నత విద్యాశాఖ స్వరూపాన్నే మార్చేలా భారీ ప్రక్షాళన చేపట్టింది. పరిపాలనలో వేగం పెంచడానికి, వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనివల్ల గతంలో ఉన్న విభజన రేఖలు చెరిగిపోయి, నిర్ణయాధికారాలన్నీ ఒకే కేంద్రీకృత వ్యవస్థ కిందకు రానున్నాయి.
సాంకేతిక విద్యాశాఖ రద్దు.. కమిషనరేట్‌లో విలీనం
ఈ సంస్కరణల్లో భాగంగా ఇప్పటివరకు ప్రత్యేకంగా పనిచేసిన సాంకేతిక విద్యాశాఖను (Technical Education Department) పూర్తిగా రద్దు చేశారు. ఈ శాఖకు సంబంధించిన ఆస్తులు, సిబ్బంది, పరిపాలన బాధ్యతలను కొత్తగా ఏర్పాటు చేసిన ఉన్నత విద్యా కమిషనరేట్ లో విలీనం చేశారు. దీని ఫలితంగా, ఇప్పటివరకు సాంకేతిక విద్యాశాఖ పర్యవేక్షణలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలు ఇకపై నేరుగా ఉన్నత విద్యా కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. ఈ విలీనం ద్వారా సాంకేతిక , సాధారణ ఉన్నత విద్య మధ్య సమన్వయం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
మండలి అధికారాలకు కోత.. ఎగ్జిక్యూటివ్ పవర్స్ బదిలీ
గతంలో ఉన్నత విద్యలో సర్వాధికారిగా వెలిగిన ఉన్నత విద్యా మండలి (APSCHE) అధికారాల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విభజన రేఖ గీసింది. మండలికున్న ఎగ్జిక్యూటివ్ , పరిపాలనా అధికారాలను రద్దు చేసి, వాటిని ఉన్నత విద్యా కమిషనరేట్‌కు బదిలీ చేసింది. ఇకపై అన్ని రకాల కోర్సుల అడ్మిషన్లు, ప్రైవేటు డిగ్రీ, బీఈడీ, పీజీ కాలేజీల అనుమతులు వంటి కీలక అధికారాలన్నీ కమిషనరేట్ చేతుల్లోనే ఉంటాయి. ఉన్నత విద్యా మండలి ఇకపై కేవలం అకడమిక్ అంశాలకే పరిమితం కానుంది. విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడం, కరిక్యులమ్ (పాఠ్యప్రణాళిక) సంస్కరణలు, పరిశోధనలు విద్యా ప్రణాళికల రూపకల్పనపై మాత్రమే మండలి దృష్టి సారించనుంది.
గందరగోళానికి చెక్.. విద్యా వ్యవస్థలో సరికొత్త పారదర్శకత
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖలో తీసుకువస్తున్న ఈ సమూల మార్పుల వెనుక ఉన్న ఏకైక లక్ష్యం.. గత కొన్నేళ్లుగా నెలకొన్న అనిశ్చితికి చరమగీతం పాడటం. దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో ఉన్నత విద్యా ఫీజుల ఖరారుకు ఇప్పటికే ఫీజు నియంత్రణ కమిటీలే (Fee Regulatory Committees) విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ పాత విధానానికి మళ్ళీ ప్రాణం పోయడం ద్వారా, విద్యా సంస్థల నిర్వహణలో గతంలో లోపించిన పారదర్శకతను తిరిగి తీసుకురావచ్చని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది.
ముఖ్యంగా, అనాలోచితంగా పుట్టుకొచ్చిన కమిషన్ల వల్ల తలెత్తిన కోర్టు కేసుల ఇబ్బందులు తొలగిపోయి, అడ్మిషన్ల ప్రక్రియలో వేగం పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ నూతన సంస్కరణల ద్వారా అటు నాణ్యమైన విద్యను కోరుకునే విద్యార్థులకు, ఇటు సంస్థల మనుగడ కోసం పోరాడే యాజమాన్యాలకు మధ్య ఒక సమన్యాయం (Balanced Justice) జరుగుతుందని, తద్వారా రాష్ట్రంలో ఉన్నత విద్య మళ్ళీ గాడిలో పడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Read More
Next Story